
కొలంబో: శ్రీలంకతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఓటమి పాలైన సంగతి తెలిసిందే. లోస్కోరింగ్ నమోదైన ఈ మ్యాచ్‌లో చివర్లో కాస్త ఉత్కంఠ రేపినా విజయం లంకనే వరించింది. అయితే లంక ఇన్నింగ్స్ సమయంలో టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ 12వ ఆటగాడైన సందీప్ వారియర్‌కు చిట్టీని ఇచ్చి గ్రౌండ్‌కు పంపించడం ఆసక్తికరంగా మారింది. ఇన్నింగ్స్ 18వ ఓవర్లో ఇది చోటుచేసుకుంది. అప్పటికి లంక 18 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది.
ఈలోగా మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో అంపైర్లు బెయిల్స్ తీసి మ్యాచ్‌ను కాసేపు నిలిపివేశారు. గ్రౌండ్‌మెన్లు కూడా పిచ్‌పై కవర్ కప్పేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ద్రవిడ్ సూచనలు చేసిన ఒక చిట్టీని సందీప్ వారియర్ చేతిలో పెట్టాడు. అతను దాన్ని తీసుకొని గ్రౌండ్‌లోకి వెళ్లి శిఖర్ ధావన్‌కు అందించాడు. ఆ చిట్టీలో ద్రవిడ్ ఏం పంపాడనేది ఆసక్తి కలిగించింది. వాస్తవానికి ఆ చిట్టీలో డక్‌వర్త్ లూయిస్ గురించి రాసినట్లు సమాచారం. వర్షం అంతరాయం కలిగించడంతో డక్‌వర్త్ లూయిస్ ప్రకారం మ్యాచ్ జరిగే అవకాశముందని భావించిన ద్రవిడ్ దానికి తగ్గ ప్రణాళికలు చిట్టీలో రాసి పంపించినట్లు తెలిసింది. అయితే కాసేపటికే వర్షం ఆగిపోవడంతో మ్యాచ్‌ను మళ్లీ నిర్వహించగా.. లంక లక్ష్యాన్ని చేధించి విజయాన్ని అందుకుంది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 132 పరుగులు చేసింది. కెప్టెన్ శిఖర్ ధావన్ (42 బంతుల్లో 40; 5 ఫోర్లు), తొలి మ్యాచ్ ఆడిన దేవ్‌దత్ పడిక్కల్ (23 బంతుల్లో 29; 1 ఫోర్, 1 సిక్స్), రుతురాజ్ గైక్వాడ్ (18 బంతుల్లో 21; 1 ఫోర్) ఫర్వాలేదనిపించారు. అకిల ధనంజయ రెం డు వికెట్లు తీశాడు. అనంతరం ఛేజింగ్‌లో శ్రీలంక 19.4 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 133 పరుగులు చేసి గెలుపొందింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ధనంజయ డిసిల్వా (34 బంతుల్లో 40 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్), చమిక కరుణరత్నే (6 బంతుల్లో 12 నాటౌట్; 1 సిక్స్) కడదాక క్రీజులో నిలిచి జట్టుకు విజయాన్ని అందించారు. కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు తీశాడు. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్ 1–1తో సమమైంది. నేడే సిరీస్ విజేతను నిర్ణయించే మూడో టి20 జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment