జడేజాతో సమన్వయలోపం అశ్విన్ రనౌట్(PC: JIO Cinema)
India vs England, 1st Test - Ashwin Run Out: ఇంగ్లండ్‌తో టెస్టులో టీమిండియా ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ దురదృష్టకరరీతిలో అవుటయ్యాడు. మరో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాతో సమన్వయ లోపం కారణంగా వికెట్ సమర్పించుకున్నాడు. ఊహించని పరిణామంతో కంగుతిని కోపంగా పెవిలియన్‌కు చేరుకున్నాడు.
హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో భారత్- ఇంగ్లండ్ మధ్య గురువారం తొలి టెస్టు ఆరంభమైంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. భారత స్పిన్ ఆల్‌రౌండర్లు అశ్విన్, జడేజా ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది.
బౌలింగ్‌లో దుమ్ములేపారు
అశూ, జడ్డూ చెరో మూడు వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్, జస్‌ప్రీత్ బుమ్రా రెండేసి వికెట్లు పడగొట్టారు. ఈ క్రమంలో 246 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్ కాగా.. తొలిరోజే టీమిండియా కూడా బ్యాటింగ్ మొదలుపెట్టేసింది.
గురువారం ఆట ముగిసే సరికి వికెట్ నష్టానికి 119 పరుగులు చేసింది. ఈ క్రమంలో 119/1 ఓవర్ నైట్ స్కోరుతో శుక్రవారం ఆట మొదలుపెట్టిన టీమిండియా ఆదిలోనే ఓపెనర్ యశస్వి జైస్వాల్(80) వికెట్ కోల్పోయింది.
బ్యాటింగ్‌లోనూ జడ్డూ ఇరగదీశాడు
శుబ్‌మన్ గిల్ కూడా 23 పరుగులకే వెనుదిరిగాడు. ఈ క్రమంలో నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసిన కేఎల్ రాహుల్ 86 పరుగులతో అదరగొట్టాడు. శ్రేయస్ అయ్యర్ 35, కోన శ్రీకర్ భరత్ 41 పరుగులతో పర్వాలేదనిపించారు.
అయితే, భరత్ స్థానంలో క్రీజులోకి వచ్చిన అశ్విన్ మాత్రం కేవలం ఒక్క పరుగుకే అవుట్ కావడం నిరాశపరిచింది. అప్పటికే క్రీజులో పాతుకుపోయిన రవీంద్ర జడేజా నిలకడగా ఆడుతుండగా.. జో రూట్ బౌలింగ్‌లో అశూ కవర్స్ దిశగా షాట్‌కు యత్నించి విఫలమయ్యాడు.
అశూ రనౌట్.. తప్పెవరిది?
అశూ బాదిన బంతిని అందుకున్న ఫీల్డర్ టామ్ హార్ట్లే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఒడిసిపట్టాడు. అయితే, అప్పటికే క్రీజు మధ్య వరకు వచ్చిన అశూను గమనించి జడ్డూ స్పీడ్‌గా రన్ తీసేందుకు యత్నించాడు. కానీ హార్ట్లే అంతకంటే వేగంగా బంతిని వికెట్ కీపర్ బెన్ ఫోక్స్ వైపు త్రో చేశాడు.
అప్పటికి జడ్డూ నాన్ స్ట్రైకర్ ఎండ్‌కు తిరిగి వచ్చేయగా.. అశూ కూడా అక్కడికే చేరుకున్నాడు. దీంతో ఫోక్స్ పని మరింత సులువైంది. హార్ట్లే నుంచి కలెక్ట్ చేసుకున్న బంతిని వికెట్ల మీదకు గిరాటేయగా.. టీమిండియా ఏడో వికెట్ కోల్పోయింది. దీంతో అశూ కోపంగా... మైదానాన్ని వీడాడు.
ఇక రెండో రోజు ఆట ముగిసే సరికి టీమిండియా ఏడు వికెట్ల నష్టానికి 421 పరుగులు చేసింది. తద్వారా ఇంగ్లండ్ కంటే 175 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. రవీంద్ర జడేజా 81, అక్షర్ పటేల్ 35 పరుగులతో క్రీజులో ఉన్నారు.
చదవండి: Ind vs Eng: ఎలా ఆడాలో నేర్చుకో గిల్.. నంబర్ 3లో కొనసాగాలంటే..: కుంబ్లే
Comments
Please login to add a commentAdd a comment