బంగ్లాదేశ్ క్రికెటర్ ముష్ఫికర్ రహీం చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో తమ దేశం తరఫున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. టీమిండియాతో తొలి టెస్టు సందర్భంగా ఈ ఘనత సాధించాడు. వికెట్ కీపర్ బ్యాటర్ ముష్ఫికర్ 2005లో బంగ్లాదేశ్ తరఫున అరంగేట్రం చేశాడు.
ఇప్పటి వరకు 90 టెస్టులు, 271 వన్డేలు, 102 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. టెస్టులో 5892, వన్డేల్లో 7792, టీ20లలో 1500 పరుగులు సాధించాడు. అయితే, టీమిండియాతో తాజా టెస్టు సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో ముష్ఫికర్ పెద్దగా రాణించలేకపోయాడు.
తమీమ్ ఇక్బాల్‌ను అధిగమించి
తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 8 పరుగులకే నిష్క్రమించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. రెండో ఇన్నింగ్స్‌లో 13 రన్స్ మాత్రమే చేయగలిగాడు. అయితే, మొత్తంగా 21 పరుగులు చేయగలిగిన ముష్ఫికర్.. తన అంతర్జాతీయ కెరీర్‌లో 15,196 రన్స్ పూర్తి చేసుకున్నాడు. తద్వారా తమీమ్ ఇక్బాల్(15192)ను అధిగమించి.. బంగ్లాదేశ్ తరఫున ఇంటర్నేషనల్ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా రికార్డులకెక్కాడు.
ఇంకో 357 పరుగులు అవసరం
ఇదిలా ఉంటే.. చెన్నై వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్‌కు టీమిండియా 515 పరుగుల భారీ లక్ష్యం విధించింది. కాగా శనివారం నాటి మూడో రోజు ఆట ముగిసే సరికి బంగ్లా.. 37.2 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది.
ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ గెలుపొందాలంటే ఇంకో 357 పరుగులు అవసరం. టీమిండియా బౌలర్లలో పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఒకటి, రవిచంద్రన్ అశ్విన్‌కు మూడు వికెట్లు తీశారు. ఇదిలా ఉంటే.. వెలుతురులేమి కారణంగా శనివారం అరగంట ముందుగానే ఆటను ముగించడం గమనార్హం.
బంగ్లాదేశ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్లు
15196- ముష్ఫికర్ రహీం *
15192- తమీమ్ ఇక్బాల్
14696- షకీబ్ అల్ హసన్
10694- మహ్మదుల్లా
చదవండి: భారీ లక్ష్యం.. బంగ్లాదేశ్ ఒక్కటీ గెలవలేదు!.. టీమిండియాదే విజయం!
Comments
Please login to add a commentAdd a comment