India vs England, 1st Test : సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ను టీమిండియా పరాజయంతో ప్రారంభించింది. హైదరాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో పర్యాటక జట్టు చేతిలో 28 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఉప్పల్‌లో గురువారం మొదలైన టెస్టులో తొలి రెండు రోజులు ఆధిపత్యం కొనసాగించిన రోహిత్ సేన.. ఆ తర్వాత పెద్దగా ప్రభావం చూపలేకపోయింది.
ఇంగ్లండ్ విధించిన 231 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో నాలుగో రోజే తలవంచి ఓటమిని ఆహ్వానించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 0-1తో వెనుకబడింది. స్వదేశంలో టీమిండియా ఇలా ఊహించని రీతిలో ఓటమిపాలు కావడంతో రోహిత్ సేనపై విమర్శల వర్షం కురుస్తోంది.
వాళ్ల విషయంలోనూ డిఫెన్సివ్‌గా ఎందుకు?
తొలి టెస్టులో భారత్ ఆట తీరు, రోహిత్ శర్మ కెప్టెన్సీపై వెటరన్, మాజీ క్రికెటర్లు పెదవి విరుస్తున్నారు. టీమిండియా వికెట్ కీపర్ దినేశ్ కార్తిక్ స్పందిస్తూ.. ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో భారత్ పూర్తి రక్షణాత్మక ధోరణిలో ఆడిందని విమర్శించాడు.
ఒలి పోప్ వంటి బ్యాటర్ విషయంలో డిఫెన్సివ్‌గా ఉండటంలో తప్పులేదని.. కానీ.. టామ్ హార్లీ వంటి టెయిలెండర్ల విషయంలోనూ అదే తరహాలో ఆడటం సరికాదని డీకే అభిప్రాయపడ్డాడు. స్పిన్నర్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ ఇంకాస్త మెరుగ్గా అటాకింగ్ చేసి ఉంటే బాగుండన్నాడు. ఈ మేరకు జియో సినిమా షోలో దినేశ్ కార్తిక్ వ్యాఖ్యలు చేశాడు.
టీమిండియాను ఇంత బేలగా చూడలేదు
ఇక భారత జట్టు మాజీ హెడ్‌కోచ్ రవిశాస్త్రి మాట్లాడుతూ.. సొంతగడ్డపై టీమిండియా ఇంతకు ముందెన్నడూ ఇంత బేలగా చూడలేదన్నాడు. రోహిత్ సేన పూర్తిగా ఒత్తిడిలో కూరుకుపోవడం.. థర్డ్ ఇన్నింగ్స్‌లో పర్యాటక జట్టుకు 400 పైచిలుకు పరుగులు చేసే అవకాశం ఇవ్వడం తనని ఆశ్చర్యపరిచిందని అన్నాడు.
భారత ఆటగాళ్ల బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే ఆడుతుంది అసలు మనవాళ్లేనా అన్న సందేహం కలిగిందని వాపోయాడు. కాగా ఇంగ్లండ్ వన్‌డౌన్ బ్యాటర్ ఒలీ పోప్ ఈ మ్యాచ్‌లో 196 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే.
చదవండి: IND Vs ENG: ఇంట్లోనే తలవంచారు... భారత్ వర్సెస్ ఇంగ్లండ్ మ్యాచ్ పూర్తి వివరాలు
Comments
Please login to add a commentAdd a comment