Ind Vs WI 2nd ODI: Sanju Samson Fails On His Return Gets Trolled - Sakshi
Sakshi News home page

#Sanju Samson: అవకాశం ఇవ్వలేదు అంటారు.. ఇస్తే ఇలా చేస్తారు..! అయ్యో పాపం సంజూ.. నీకే ఎందుకిలా?

Published Sat, Jul 29 2023 9:41 PM | Last Updated on Mon, Jul 31 2023 7:35 PM

Ind vs WI 2nd ODI: Sanju Samson Fails On His Return Gets Trolled - Sakshi

సంజూ శాంసన్‌ (PC: Jio Cinema Twitter)

West Indies vs India, 2nd ODI- Sanju Samson: రాక రాక వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు టీమిండియా బ్యాటర్‌ సంజూ శాంసన్‌. వెస్టిండీస్‌తో రెండో వన్డేలో సంజూకు న్యాయం జరిగిందంటూ సంబరాలు చేసుకుంటున్న అభిమానులను పూర్తిగా నిరాశపరిచాడు. కాగా విండీస్‌ పర్యటన నేపథ్యంలో చాలా రోజుల తర్వాత ఈ కేరళ బ్యాటర్‌ వన్డే జట్టుకు ఎంపికైన విషయం తెలిసిందే.

అయితే, మొదటి వన్డేలో వికెట్‌ కీపర్‌గా సంజూను కాదని ఇషాన్‌ కిషన్‌కు తుదిజట్టులో చోటు కల్పించారు. లెఫ్ట్‌- రైట్‌ కాంబినేషన్‌కు ప్రాధాన్యం ఇచ్చి అతడిని పక్కనపెట్టారు. ఈ క్రమంలో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ స్థానంలో ఓపెనర్‌గా బరిలోకి దిగిన ఇషాన్‌.. అర్ధ శతకంతో అదరగొట్టి తన ఎంపిక సరైందేనని మరోసారి నిరూపించాడు.

అయితే, సంజూకు మాత్రం అన్యాయం జరిగిందంటూ ఫ్యాన్స్‌ మేనేజ్‌మెంట్‌ తీరుపై మండిపడ్డారు. ఈ మాత్రం దానికి జట్టుకు ఎంపిక చేయడం లాంటి కంటితుడుపు చర్యలు ఎందుకని నెట్టింట ట్రోల్‌ చేశారు. అదే విధంగా.. వన్‌డౌన్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ను ఆడించిన నేపథ్యంలో ముంబై బ్యాటర్ల కోసం సంజూను బలిచేస్తున్నాడంటూ రోహిత్‌ శర్మను తప్పుబట్టారు.

ఈ క్రమంలో రెండో వన్డేలో రోహిత్‌తో పాటు స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లికి విశ్రాంతినిచ్చిన నేపథ్యంలో సంజూ శాంసన్‌, అక్షర్‌ పటేల్‌లకు జట్టులో చోటు దక్కింది. అయితే, వీరిద్దరు విఫలం కావడం గమనార్హం.

వన్‌డౌన్‌లో వచ్చిన సంజూ 19 బంతులు ఎదుర్కొని 9 పరుగులు మాత్రమే చేయగలిగాడు. మరోవైపు.. ఇషాన్‌ కిషన్‌ స్థానంలో క్రీజులోకి వచ్చిన అక్షర్‌ పటేల్‌ ఒక్క పరుగుకే పరిమితమయ్యాడు. నాలుగో నంబర్‌లో అతడిని ఆడించిన మేనేజ్‌మెంట్‌ నిర్ణయం తప్పని నిరూపించాడు. 

ఇదిలా ఉంటే.. 24వ ఓవర్‌లో కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా(7) నాలుగో వికెట్‌గా వెనుదిరగగా.. 25వ ఓవర్‌ మొదటి బంతికే సంజూ అవుటయ్యాడు. దీంతో టీమిండియా ఐదో వికెట్‌ కోల్పోయింది. ఆ వెంటనే వర్షం పడటంతో 24.1 ఓవర్ల వద్ద ఆటకు అంతరాయం కలిగింది.  సూర్యకుమార్ యాదవ్‌ క్రీజులోకి వచ్చేటప్పటికి టీమిండియా స్కోరు: 113/5. ఇదిలా ఉంటే కొంతమంది నెటిజన్లు.. ‘‘అవకాశం ఇవ్వలేదు అంటారు.. ఇస్తే ఇలా చేస్తారు’’ అంటూ సంజూను ట్రోల్‌ చేస్తున్నారు.

చదవండి: కావాలనే రోహిత్‌, కోహ్లి లేకుండా! మ్యాచ్‌ ఓడిపోతేనే! ఆసియా కప్‌ తర్వాత ఇద్దరూ అవుట్‌? 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement