Asia Cup Final: శ్రీలంకను మట్టికరిపించిన భారత్‌.. 10 వికెట్ల తేడాతో ఘన విజయం | Asia Cup 2023: India Vs Sri Lanka Final Match Updates And Highlights | Sakshi
Sakshi News home page

Asia Cup Final IND VS SL: శ్రీలంకను మట్టికరిపించిన భారత్‌.. 10 వికెట్ల తేడాతో ఘన విజయం

Published Sun, Sep 17 2023 3:12 PM | Last Updated on Sun, Sep 17 2023 9:45 PM

Asia Cup 2023: India Vs Sri Lanka Final Match Updates And Highlights - Sakshi

శ్రీలంకను మట్టికరిపించిన భారత్‌.. 10 వికెట్ల తేడాతో ఘన విజయం
2023 ఆసియా కప్‌ టైటిల్‌ను భారత్‌ ఎగరేసుకుపోయింది. ఇవాళ జరిగిన ఫైనల్లో టీమిండియా 10 వికెట్ల తేడాతో ఆతిథ్య శ్రీలంకను మట్టికరిపించింది. తద్వారా ఎనిమిదో ఆసియా కప్‌ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక 15.2 ఓవర్లలో 50 పరుగులకే కుప్పకూలగా.. టీమిండియా ఆడుతూ పాడుతూ 6.1 ఓవర్లలో వికెట్లు నష్టపోకుండా లక్ష్యాన్ని ఛేదించింది. ఇషాన్‌ కిషన్‌ (23), శుభ్‌మన్‌ గిల్‌ (27) టీమిండియాను విజయతీరాలక చేర్చారు. 

అంతకుముందు మహ్మద్‌ సిరాజ్‌ (7-1-21-6), బుమ్రా (5-1-23-1), హార్దిక్‌ పాండ్యా (2.2-0-3-3) చెలరేగడంతో శ్రీలంక​ 15.2 ఓవర్లలో 50 పరుగులకే కుప్పకూలింది. లంక ఇన్నింగ్స్‌లో ఏకంగా ఐదుగురు డకౌట్లు కాగా.. కేవలం కుశాల్‌ మెండిస్‌ (17), దుషన్‌ హేమంత (13 నాటౌట్‌) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. 

టార్గెట్‌ 51.. 3 ఓవర్లలో భారత్‌ స్కోర్‌ 32/0
51 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్‌ వేగంగా లక్ష్యం దిశగా సాగుతుంది. 3 ఓవర్లలో భారత్‌ వికెట్లు నష్టపోకుండా 32 పరుగులు చేసింది. గిల్‌ (18), ఇషాన్‌ (13) క్రీజ్‌లో ఉన్నారు.

నిప్పులు చెరిగిన సిరాజ్‌.. 50 పరుగులకే కుప్పకూలిన శ్రీలంక
శ్రీలంకతో జరుగుతున్న ఆసియా కప్‌-2023 ఫైనల్లో టీమిండియా పేసర్లు రెచ్చిపోయారు. ముఖ్యంగా హైదరాబాదీ ఎక్స్‌ప్రెస్‌ మహ్మద్‌ సిరాజ్‌ (7-1-21-6) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఆఖర్లో హార్దిక్‌ పాండ్యా (2.2-0-3-3) తనవంతుగా రాణించడంతో శ్రీలంక​ 15.2 ఓవర్లలో 50 పరుగులకే కుప్పకూలింది. బుమ్రా (5-1-23-1) కూడా ఓ వికెట్‌ పడగొట్టాడు. లంక ఇన్నింగ్స్‌లో ఏకంగా ఐదుగురు డకౌట్లు కాగా.. కేవలం కుశాల్‌ మెండిస్‌ (17), దుషన్‌ హేమంత (13 నాటౌట్‌) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. 

ఎనిమిదో వికెట్‌ కోల్పోయిన శ్రీలంక
40 పరుగుల వద్ద శ్రీలంక ఎనిమిదో వికెట్‌ కోల్పోయింది. హార్దిక్‌ పాండ్యా బౌలింగ్‌లో కేఎల్‌ రాహుల్‌ క్యాచ్‌ పట్టడంతో వెల్లలగే (8) ఔటయ్యాడు.

సిరాజ్‌ ఆన్‌ ఫైర్‌.. 6 వికెట్లు.. పీకల్లోతు కష్టాల్లో శ్రీలంక
టీమిండియా పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ నిప్పులు చెరుగుతున్నాడు. కుశాల్‌ మెండిస్‌ను (17) క్లీన్‌ బౌల్డ్‌ చేయడం ద్వారా ఈ ఇన్నింగ్స్‌లో తన ఆరో వికెట్‌ను పడగొట్టాడు. సిరాజ్‌ 5.2 ఓవర్లలో ఓ మెయిడిన్‌ వేసి కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు పడగొట్టాడు.

12 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన శ్రీలంక.. సిరాజ్‌కు ఐదు వికెట్లు
శ్రీలంక జట్టు 12 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. మహ్మద్‌ సిరాజ్‌ కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టి శ్రీలంక నడ్డి విరిచాడు. ఐదో ఓవర్‌ నాలుగో బంతికి సిరాజ్‌.. షనక (0)ను క్లీన్‌బౌల్డ్‌ చేశాడు.

నిప్పులు చెరిగిన సిరాజ్‌.. ఒకే ఓవర్‌లో నాలుగు వికెట్లు
టీమిండియా పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ నిప్పులు చెరిగాడు. ఒకే ఓవర్‌లో నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఇన్నింగ్స్‌ నాలుగో ఓవర్‌ తొలి బంతికి నిస్సంకను (2) ఔట్‌ చేసిన సిరాజ్‌.. మూడు, నాలుగు, ఆరు బంతులకు సమరవిక్రమ (0), అసలంక (0), ధనంజయ డిసిల్వ (4)లను పెవిలియన్‌కు పంపాడు. దీంతో శ్రీలంక 12 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది.

ఒకే ఓవర్‌లో మూడు వికెట్లు తీసిన సిరాజ్‌
సిరాజ్‌ ఒకే ఓవర్‌లో 3 వికెట్లు తీసి శ్రీలంకను భారీ దెబ్బకొట్టాడు. తొలి బంతికి నిస్సంకను ఔట్‌ చేసిన సిరాజ్‌.. మూడు, నాలుగు బంతులకు సమరవిక్రమ (0), అసలంక (0)లను పెవిలియన్‌కు పంపాడు. దీంతో శ్రీలంక 8 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది.

ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీసిన సిరాజ్‌
సిరాజ్‌ ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు పడగొట్టి శ్రీలంకను భారీ దెబ్బకొట్టాడు. తొలి బంతికి నిస్సంకను ఔట్‌ చేసిన సిరాజ్‌.. మూడో బంతికి సమరవిక్రమను (0) ఎల్బీడబ్ల్యూ చేశాడు. దీంతో శ్రీలంక 8 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది.

రెండో వికెట్‌ కోల్పోయిన శ్రీలంక
8 పరుగుల వద్ద శ్రీలంక రెండో వికెట్‌ కోల్పోయింది. మహ్మద్‌ సిరాజ్‌ బౌలింగ్‌లో జడేజా క్యాచ్‌ అందుకోవడంతో నిస్సంక (2) ఔటయ్యాడు. కుశాల్‌ మెండిస్‌ (5), సమరవిక్రమ క్రీజ్‌లో ఉన్నారు.

మొదలైన మ్యాచ్‌.. తొలి ఓవర్‌లోనే వికెట్‌
వర్షం ​కారణంగా భారత్‌-శ్రీలంక ఫైనల్‌ మ్యాచ్‌ 40 నిమిషాలు ఆలస్యంగా మొదలైంది. బుమ్రా వేసిన తొలి ఓవర్‌లోనే శ్రీలంక​ వికెట్‌ కోల్పోయింది.  ఇన్నింగ్స్‌ మూడో బంతికే కేఎల్‌ రాహుల్‌ వికెట్ల వెనుక అద్భుతమైన క్యాచ్‌ పట్టి కుశాల్‌ పెరీరాను (0) పెవిలియన్‌కు సాగనంపాడు.  

భారత్‌-శ్రీలంక జట్ల మధ్య ఆసియా కప్‌-2023 ఫైనల్‌ మ్యాచ్‌ కొలొంబో వేదికగా ఇవాళ (సెప్టెంబర్‌ 17) జరుగనుంది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌ కోసం శ్రీలంక, భారత్‌ జట్లు చెరో మార్పు చేశాయి. శ్రీలంకకు సంబంధించి తీక్షణ స్థానంలో దుషన్‌ హేమంత జట్టులోకి రాగా.. భారత జట్టులో అక్షర్‌ పటేల్‌ స్థానాన్ని వాషింగ్టన్‌ సుందర్‌ భర్తీ చేశాడు. కాగా, మ్యాచ్‌ ప్రారంభానికి కొద్ది నిమిషాల ముందు వర్షం ప్రారంభంకావడంతో మ్యాచ్‌ ఆలస్యమైంది. 

తుది జట్లు..
టీమిండియా: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్‌ గిల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్‌ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్

శ్రీలంక: కుశాల్ పెరీరా, కుశాల్ మెండిస్(వికెట్ కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డిసిల్వా, దసున్ షనక(కెప్టెన్), దునిత్ వెల్లలగే, దుషన్ హేమంత, ప్రమోద్ మదుషన్, మతీషా పతిరన

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement