కొలొంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న ఆసియా కప్-2023 ఫైనల్లో టీమిండియా పేసర్లు చెలరేగిపోయారు. ముఖ్యంగా హైదరాబాదీ ఎక్స్‌ప్రెస్ మహ్మద్ సిరాజ్ (7-1-21-6) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. బుమ్రా (5-1-23-1), హార్దిక్ పాండ్యా (2.2-0-3-3) తమవంతుగా రాణించడంతో శ్రీలంక 15.2 ఓవర్లలో 50 పరుగులకే కుప్పకూలింది. ఓ వన్డే టోర్నీ ఫైనల్లో ఇదే అత్యల్ప స్కోర్. ఈ చెత్త రికార్డును శ్రీలంక మూటగట్టుకుంది.
గతంలో (2000లో ఇండియా వర్సెస్ శ్రీలంక) వన్డే టోర్నీ ఫైనల్లో అత్యల్ప స్కోర్ 54 పరుగులుగా ఉండింది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక ఆ రికార్డును బద్దలు కొట్టింది. వన్డేల్లో భారత్‌పై అత్యల్ప స్కోర్ కూడా ఇదే కావడం విశేషం. 2014లో టీమిండియాపై బంగ్లాదేశ్ చేసిన 58 పరుగులు అత్యల్ప స్కోర్‌గా ఉండింది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక ఈ చెత్త రికార్డును కూడా తమ ఖాతాలో వేసుకుంది.
అలాగే ఈ ఇన్నింగ్స్‌లో మొత్తం 10 వికెట్లు పేసర్ల ఖాతాలోకే వెళ్లాయి. ఇదే టోర్నీలో పాక్‌తో జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో కూడా మొత్తం 10 వికెట్లు పేసర్లకే దక్కాయి. ఆ మ్యాచ్‌లో పాక్ పేసర్లు మొత్తం భారత వికెట్లు పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో శ్రీలంక మరో చెత్త రికార్డు కూడా మూటగట్టుకుంది. వన్డేల్లో రెండో అత్యల్ప స్కోర్‌ను నమోదు చేసింది. వన్డేల్లో శ్రీలంక అత్యల్ప స్కోర్ 43 పరుగులుగా ఉంది. 2012లో సౌతాఫ్రికాపై శ్రీలంక ఈ స్కోర్ చేసింది.
కాగా, ఈ మ్యాచ్‌లో భారత పేసర్ల విజృంభణతో శ్రీలంక 50 పరుగులకు ఆలౌట్ కాగా.. లంక ఇన్నింగ్స్‌లో ఏకంగా ఐదుగురు డకౌట్లు కావడం మరో విశేషం. లంక ఇన్నింగ్స్‌లో కేవలం కుశాల్ మెండిస్ (17), దుషన్ హేమంత (13 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment