నువ్వు తేలిగ్గా తలొగ్గే రకం కాదు: గంభీర్‌కు ద్రవిడ్‌ సందేశం | IND Vs SL: Rahul Dravid Surprise Message Makes Gambhir Emotional Ahead Of 1st T20I, Video Goes Viral | Sakshi
Sakshi News home page

IND Vs SL: నువ్వు తేలిగ్గా తలొగ్గే రకం కాదు.. ద్రవిడ్‌ మెసేజ్‌.. గంభీర్‌ భావోద్వేగం

Published Sat, Jul 27 2024 11:28 AM | Last Updated on Sat, Jul 27 2024 12:14 PM

Ind vs SL: Dravid Surprise Message Makes Gambhir Emotional Ahead Of 1st T20I

‘‘హలో గౌతం.. భారత క్రికెట్‌ ప్రపంచంలోని అత్యంత ఆసక్తికరమైన విధుల నిర్వహణకు సమాయత్తమైన నీకు స్వాగతం పలుకుతున్నా. మూడు వారాల క్రితం.. టీమిండియా హెడ్‌కోచ్‌గా నేను కన్న కలలు బార్బడోస్‌లో నెరవేరాయి. ఇక ముంబైలో అందుకు సంబంధించిన సంబరాల సాయంత్రాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను.

అయితే, జట్టుతో నా స్నేహం, నేను పోగు చేసుకున్న మధుర జ్ఞాపకాలు మరెన్నో ఉన్నాయి. భారత జట్టు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు స్వీకరించబోతున్న నీకు కూడా ఇలాంటి జ్ఞాపకాలు లభించాలని కోరుకుంటున్నాను. నీ హయాంలోప్రతి జట్టులోనూ  నువ్వు కోరుకున్న ఆటగాళ్లు పూర్తి ఫిట్‌గా ఉండి.. నీ ప్రణాళికలకు అనుగుణంగా అందుబాటులో ఉండాలని ఆకాంక్షిస్తున్నా.

నువ్వు తేలికగా తలొగ్గేరకం కాదు
నిజానికి కోచ్‌ అంటే.. మనం సాధారణంగా ఆలోచించే దానికంటే కూడా మరింత తెలివిగా.. ఇంకాస్త స్మార్ట్‌గా ఉండాలి. నీకు ఇవన్నీ తెలుసుననుకో. నీ సహచర ఆటగాడిగా మైదానంలో నువ్వు ఎలా ఉంటావో నాకు తెలుసు. నీ బ్యాటింగ్‌ పార్ట్‌నర్‌గా.. తోటి ఫీల్డర్‌గా నీ నైపుణ్యాలు దగ్గరగా చూశాను. ప్రత్యర్థి ముందు నువ్వు తేలికగా తలొగ్గేరకం కాదు.

ఐపీఎల్‌లోనూ నీలో ఇలాంటి ఆటతీరునే చూశాను. గెలుపు కోసం నువ్వు ఎంత పరితపిస్తావో నాకు తెలుసు. యువ ఆటగాళ్లలో స్ఫూర్తి నింపి వారిలో విజయకాంక్ష రగిల్చే తీరు అద్భుతం. టీమిండియా కోచ్‌గానూ నువ్విలాగే ఉండాలి. భారీ అంచనాల నడుమ కీలక బాధ్యత తీసుకోబోతున్నావు.

జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడు, సహాయక సిబ్బంది.. గెలిచినా.. ఓడినా నీ వెన్నంటే ఉంటారు. విజయాల్లోనే కాదు.. చేదు అనుభవాలను సమంగా పంచుకుంటారు. కొన్నిసార్లు మనం వెనకడుగు వేయాల్సి వస్తుంది. నీ స్వభావానికి ఇది విరుద్ధమని నాకు తెలుసు. అయితే, చిరునవ్వుతో అన్నింటినీ జయించగలవు.

ఇక్కడ ఏ చిన్న సంఘటన అయినా అభిమానులకు ఆసక్తికరమే. కాబట్టి నీ కదలికలన్నీ గమనిస్తూనే ఉంటారు. ఏదేమైనా భారత క్రికెట్‌ను మరింత ఉన్నత శిఖరాలకు చేర్చగల సత్తా నీకు ఉంది. ఆల్‌ ది వెరీ బెస్ట్‌ గౌతం’’ అంటూ టీమిండియా మాజీ హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ గౌతం గంభీర్‌కు ప్రత్యేక సందేశం పంపించాడు.

గంభీర్‌ భావోద్వేగం
శ్రీలంక పర్యటనలో భాగంగా భారత క్రికెట్‌ జట్టు నూతన ప్రధాన కోచ్‌గా గంభీర్‌ ప్రస్థానం మొదలుకానున్న వేళ.. తన వారసుడిని ప్రత్యేకంగా విష్‌ చేశాడు. ఇందుకు స్పందించిన గౌతీ.. ద్రవిడ్‌కు ధన్యవాదాలు తెలిపాడు. తాను ఇంత వరకు చూసిన నిస్వార్థమైన క్రికెటర్లలో ఒకడైన రాహుల్‌ భాయ్‌ నుంచి మెసేజ్‌ అందుకోవడం సంతోషంగా ఉందన్నాడు. సాధారణంగా తాను ఎమోషనల్‌కానని.. అయితే, రాహుల్‌ భాయ్‌ మాటలు విని తీవ్ర ఉద్వేగానికి లోనయ్యానని తెలిపాడు.

నిజాయితీ, పారదర్శకతతో వ్యవహరిస్తూ ద్రవిడ్‌ విడిచి వెళ్లిన వారసత్వాన్ని కొనసాగిస్తానని స్పష్టం చేశాడు. దేశంతో పాటు రాహుల్‌ భాయ్‌ను కూడా సగర్వంగా తలెత్తుకునేలా చేస్తానని గంభీర్‌ ఉద్వేగపూరిత వ్యాఖ్యలు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ షేర్‌ చేయగా.. నెట్టింట వైరల్‌ అవుతోంది. కాగా శ్రీలంక- టీమిండియా మధ్య శనివారం నాటి తొలి టీ20తో ద్వైపాక్షిక సిరీస్‌ మొదలుకానుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement