‘చెత్తగా ఆడండి.. అప్పుడు అసలైన గంభీర్‌ను చూస్తారు’ | Let India Have Bad Game Gambhir Real Character Will Come Out :Tamim Iqbal | Sakshi
Sakshi News home page

అలా జరిగితే గంభీర్‌ విశ్వరూపం చూస్తారు: బంగ్లాదేశ్‌ క్రికెటర్‌

Published Fri, Sep 27 2024 4:56 PM | Last Updated on Fri, Sep 27 2024 5:22 PM

Let India Have Bad Game Gambhir Real Character Will Come Out :Tamim Iqbal

టీమిండియా హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌ గురించి బంగ్లాదేశ్‌ వెటరన్‌ క్రికెటర్‌ తమీమ్‌​ ఇక్బాల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టును విజయపథంలో నడపగల సత్తా గౌతీకి ఉందని.. అయితే, అతడి కోచింగ్‌ స్టైల్‌ గురించి ఇప్పుడే అంచనాకు రాలేమన్నాడు. టీమిండియా చెత్తగా ఆడినపుడు గంభీర్‌ ‘నిజ స్వరూపం’ బయటపడుతుందని వ్యాఖ్యానించాడు.

ద్రవిడ్‌ తర్వాత
టీ20 ప్రపంచకప్‌-2024లో రోహిత్‌ సేన చాంపియన్‌గా నిలిచిన అనంతరం రాహుల్‌ ద్రవిడ్‌ ప్రధాన కోచ్‌ పదవి నుంచి వైదొలిగాడు. అతడి స్థానంలో మాజీ ఓపెనర్‌ గౌతం గంభీర్‌ను టీమిండియా హెడ్‌కోచ్‌గా నియమించింది బీసీసీఐ. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌(రెండుసార్లు ప్లే ఆఫ్స్‌) జట్టుకు మార్గదర్శనం చేయడంతో పాటు.. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ను చాంపియన్‌గా నిలిపిన మెంటార్‌గా ఘనత వహించిన అతడికి భారత జట్టు బాధ్యతలు అప్పగించింది.

తన దూకుడు వైఖరికి విరుద్ధంగా
శ్రీలంక పర్యటన సందర్భంగా జూలైలో కోచ్‌గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన గంభీర్‌కు శుభారంభం దక్కింది. సూర్యకుమార్‌ సేన ఆతిథ్య జట్టు టీ20 సిరీస్‌లో 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. అయితే, వన్డే సిరీస్‌లో మాత్రం రోహిత్‌ సేనకు ఘోర పరాభవం ఎదురైంది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత శ్రీలంక చేతిలో సిరీస్‌ ఓడిపోయింది. 

రెండో ప్రయత్నంలోనే గంభీర్‌కు ఇలాంటి చేదు అనుభవం ఎదురైనా.. తన దూకుడు వైఖరికి విరుద్ధంగా ప్రశాంతంగానే కనిపించాడు. ఈ క్రమంలో స్వదేశంలో తాజాగా బంగ్లాదేశ్‌తో సిరీస్‌తో టెస్టుల ప్రయణాన్ని మొదలుపెట్టిన గంభీర్‌కు.. రోహిత్‌ సేన ఘన విజయంతో స్వాగతం పలికింది. చెన్నై టెస్టులో బంగ్లాను 280 పరుగుల తేడాతో చిత్తు చేసి క్లీన్‌స్వీప్‌పై కన్నేసింది. 

గంభీర్‌ విశ్వరూపం చూస్తారు
ఈ నేపథ్యంలో భారత్‌- బంగ్లా సిరీస్‌కు కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న తమీమ్‌ ఇక్బాల్‌ జియో సినిమా షోలో మాట్లాడుతూ గంభీర్‌ గురించి తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ‘‘మీరు(టీమిండియా) వరుసగా గెలుస్తూ ఉంటే.. అతడి మనసులో నిజంగా ఏం దాగుందో బయటకు రాదు. 

మీరు ఎప్పుడైతే ఓ సిరీస్‌ కోల్పోతారో.. ఆ వెంటనే మరొకటి ఓడిపోతారో.. అప్పుడు తన నిజ స్వరూపం బయటపడుతుంది. జట్టును విజయవంతంగా ముందుకు నడిపించగల సామర్థం అతడికి ఉంది. అయితే, ఇప్పుడే తన కోచింగ్‌ స్టైల్‌పై నిశ్చితాభిప్రాయానికి రాకూడదు. 

టీమిండియా ఒక్క చెత్త మ్యాచ్‌ ఆడనివ్వండి.. అప్పుడు తెలుస్తుంది’’ అని తమీమ్‌ ఇక్బాల్‌ పేర్కొన్నాడు. గంభీర్‌ మరీ అంత కూల్‌ కాదని.. జట్టు ఓటములపాలైతే ఆటగాళ్ల పట్ల కఠినంగా వ్యవహరించడానికి వెనుకాడడని అభిప్రాయపడ్డాడు.

గంభీర్‌ ముందున్న సవాళ్లు
వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ 2023-25 ఫైనల్‌ చేరడం సహా చాంపియన్స్‌ ట్రోఫీ-2025, టీ20 ప్రపంచకప్‌-2026, వన్డే వరల్డ్‌కప్‌-2027 రూపంలో గంభీర్‌కు కఠిన సవాళ్లు ఎదురుకానున్నాయి.

చదవండి: జడేజా ప్రపంచ రికార్డు.. 147 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement