Who is Jitesh Sharma? India's surprise pick as Sanju Samson's replacement - Sakshi
Sakshi News home page

Ind Vs SL- Jitesh Sharma: ఎవరీ జితేశ్‌ శర్మ? సంజూ స్థానంలో అతడే ఎందుకు? బీసీసీఐ ఆలోచన అదేనా?!

Published Thu, Jan 5 2023 1:03 PM | Last Updated on Thu, Jan 5 2023 1:32 PM

Ind Vs SL: India Surprise Pick Who Is Jitesh Sharma Replace Sanju - Sakshi

జితేశ్‌ శర్మ (PC: PBKS Twitter/IPL)

India vs Sri Lanka, 2nd T20I- Sanju Samson- Jitesh Sharma: గాయం కారణంగా కేరళ బ్యాటర్‌ సంజూ శాంసన్‌ జట్టుకు దూరం కావడంతో తొలిసారి బీసీసీఐ పిలుపు అందుకున్నాడు జితేశ్‌ శర్మ. స్వదేశంలో శ్రీలంకతో టీ20 సిరీస్‌ నేపథ్యంలో టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. సంజూ దురదృష్టం... జితేశ్‌ పాలిట అదృష్టంగా మారిందనే చెప్పాలి. 

తుది జట్టులో ఆడే అవకాశం వచ్చినా రాకపోయినా.. సెలక్టర్ల దృష్టిలో పడటం అతడికి మేలు చేకూర్చే అంశమే. లంకతో తొలి టీ20లో యువ ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌ వికెట్‌ కీపర్‌గా వ్యవహరించగా.. సంజూ బ్యాటింగ్‌ సేవలకే పరిమితమయ్యాడు.

ఇంతకీ జితేశ్‌ శర్మ ఎవరు?
ఇప్పుడు అతడు మోకాలి గాయంతో దూరమైన నేపథ్యంలో బ్యాకప్‌ వికెట్‌ కీపర్‌గా విదర్భ బ్యాటర్‌ జితేశ్‌ రావడం విశేషం. నిజానికి సంజూ స్థానాన్ని జితేశ్‌తో భర్తీ చేయడం ఒకింత ఆశ్చర్యం కలిగించే అంశమే! ఇంతకీ జితేశ్‌ శర్మ ఎవరు? అతడి నేపథ్యం ఏమిటి?!


PC: PBKS

మహారాష్ట్రలోని అమరావతిలో 1993 అక్టోబరు 22న జితేశ్‌ జన్మించాడు. కుడిచేతి వాటం గల ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ 2012- 13 కూచ్‌ బెహర్‌ ట్రోఫీ టోర్నీలో మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. 12 ఇన్నింగ్స్‌లో కలిపి మొత్తంగా 537 పరుగులు చేశాడు.

దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటి
ఈ క్రమంలో.. 2014లో టీ20 ఫార్మాట్‌లో అరంగేట్రం చేసిన అతడు.. అదే ఏడాది దేశవాళీ వన్డే టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీలో ఆడే అవకాశం దక్కించుకున్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో విదర్భ మేటి బ్యాటర్లలో ఒకడిగా ఎదిగాడు.

దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ 2015- 16 సీజన్‌లో జితేశ్‌ అదరగొట్టాడు. 140కి పైగా స్ట్రైక్‌రేటుతో 343 పరుగులు సాధించాడు. ఇందులో ఓ సెంచరీ, రెండు అర్ధ శతకాలు ఉన్నాయి. కాగా ఆ సీజన్‌లో టోర్నీలో అత్యధిక పరుగుల వీరుల జాబితాలో అతడు మూడో స్థానంలో నిలవడం విశేషం.

అలా ఐపీఎల్‌లోకి
ఇలా దేశవాళీ క్రికెట్లో సత్తా చాటిన జితేశ్‌ శర్మ... 2016లో 10 లక్షల రూపాయల కనీస ధరతో వేలంలోకి రాగా.. ముంబై ఇండియన్స్‌ కొనుగోలు చేసింది. అయితే, స్టార్లతో నిండిపోయిన ముంబై జట్టు తరఫున అతడికి ఒక్క మ్యాచ్‌ కూడా ఆడే అవకాశం రాలేదు. 

