ఆసియా కప్-2023లో భాగంగా కొలొంబో వేదికగా శ్రీలంకతో ఇవాళ (సెప్టెంబర్ 12) జరుగుతున్న సూపర్-4 మ్యాచ్‌లో భారత ప్రధాన బౌలర్ జస్ప్రీత్ బుమ్రా పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. బౌలింగ్ చేస్తున్న సందర్భంగా బుమ్రా తన చీలమండపై వికృతంగా ల్యాండ్ అయినప్పుడు భారతీయ క్రికెట్ అభిమానులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అయితే, బుమ్రా తిరిగి యధావిధిగా బౌలింగ్ కంటిన్యూ చేయడంతో భారత అభిమానులంతా ఊపిరి పీల్చుకున్నారు.
రోజుల వ్యవధిలో వన్డే వరల్డ్‌కప్ జరుగనుండటం భారత అభిమానుల ఈ స్థాయికి ఆందోళనకు కారణం. బుమ్రా లాంటి ప్రధాన బౌలర్ ప్రపంచకప్‌కు ముందు గాయపడితే, అది భారత విజయావకాశాలను తీవ్రస్థాయిలో ప్రభావితం చేస్తుంది కాబట్టి, టీమిండియా ఫ్యాన్స్ ఈ స్థాయిలో ఆందోళన చెందారు. అయితే బుమ్రా ఈ ఘటన జరిగిన తర్వాత తిరిగి యధావిధిగా బౌలింగ్ చేయడమే కాకుండా రెండు కీలక వికెట్లు కూడా పడగొట్టి, శ్రీలంకను కష్టాల్లోకి నెట్టాడు.
ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లోనే ఈ ఘటన చోటు చేసుకుంది. తొలి ఓవర్ తర్వాత బుమ్రా డ్రస్సింగ్ రూమ్‌కు వెళ్లడంతో టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్ ప్రాణాలు గాల్లోక తేలాయి. బుమ్రానే కాదు ప్రస్తుత పరిస్థితుల్లో ఏ ఆటగాడు గాయపడిన భారత క్రికెట్ అభిమానుల పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఎందుకంటే ఎన్నడూ లేనంతగా టీమిండియాపై ఈ సారి అంచనాలు ఉన్నాయి. టీమిండియా స్వదేశంలో ఈసారి ఖచ్చితంగా ప్రపంచకప్ గెలుస్తుందని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు.
ఇదిలా ఉంటే, శ్రీలంకతో ఇవాళ జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది. లంక స్పిన్నర్లు దునిత్ వెల్లలగే (5/40), చరిత్ అసలంక (4/18) ధాటికి భారత్ 49.1 ఓవర్లలో 213 పరుగులకు ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ (53) టాప్ స్కోరర్‌గా నిలువగా.. ఆఖర్లో అక్షర్ పటేల్ (26) ఓ మోస్తరు స్కోర్ చేయడంతో భారత్ 200 పరుగుల మార్కును దాటింది.
అనంతరం 214 పరుగుల లక్ష్యాన్నిఛేదించేందుకు బరిలోకి శ్రీలంక 25.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి కేవలం 99 పరుగులు మాత్రమే చేసి ఓటమి దిశగా సాగుతుంది. బుమ్రా, కుల్దీప్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. సిరాజ్, జడేజా చెరో వికెట్ దక్కించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment