యజువేంద్ర చహల్(PC: BCCI)
India Vs West Indies T20 Series 2022: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ నేపథ్యంలో టీమిండియా లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చహల్‌కు విశ్రాంతినివ్వడాన్ని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా తప్పుబట్టాడు. అతడిని సిరీస్‌కు ఎంపిక చేయాల్సిందని అభిప్రాయపడ్డాడు. టీ20 ప్రపంచకప్-2021 భారత జట్టులో చోటు దక్కించుకోలేక పోయిన చహల్.. ఐపీఎల్-2022లో మాత్రం అదరగొట్టాడు.
తాజా ఎడిషన్‌లో తొలిసారిగా రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహించిన అతడు.. 17 ఇన్నింగ్స్‌లో కలిపి 27 వికెట్లు పడగొట్టాడు. తద్వారా అత్యధిక వికెట్ల వీరుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచి పర్పుల్ క్యాప్ గెలుచుకున్నాడు. రాజస్తాన్ ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు.
ఈ క్రమంలో స్వదేశంలో దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ నేపథ్యంలో జట్టులో చోటు దక్కించుకున్న చహల్.. ఆ తర్వాత ఐర్లాండ్ టూర్‌కు ఎంపికయ్యాడు. టీ20 సిరీస్ ఆడాడు. అదే విధంగా ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్ నేపథ్యంలో జట్టులో స్థానం సంపాదించుకున్నాడు. ఇంగ్లండ్‌తో రెండో వన్డేలో నాలుగు వికెట్లు కూల్చి సత్తా చాటాడు. అయితే, విండీస్‌తో పొట్టి ఫార్మాట్ సిరీస్‌కు మాత్రం చహల్‌ను సెలక్టర్లు పక్కనపెట్టారు.
బ్రేక్ ఇవ్వడం ఎందుకు?
ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. ‘‘యుజీ చహల్.. నాకు తెలిసీ.. 2021, 2022లో టీమిండియా తరఫున మొత్తం 17 మ్యాచ్‌లు ఆడి 20 వికెట్లు పడగొట్టాడు. అద్భుతంగా రాణిస్తున్నాడు. అయితే, తనకు బ్రేక్ ఇవ్వడం మాత్రం సరికాదు.
తను ఇంకా క్రికెట్ ఆడగలడు. ఇప్పుడే విశ్రాంతి అవసరం లేదు. ఫామ్‌లో ఉన్నపుడు వరుస మ్యాచ్‌లు ఆడితే లయ కోల్పోకుండా ఉంటాడు కదా! నిజమే.. తను ఐపీఎల్-2022లో అన్ని మ్యాచ్‌లు ఆడాడు.
కానీ బ్రేక్ తీసుకునేంత అవసరమైతే లేదనుకుంటా. ఒకవేళ గాయపడితే తప్ప అతడు రెస్ట్ అడిగే అవసరమే లేదు. అయినా చహల్ బ్రేక్ అడిగాడా.. సెలక్టర్లు విశ్రాంతినిచ్చారా అన్న అంశంలో నిజానిజాలేమిటో మనకు తెలియదు కాబట్టి ఓ అంచనాకు రాలేము’’ అని పేర్కొన్నాడు.
ఇక చహల్‌ను ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌లో ఒకే ఒక్క మ్యాచ్ ఆడించారన్న ఆకాశ్ చోప్రా.. ఇంగ్లండ్‌తో ఓ రెండు మ్యాచ్‌లు ఆడించిన తర్వాత విండీస్ టూర్‌కు పక్కనపెట్టడం సరికాదన్నాడు. వన్డేలతో పాటు టీ20 సిరీస్‌కు కూడా చహల్‌ను ఎంపిక చేయాల్సిందని అభిప్రాయపడ్డాడు.
వరల్డ్‌కప్-2022 టోర్నీ సమీపిస్తున్న తరుణంలో ఆకాశ్ చోప్రా ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అక్టోబరు 16 నుంచి ఆస్ట్రేలియా వేదికగా ఈ మెగా టోర్నీ ఆరంభం కానుంది. కాగా వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కు సెలక్టర్లు చహల్‌ను కాకుండా రవి బిష్ణోయి, కుల్దీప్ యాదవ్ రూపంలో ఇద్దరు స్పిన్నర్లను ఎంపిక చేశారు.
చదవండి: Ire Vs NZ 3rd ODI: మొన్న టీమిండియాను.. ఇప్పుడు న్యూజిలాండ్‌ను వణికించారు! వరుస సెంచరీలతో..
IRE Vs NZ: కివీస్ కొంపముంచిన టవల్.. క్రికెట్ చరిత్రలోనే తొలిసారి!
Comments
Please login to add a commentAdd a comment