ఈ క్రమంలో 2022 మెగా వేలంలో పంజాబ్‌ కింగ్స్‌ జితేశ్‌ను కొనుగోలు చేసింది. రూ. 20 లక్షలు వెచ్చించి అతడిని జట్టులోకి ఆహ్వానించింది. అంతేకాదు.. తొలిసారి ఐపీఎల్‌ మ్యాచ్‌ ఆడే ఛాన్స్‌ కూడా ఇచ్చింది.

సీఎస్‌కేతో మ్యాచ్‌తో అరంగేట్రం
గతేడాది చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌ సందర్భంగా జితేశ్‌ శర్మ అరంగేట్రం చేశాడు. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఈ వికెట్‌ కీపర్‌.. 17 బంతులు ఎదుర్కొని 26 పరుగులు చేశాడు. చెన్నైపై విజయం సాధించిన ఈ మ్యాచ్లో మూడో టాప్‌ స్కోరర్‌ జితేశ్‌ కావడం విశేషం. 


PC: PBKS

అదే విధంగా ముంబైతో మ్యాచ్‌లో 15 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 30 పరుగులు చేశాడు. ఇక ఆఖరిసారిగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో ఆడిన ఈ పంజాబ్‌ బ్యాటర్‌.. 7 బంతుల్లో 19 పరుగులు చేశాడు. కీలక సమయంలో మెరుపులు మెరిపించి జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు.

అలా వెలుగులోకి వచ్చి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇదిలా ఉంటే.. 2015- 16 సీజన్‌లో రంజీల్లో అడుగుపెట్టిన జితేశ్‌ శర్మ.. పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో రాణించలేకపోయాడు.

జితేశ్‌ శర్మనే ఎందుకు?! బీసీసీఐ ఆలోచన?
కేఎల్‌ రాహుల్‌, రిషభ్‌ పంత్‌ వంటి సీనియర్ల గైర్హాజరీలో యువ బ్యాటర్‌ ఇషాన్‌ కిషన్‌ వికెట్‌ కీపర్‌గా వ్యవహరిస్తున్నాడు. మరో వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ సంజూ దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో అతడికి జితేశ్‌ సరైన ప్రత్యామ్నాయని బీసీసీఐ భావించింది.

ఎందుకంటే.. జితేశ్‌ సంజూ మాదిరి కీపింగ్‌ బాధ్యతలు నిర్వర్తించడంతో పాటుగా.. ఐదు లేదంటే ఆరో స్థానంలో బ్యాటింగ్‌ కూడా చేయగలడు. ఐపీఎల్‌-2022లో పంజాబ్‌ కింగ్స్‌ తరఫున ఫినిషర్‌ పాత్రకు తగిన న్యాయం చేశాడీ 29 ఏళ్ల ప్లేయర్‌. అందుకే సెలక్టర్లు అతడివైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.

అయితే, మొదటి బంతి నుంచే దూకుడు ప్రదర్శించే జితేశ్‌ శర్మ ఒక్కోసారి.. అంతే త్వరగా వికెట్‌ సమర్పించుకుంటాడు కూడా! ఈ కారణంగానే ఇటీవలి సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు.

శ్రీలంకతో మిగిలిన రెండు టీ20లకు భారత జట్టు:
హార్దిక్ పాండ్యా (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్‌ కీపర్‌), రుతురాజ్ గైక్వాడ్, శుభమన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (వైస్‌ కెప్టెన్‌), దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, జితేష్ శర్మ (వికెట్‌ కీపర్‌), వాషింగ్టన్ సుందర్, యజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, హర్షల్ పటేల్ , ఉమ్రాన్ మాలిక్, శివం మావి, ముఖేష్ కుమార్.

చదవండి: Sam Curran: స్టార్‌ క్రికెటర్‌కు చేదు అనుభవం! షాకయ్యానంటూ ట్వీట్‌.. వైరల్‌
డాన్‌ బ్రాడ్‌మన్‌ రికార్డు బద్దలు కొట్టిన స్టీవ్‌ స్మిత్‌
Sanju Samson: మరీ ఇంత దరిద్రం ఏంటి భయ్యా! ఇలాగైతే ‘కెరీర్‌’కు ఎండ్‌ కార్డ్‌ పడ్డట్లే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement