
పోర్ట్ ఆఫ్ స్పెయిన్: అవే జట్లు.. అదే ఉత్కంఠ.. వెస్టిండీస్-టీమిండియా మధ్య జరిగిన రెండో వన్డేలోనూ విజయం కోసం ఆఖరి ఓవర్ వరకు ఇరు జట్లు నువ్వానేనా అన్నట్లు తలపడ్డాయి. కాకపోతే మొదటి మ్యాచ్‌లో విండీస్ జట్టు పోరాడితే.. నేడు టీమిండియా పోరాడింది. అయితే ఫలితం మాత్రం మారలేదు.మొదట బ్యాటింగ్ చేసిన విండీస్ జట్టు 312 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశిస్తే.. టీమిండియా 2 బంతులు మిగిలుండగానే 8 వికెట్లు కోల్పోయి చేధించింది.
3 బంతుల్లో ఆరు పరుగులు చేయాల్సిన సమయంలో అక్షర్ పటేల్ సిక్సర్ బాది భారత జట్టుకు విజయాన్ని అందించాడు. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో టీమిండియా దక్కించుకుంది. భారత బ్యాట్స్‌మెన్లలో అక్షర్ పటేల్ 35 బంతుల్లో 64 నాటౌట్, శ్రేయస్ అయ్యర్ 63, సంజూ శామ్సన్ 54, శుభమన్ గిల్ 43, దీపక్ హుడా 33 పరుగులతో రాణించారు.
300 పైచిలుకు స్కోరు చేసిన వెస్టిండీస్
భారత బౌలింగ్‌ను కరీబియన్లు మళ్లీ ఓ ఆటాడుకున్నారు. దీంతో అవలీలగా మళ్లీ రెండో వన్డేలోనూ వెస్టిండీస్ 300 పైచిలుకు స్కోరు చేయగలిగింది. కెరీర్‌లో 100వ వన్డే ఆడుతున్న ఓపెనర్ షై హోప్ (135 బంతుల్లో 115; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీతో కదంతొక్కాడు. తొలి బంతి నుంచి 49వ ఓవర్‌దాకా విండీస్ ఇన్నింగ్స్‌కు వెన్నెముకగా నిలిచాడు. దీంతో మొదట బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. కెప్టెన్ నికోలస్ పూరన్ (77 బంతుల్లో 74; 1 ఫోర్, 6 సిక్సర్లు) అర్ధసెంచరీ సాధించాడు. భారత బౌలర్లలో శార్దుల్ ఠాకూర్ 3 వికెట్లు తీశాడు.
అవేశ్ ఖాన్ @244
వెస్టిండీస్‌తో రెండో మ్యాచ్‌లో బరిలో దిగడం ద్వారా భారత్ తరఫున వన్డేల్లో అరంగేట్రం చేసిన 244వ క్రికెటర్‌గా అవేశ్ ఖాన్ గుర్తింపు పొందాడు. తొలి వన్డేలో ఆడిన ప్రసిధ్ కృష్ణ స్థానంలో అవేశ్ ఖాన్ జట్టులోకి వచ్చాడు. కెప్టెన్ శిఖర్ ధావన్ చేతుల మీదుగా అవేశ్ టోపీని అందుకున్నాడు. మధ్యప్రదేశ్‌కు చెందిన అవేశ్ ఖాన్ ఇప్పటివరకు భారత్ తరఫున 9 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లు ఆడాడు.
India pull off a thriller in the final over to win by 2 wickets. #WIvIND #MenInMaroon pic.twitter.com/0xnSYNMyzC
— Windies Cricket (@windiescricket) July 24, 2022