సెహ్వాగ్‌ ఆల్‌టైమ్‌ రికార్డు బద్దలు కొట్టిన జైస్వాల్‌ | Ind vs Eng 4th Test: Yashasvi Jaiswal Breaks Sehwag Record For Sixes | Sakshi
Sakshi News home page

సెహ్వాగ్‌ ఆల్‌టైమ్‌ రికార్డు బద్దలు కొట్టిన జైస్వాల్‌

Published Sat, Feb 24 2024 8:04 PM | Last Updated on Sat, Feb 24 2024 8:33 PM

Ind vs Eng 4th Test: Yashasvi Jaiswal Breaks Sehwag Record For Sixes - Sakshi

India vs England, 4th Test Day 2- Yashasvi Jaiswal: వేదిక ఏదైనా.. ప్రత్యర్థి ఎవరైనా.. ఏమాత్రం బెదురు లేకుండా బ్యాట్‌ ఝులిపించడమే తనకు తెలిసిన విద్య అన్నట్లుగా ముందుకు సాగుతున్నాడు టీమిండియా నయా సంచలనం యశస్వి జైస్వాల్‌. అరంగేట్రంలోనే వెస్టిండీస్‌ గడ్డపై సెంచరీతో చెలరేగి అరుదైన రికార్డులు సాధించాడు ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌.

తాజాగా స్వదేశంలో ఇంగ్లండ్‌తో సిరీస్‌లోనూ అదే జోరును కొనసాగిస్తున్నాడు జైస్వాల్‌. తొలి మూడు టెస్టుల్లో అతడు చేసిన స్కోర్లు వరుసగా.. 80, 15, 209, 17, 10, 214(నాటౌట్‌). తాజాగా రాంచి మ్యాచ్‌ సందర్భంగానూ కూడా విలువైన అర్ధ శతకం బాదాడు.

నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 130 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి టీమిండియా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న వేళ ఈ ఓపెనింగ్‌ బ్యాటర్‌ పట్టుదలగా నిలబడ్డాడు. వరుసగా వికెట్లు పడుతున్నా ఏకాగ్రత కోల్పోకుండా అద్బుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. మొత్తంగా 117 బంతులు ఎదుర్కొని 73 పరుగులు సాధించాడు. ఇందులో 8 ఫోర్లు, ఒక సిక్సర్‌ ఉంది.

ఇంగ్లండ్‌ స్పిన్నర్‌ షోయబ్‌ బషీర్‌ బౌలింగ్‌లో లాంగాన్‌ మీదుగా అద్భుత రీతిలో బాదాడు ఆ సిక్స్‌ను జైస్వాల్‌. తద్వారా టీమిండియా విధ్వంసకర ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ పేరు మీద 16 ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు.

ఒక క్యాలెండర్‌ ఇయర్‌లో టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదిన టీమిండియా బ్యాటర్‌గా అవతరించాడు. సెహ్వాగ్‌ 14 మ్యాచ్‌లు ఆడి 27 ఇన్నింగ్స్‌లో ఈ ఫీట్‌ నమోదు చేస్తే.. జైస్వాల్‌ ఐదో మ్యాచ్‌లోనే ఈ ఘనత సాధించడం మరో విశేషం. 

ఇదిలా ఉంటే.. శనివారం నాటి రెండో రోజు ఆట ముగిసే సరికి టీమిండియా ఏడు వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. అంతకుముందు ఇంగ్లండ్‌ 353 పరుగులకు ఆలౌట్‌ అయింది.

క్యాలెండర్‌ ఇయర్‌లో టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత క్రికెటర్లు
►యశస్వి జైస్వాల్‌- 23* సిక్సర్లు- 2024లో
►వీరేంద్ర సెహ్వాగ్‌- 22 సిక్సర్లు- 2008లో
►రిషభ్‌ పంత్‌- 21 సిక్సర్లు- 2022లో
►రోహిత్‌ శర్మ- 20 సిక్సర్లు- 2019లో
►మయాంక్‌ అగర్వాల్‌- 18 సిక్సర్లు- 2019లో.

చదవండి: Ind Vs Eng 4th Test: ‘ఛీ.. ఛీ.. చీటింగ్‌కు కూడా వెనుకాడరు’.. ఇలా ఉన్నారేంట్రా బాబూ!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement