
మాంచెస్టర్: ఇంగ్లండ్‌తో ఆఖరి టెస్ట్‌కు ముందు భారత స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ఫిట్‌నెస్ అంశం టీమిండియాను కలవరపెడుతోంది. నాలుగో టెస్ట్ సందర్భంగా రోహిత్ 353 నిమిషాల పాటు క్రీజ్‌లో గడపడం వల్ల అతని తొడలు ఎర్రగా కమిలిపొయాయి. బ్యాటింగ్ చేస్తున్న సమయంలో థై ప్యాడ్స్ రాసుకోవడం.. ఇంగ్లండ్ బౌలర్ల బంతులు బలంగా తాకడం వల్ల రోహిత్ రెండు తొడలకు గాయాలయ్యాయి. ఇదే మ్యాచ్‌లో రోహిత్ మోకాలి గాయం కూడా తిరగబెట్టింది. దీంతో ఆఖరి టెస్ట్ సమయానికి రోహిత్ ఫిట్‌నెస్ సాధిస్తాడా లేదా అన్న అంశంపై సందిగ్ధత నెలకొంది. రోహిత్ గాయాల తీవ్రతపై బీసీసీఐ సైతం ఎలాంటి స్పష్టతనివ్వలేదు. ప్రస్తుతం రోహిత్ గాయాన్ని మెడికల్ టీమ్ పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ రోహిత్ గాయం తీవ్రమైతే అతని స్థానంలో పృథ్వీ షా లేదా మయాంక్ అగర్వాల్‌లలో ఒకరు జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే, గాయంతో నాలుగో టెస్ట్‌కు దూరమైన టీమిండియా పేసర్ మహ్మద్ షమీ పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు. అతనితో పాటు నాలుగో టెస్ట్‌లో చీలమండ గాయానికి గురైన పుజారా సైతం పూర్తిగా కోలుకున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. బుధవారం టీమిండియా సాధనలోనూ షమీ పాల్గొన్నాడు. దీంతో శుక్రవారం ప్రారంభమయ్యే అయిదో టెస్ట్‌కు షమీ, పుజారా అందుబాటులో ఉండనున్నాడు. గత మ్యాచ్‌లో అంతగా ఆకట్టుకోలేని సిరాజ్ స్థానంలో షమీ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు గత కొన్ని ఇన్నింగ్స్‌లుగా ఫామ్ లేమితో సతమతమవుతున్న రహానేపై వేటు తప్పేలా లేదు. ఇదే జరిగితే అతని స్థానంలో సూర్యకుమార్ టెస్ట్ అరంగేట్రం చేయడం ఖాయం.
కాగా, ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో ఇప్పటికే 2-1 ఆధిక్యంలో నిలిచిన కోహ్లీ సేన సిరీస్ విజయానికి అడుగు దూరంలో నిలిచింది. ఆఖరి టెస్ట్‌లో గెలిచినా.. డ్రా చేసుకున్న సిరీస్ భారత్ కైవసం చేసుకోనుంది. 50 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఓవల్ మైదానంలో భారత జట్టు అద్భుత విజయాన్నందుకున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో కోహ్లీసేన 157 పరుగుల తేడాతో ఇంగ్లండ్ జట్టును చిత్తు చేసింది.
చదవండి: ఇంగ్లండ్‌లో టీమిండియా పరిమిత ఓవర్ల సిరీస్.. షెడ్యూల్ ఇదే
Comments
Please login to add a commentAdd a comment