![IND Vs SL 3rd ODI: Indias Conundrum Whether To Experiment Or Not After Series Win - Sakshi](/styles/webp/s3/article_images/2021/07/22/Untitled-4.jpg.webp?itok=vXyhOGkZ)
కొలొంబో: శ్రీలంకతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌ను ఇదివరకే 2-0తో కైవసం చేసుకున్న టీమిండియా నామమాత్రమైన మూడో వన్డేకు సిద్ధమవుతోంది. రేపు(జులై 23) జరుగబోయే మ్యాచ్‌లో ఎలాగైనా విజయం సాధించి క్లీన్ స్వీప్ చేయాలనే పట్టుదలతో టీమిండియా ఉండగా, ఒక్క మ్యాచ్‌లోనైనా నెగ్గి పరువు నిలుపుకోవాలని ఆతిధ్య లంక జట్టు భావిస్తోంది. అయితే రేపటి మ్యాచ్‌లో టీమిండియాలో మార్పులేమైనా ఉంటాయా.. లేక పాత జట్టునే యధావిధిగా కొనసాగిస్తారా అన్నది సందిగ్ధంగా మారింది. టీమిండియా తుది జట్టులో ఎవరెవరికి అవకాశాలు ఉంటాయన్న అంశంపై విశ్లేషిస్తే.. ఓపెనర్ మార్పు స్పష్టంగా కనిపిస్తుంది.
కెప్టెన్ గబ్బర్‌కు తోడుగా మరో కొత్త ఓపెనర్ బరిలోకి దిగే అవకాశం ఉంది. పృథ్వీ షా (43, 13) స్థానంలో దేవదత్ పడిక్కల్, రుత్‌రాజ్ గైక్వాడ్‌లో ఒకరికి ఛాన్స్ దక్కవచ్చు. ఒకవేళ జట్టు యాజమాన్యం టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుంటే మాత్రం షాను తప్పించడం కష్టం. దీంతో ధవన్ పార్ట్‌నర్ ప్లేస్ కోసం త్రిముఖ పోరు నెలకొంది. వన్‌డౌన్ విషయానికొస్తే.. ఇషాన్ కిషన్ బదులు సంజు సామ్సన్‌కు అవకాశం దక్కినా ఆశ్చర్యపోనక్కర్లేదు. పైగా ద్రవిడ్‌కు సామ్సన్‌పై మంచి అభిప్రాయమే ఉంది. ఇక మిడిలార్డర్‌లో మనీశ్ పాండే, సూర్యకుమార్ యాదవ్ స్థానాలకు ఎటువంటి ఢోకా ఉండకపోవచ్చు. వారిద్దరూ తమతమ స్థానాలకు న్యాయం చేస్తున్నారని ద్రవిడ్ భావిస్తున్నారు.
ఫిట్‌నెస్ ఇబ్బందులేమీ లేవు కాబట్టి హార్దిక్ పాండ్యకు చోటు కూడా దాదాపుగా ఖాయమే. అయితే టీ20 సిరీస్‌ను దృష్టిలో పెట్టుకుంటే మాత్రం అతనికి విశ్రాంతినివ్వొచ్చు. కృనాల్ పాండ్యను జట్టులో నుంచి తప్పించలేని పరిస్థితి. స్పిన్నర్ల కోటాలో చహల్ (2/52, 3/50) ప్లేస్ పదిలం కాగా, కుల్‌దీప్ (2/48, 0/55) స్థానంలో రాహుల్ చాహర్‌కు అవకాశం దక్కవచ్చు. ఒకవేళ చహల్‌కు కూడా విశ్రాంతినివ్వాలని జట్టు యాజమాన్యం భావిస్తే.. కృష్ణప్ప గౌతమ్‌ను అవకాశం దక్కవచ్చు.
ఇక పేస్ బౌలర్ల విషయానికొస్తే.. ఈ విభాగానికి నాయకుడైన భువీకి ఎటువంటి ఇబ్బంది లేకపోగా, టీ20 సిరీస్‌ను దృష్టిలో పెట్టుకుని దీపక్ చాహర్‌కు విశ్రాంతినివ్వడం ఖాయంగా కనిపిస్తోంది. అతని స్థానంలో ఎడమచేతి వాటం పేసర్ చేతన్ సకారియా అరంగేట్రం చేసే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే గత మ్యాచ్‌లో టీమిండియాకు గట్టి పోటీనిచ్చిన లంక జట్టును యధాతధంగా కొనసాగించే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment