West Indies vs India, 2nd Test: ‘‘అశ్విన్ ఇప్పటికే రెండు వికెట్లు తీశాడు. ఆఖరి రోజు ఆటలో జడేజా కూడా ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఐదో రోజు వీరిద్దరికి ఎక్కువ ఓవర్లు బౌలింగ్ చేసే అవకాశం ఇస్తే మెరుగైన ఫలితాలు రాబట్టవచ్చని నా అభిప్రాయం. రెండు లేదంటే మూడో సెషన్‌లో అశ్విన్, జడేజా కీలకం కానున్నారు’’ అని టీమిండియా మాజీ బ్యాటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు.
ప్రతిఘటిస్తున్న ఆతిథ్య జట్టు
వెస్టిండీస్‌తో రెండో టెస్టు చివరి అంకానికి చేరుకున్న తరుణంలో భారత స్పిన్ ద్వయం రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలను ఉద్దేశించి ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. కాగా విండీస్- టీమిండియా మధ్య ట్రినిడాడ్ వేదికగా జూలై 20న మొదలైన మలి టెస్టు నాలుగో రోజు ఆట ముగిసే సరికి ఆతిథ్య జట్టు రెండు వికెట్ల నష్టానికి 76 పరుగులు చేసింది.
అశ్విన్ రెండు వికెట్లతో
ఓపెనర్లు క్రెగ్ బ్రాత్‌వైట్ (28), తగ్‌నరైన్ చందర్‌పాల్ (24)ల వికెట్లను అశ్విన్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ టెస్టులో టీమిండియా విజయానికి 8 వికెట్ల దూరంలో ఉంది. డొమినికా మ్యాచ్‌లో పూర్తి ఆధిపత్యం సాధించి జయకేతనం ఎగురవేసిన భారత జట్టు.. ఆఖరి టెస్టులోనూ అలాంటి ఫలితమే పునరావృతం చేయాలని పట్టుదలగా ఉంది.
వాళ్లిద్దరు ఉంటే అంతే
ఇదిలా ఉంటే.. విండీస్ వైట్‌వాష్ నుంచి తప్పించుకోవాలంటే ఐదో రోజు 289 పరుగులు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో జియో సినిమా షోలో కామెంటేటర్ ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘తమకు ఎన్ని ఓవర్లు మిగిలి ఉన్నాయన్న అంశాన్ని కూడా టీమిండియా దృష్టిలో పెట్టుకోవాలి. అందుకు అనుగుణంగా బౌలర్లకు అవకాశం ఇవ్వాలి.
ఇద్దరు స్పిన్నర్లు ఉన్నారు. కాబట్టి వాళ్ల సేవలను పూర్తిగా వినియోగించుకోవాలి. వాళ్ల నుంచి కచ్చితంగా వికెట్లు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు’’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. ఇక వెస్టిండీస్ అవకాశాల గురించి ప్రస్తావిస్తూ.. ‘‘ఒకవేళ వాళ్లు గెలవాలనుకుంటే దూకుడుగా ఆడాల్సి ఉంటుంది.
డ్రా అయినా చాలనుకుంటే మాత్రం
అలా కాకుండా.. మ్యాచ్‌ను డ్రా చేసుకున్నా చాలు దానినే విజయంగా భావిస్తామనుకుంటే ఆచితూచి ఆడాలి. అయితే, చెత్త బంతుల కోసం ఓపికగా ఎదురుచూసి అత్యధిక పరుగులు రాబట్టాలి. ఇదేమీ గొప్ప వ్యూహం కాదు. కానీ వెస్టిండీస్ ముందు ఇంతకంటే మంచి ఆప్షన్ ఏదీలేదు’’ అని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.
కాగా తొలి టెస్టులో అశ్విన్ 12 వికెట్లతో చెలరేగగా.. జడ్డూ 5 వికెట్లు కూల్చిన విషయం తెలిసిందే. ఇక రెండో టెస్టులో విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో పేసర్ మహ్మద్ సిరాజ్ ఐదు వికెట్లతో మెరిశాడు.అశ్విన్ ఒకటి, జడ్డూ రెండు, అరంగేట్ర పేసర్ ముకేశ్ కుమార్ రెండు వికెట్లు కూల్చారు.
చదవండి: తేలిపోయిన వెంకటేశ్ అయ్యర్.. రెచ్చిపోయిన రింకూ సింగ్
Comments
Please login to add a commentAdd a comment