ఇషాన్‌ కిషన్‌ కీలక నిర్ణయం! ఆటకు దూరం.. కారణం? | Ind vs SA: Ishan Kishan Requested For Break Due To Mental Fatigue - Report - Sakshi
Sakshi News home page

ఇషాన్‌ కిషన్‌ కీలక నిర్ణయం! ఆటకు దూరం.. కారణం?

Published Sat, Dec 23 2023 11:27 AM | Last Updated on Sat, Dec 23 2023 12:02 PM

Ind vs SA: Ishan Kishan Requested For Break Due To Mental Fatigue: Report - Sakshi

ఇషాన్‌ కిషన్‌ (PC: X)

Ishan Kishan- Mental Fatigue: టీమిండియా యువ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ఇషాన్‌ కిషన్‌ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మానసికంగా అలసిపోయానంటూ 25 ఏళ్ల ఈ లెఫ్టాండ్‌ బ్యాటర్‌ కొన్నాళ్ల పాటు క్రికెట్‌కు దూరంగా ఉండాలనుకుంటున్నట్లు సమాచారం.

కాగా 2021లో టీ20ల ద్వారా టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన ఈ జార్ఖండ్‌ బ్యాటర్‌.. అదే ఏడాది వన్డేల్లోనూ అడుగుపెట్టాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఓపెనర్‌గా పలు అవకాశాలు దక్కించుకున్న ఇషాన్‌ ఖాతాలో ఇప్పటి వరకు ఓ సెంచరీ, ఓ డబుల్‌ సెంచరీ ఉంది.

ఆరంభంలో వరుసగా అవకాశాలు అందిపుచ్చుకున్నప్పటికీ సహచర ఆటగాడు, తన స్నేహితుడు శుబ్‌మన్‌ గిల్‌ నుంచి ఎదురైన పోటీలో ఇషాన్‌ వెనుకబడిపోయాడు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు జోడీగా ఓపెనర్‌గా గిల్‌ తన స్థానం సుస్థిరం చేసుకోగా.. వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ఇషాన్‌ కిషన్‌కు మాత్రం అవకాశాలు సన్నగిల్లాయి.

గిల్‌ సూపర్‌స్టార్‌గా ఎదుగుతున్నాడు.. ఇషాన్‌ మాత్రం
కేఎల్‌ రాహుల్‌ రూపంలో మరో వికెట్‌ కీపర్‌ అందుబాటులో ఉండటంతో అతడికి ప్రాధాన్యం తగ్గింది. ఈ క్రమంలో సీనియర్ల గైర్హాజరీలో మిడిలార్డర్‌లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకున్న ఇషాన్‌ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. మరోవైపు.. గిల్‌ మూడు ఫార్మాట్లలో సూపర్‌స్టార్‌గా ఎదుగుతుండగా.. ఇషాన్‌కు ఇంత వరకు టెస్టుల్లో తనను తాను నిరూపించుకునే అవకాశం రాలేదు.

యశస్వి జైశ్వాల్‌ నుంచి గట్టిపోటీ కూడా ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో గతేడాది కాలంగా జట్టుతో పాటే ప్రయాణిస్తున్నా.. తుదిజట్టులో పెద్దగా ఛాన్సులు కూడా రావడం లేదు. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు ఎంపికైనప్పటికీ ఇషాన్‌ కిషన్‌ వ్యక్తిగత కారణాల దృష్ట్యా స్వదేశానికి తిరిగి వచ్చేశాడు.

మానసిక ఒత్తిడి తట్టుకోలేకపోతున్నా
రెండు మ్యాచ్‌ల సిరీస్‌ నుంచి విరామం తీసుకున్నాడు. దీంతో అతడి స్థానంలో ఆంధ్ర క్రికెటర్‌, వికెట్‌ కీపర్‌ కోన శ్రీకర్‌ భరత్‌ టీమిండియాతో కలవనున్నాడు. ఈ నేపథ్యంలో ఇషాన్‌ కిషన్‌కు సంబంధించిన కీలక వార్త తెరమీదకు వచ్చింది. మానసిక ఒత్తిడి తట్టుకోలేకనే అతడు స్వదేశానికి తిరిగి వచ్చినట్లు తెలుస్తోంది.

‘‘మానసికంగా అలసిపోయానని.. తనకు క్రికెట్‌ నుంచి కొన్నాళ్ల పాటు విరామం కావాలంటూ ఇషాన్‌ కిషన్‌ యాజమాన్యంతో చెప్పాడు. మేనేజ్‌మెంట్‌ కూడా ఇందుకు అంగీకరించింది’’ అని బీసీసీఐ సన్నిహిత వర్గాలు తెలిపినట్లు జాతీయ మీడియా వెల్లడించింది. గతేడాది కాలంగా విరామం లేకుండా జట్టుతో ప్రయాణించిన ఇషాన్‌ ప్రస్తుతం విశ్రాంతి కోరుకుంటున్నట్లు తెలిపింది. 

వన్డేల్లో దుమ్ములేపినా.. 
ఇక ఈ ఏడాది ఇషాన్‌ కిషన్‌ రెండు టెస్టులు, 17 వన్డేలు, 11 టీ20లు ఆడాడు. వెస్టిండీస్‌ పర్యటన సందర్భంగా టెస్టుల్లో అరంగేట్రం చేసిన ఇషాన్‌ 52 పరగులు చేయగా.. 17 వన్డేల్లో కలిపి 456 పరుగులు సాధించాడు. టీ20లలో ఈ ఏడాది 207 రన్స్‌ తీశాడు.

కాగా గతంలోనూ గ్లెన్‌ మాక్స్‌వెల్‌ వంటి చాలా మంది క్రికెటర్లు మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు ఆటకు విరామిచ్చిన విషయం తెలిసిందే. ఇషాన్‌ కూడా అలాగే కొన్నాళ్లపాటు విశ్రాంతి తీసుకుని రెట్టించిన ఉత్సాహంతో తిరిగి రావాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

చదవండి: Sanju Samson: వాళ్ల గురించి ఫిర్యాదు చేయను.. అనేక ఒత్తిళ్ల నడుమ: సంజూ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement