
లంక ఆటగాళ్లతో ధావన్ సంభాషణ(ఫొటో: ఎస్‌ఎల్ క్రికెట్)
కొలంబో: ‘‘సీనియర్ ఆటగాళ్ల సలహాలు, సూచనలు.. అనుభవం గురించి తెలుసుకోవడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. నిజంగా నేను శిఖర్‌కు కృతజ్ఞుడినై ఉంటాను. తను చెప్పిన విషయాలు నాకు ఉపయోగపడతాయి. తనతో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెబుతున్నా. దశాబ్ద కాలంగా అంతర్జాతీయ క్రికెట్‌లో తనదైన శైలిలో రాణిస్తున్న శిఖర్ నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది’’ అని శ్రీలంక కెప్టెన్ దసున్ షనక, టీమిండియా సారథి(ద్వితీయ శ్రేణి జట్టు) శిఖర్ ధావన్‌పై ప్రశంసలు కురిపించాడు.
మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా చివరిదైన, గురువారం నాటి మ్యాచ్‌లో భారత్‌పై, శ్రీలంక ఏడు వికెట్లతో ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2–1తో కైవసం చేసుకుంది. ఈ క్రమంలో మ్యాచ్ అనంతరం శ్రీలంక ఆటగాళ్లు, టీమిండియా కెప్టెన్ శిఖర్ ధావన్‌తో కాసేపు ముచ్చటించారు. ఇందుకు సంబంధించిన ఫొటోను శ్రీలంక క్రికెట్.. ట్విటర్‌లో షేర్ చేయగా వైరల్ అయింది.
ఈ విషయం గురించి దసున్ షనక ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ... ‘‘ఏదైనా ఒక మ్యాచ్‌కు ముందు మీరు ఎలా సన్నద్ధమవుతారు? గేమ్‌ను ఎలా ప్లాన్ చేసుకుంటారు? అన్న విషయాల గురించి శిఖర్‌ను అడిగాను. తను పలు సూచనలు, సలహాలు ఇచ్చాడు. వ్యక్తిగతంగా శిఖర్ ధావన్ వంటి క్రికెటర్‌తో మాట్లాడటం నాలాంటి వాళ్లకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది’’ అని తమ మధ్య జరిగిన సంభాషణ గురించి చెప్పుకొచ్చాడు.
ఇక భారత జట్టులోని ఆటగాళ్లంతా మైదానంలో ఎంతో సానుకూల దృక్పథంతో ఉంటారన్న షనక... ఇందుకు గల కారణాల గురించి కోచ్ రాహుల్ ద్రవిడ్‌ను అడిగి తెలుసుకున్నామని పేర్కొన్నాడు. అదే విధంగా తమతో ద్వైపాక్షిక సిరీస్‌కు అంగీకరించినందుకు బీసీసీఐ, ద్రవిడ్, ధావన్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపాడు.
WATCH: Sri Lanka seal series | 3rd T20I Highlights - https://t.co/HCbpZJOpQy#SLvIND
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) July 30, 2021
Sharing the wisdom 🇱🇰🤝🇮🇳
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) July 29, 2021
A brilliant gesture by Indian Captain 🙌#SLvIND pic.twitter.com/gLFvn3EUo6