న్యూజిలాండ్‌తో తొలి టెస్టు ఆరంభంలో టీమిండియాకు చేదు అనుభవం ఎదురైంది. మొదటి ఇన్నింగ్స్‌లో మరీ దారుణంగా 46 పరుగులకే కుప్పకూలింది. ఇందుకు కెప్టెన్ రోహిత్ శర్మనే కారణమంటూ భారత జట్టు అభిమానులు మండిపడుతున్నారు. విశ్లేషకులు సైతం రోహిత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకోవడాన్ని విమర్శిస్తున్నారు. సారథి నిర్ణయమే కొంపముంచిందని అభిప్రాయపడుతున్నారు.
రోహిత్ శర్మ స్పందన
ఈ క్రమంలో తనపై వస్తున్న విమర్శలపై రోహిత్ శర్మ స్పందించాడు. తాను పిచ్‌ను సరిగ్గా అంచనా వేయలేకపోయానని విచారం వ్యక్తం చేశాడు. తొలుత బ్యాటింగ్ చేయాలన్న తన నిర్ణయం బెడిసికొట్టిందని తెలిపాడు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 ఫైనల్ చేరే క్రమంలో టీమిండియా స్వదేశంలో న్యూజిలాండ్‌తో మూడు టెస్టుల సిరీస్ ఆడుతోంది.
ఇందులో భాగంగా బెంగళూరులో బుధవారం తొలి మ్యాచ్ ఆరంభం కావాల్సి ఉండగా.. వర్షం కారణంగా మొదటి రోజు ఆట సాధ్యపడలేదు. అయితే,గురువారం వాన తెరిపినివ్వడంతో ఆట మొదలు కాగా.. టాస్ గెలిచిన రోహిత్ శర్మ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
బ్యాటర్లు మూకుమ్మడిగా విఫలం
అయితే, కివీస్ సీమర్ల విజృంభణ ముందు భారత బ్యాటింగ్ నిలవలేకపోయింది. 34 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి.. మరో 12 పరుగుల వ్యవధిలోనే ఆలౌట్ అయిపోయింది. స్టార్ బ్యాటర్లు యశస్వి జైస్వాల్(13), రోహిత్ శర్మ(2), విరాట్ కోహ్లి(0), సర్ఫరాజ్ ఖాన్(0), కేఎల్ రాహుల్(0) మూకుమ్మడిగా విఫలం కాగా.. ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా(0), రవిచంద్రన్ అశ్విన్(0) కూడా చేతులెత్తేశారు.
అదే పిచ్‌పై కివీస్ ‘హిట్’
అయితే, ఇదే చిన్నస్వామి పిచ్‌పై కివీస్ గురువారం ఆట ముగిసే సరికి 50 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు నష్టపోయి 180 పరుగులు చేసింది. ఓపెనర్ డెవాన్ కాన్వే 105 బంతుల్లోనే 91 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో ఆట ముగిసిన అనంతరం రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడాడు.
తప్పు నాదే.. పిచ్‌ను సరిగా అంచనా వేయలేకపోయా
‘‘తొలి సెషన్ తర్వాత పిచ్ సీమర్లకు అంతగా అనుకూలించదని భావించాం. వికెట్ మీద పచ్చిక కూడా అంతగా లేదు. నిజానికి రానురాను బంతి బాగా టర్న్ అవుతుందని మేము భావించాం. అయితే, నా అంచనా తప్పింది. పిచ్ స్వభావాన్ని నేను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను.
సీమర్లకు స్వర్గంలా మారిన పిచ్‌పై మేము 46 పరుగులకే ఆలౌట్ అయ్యాము. షాట్ సెలక్షన్ సరిగ్గా లేదని చెప్పవచ్చు. అయితే, కొన్నిసార్లు అనుకున్న ప్రణాళికలను అమలు చేయడంలో తడబడతాం. ఏదేమైనా ఈరోజు మాకు దుర్దినం’’ అని రోహిత్ శర్మ విచారం వ్యక్తం చేశాడు.
చదవండి: IND Vs NZ 1st Test: అసలేం చేశావు నువ్వు?: రోహిత్ శర్మ ఆగ్రహం
Comments
Please login to add a commentAdd a comment