బ్యాంకాక్: ప్రతిష్టాత్మక ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత్ తమ రెండో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. ఆదివారం ముగిసిన ఈ మెగా ఈవెంట్‌లో భారత్ 6 స్వర్ణాలు, 12 రజతాలు, 9 కాంస్య పతకాలతో కలిపి మొత్తం 27 పతకాలతో మూడో స్థానంలో నిలిచింది. 2017లో భువనేశ్వర్‌లో జరిగిన ఆసియా చాంపియన్‌షిప్‌లో భారత్ అత్యధికంగా 29 పతకాలతో అగ్రస్థానంలో నిలువగా... 1989, 1985 ఆసియా చాంపియన్‌షిప్‌లలో 22 పతకాల చొప్పున సాధించింది.
చివరిరోజు ఆదివారం భారత అథ్లెట్లు 13 పతకాలు సొంతం చేసుకున్నారు. భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ అథ్లెట్లు జ్యోతి యర్రాజీ రజతం, దండి జ్యోతికశ్రీ కాంస్య పతకం సాధించారు. మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో స్వర్ణ పతకం నెగ్గి చరిత్ర సృష్టించిన జ్యోతి యర్రాజీ 200 మీటర్ల విభాగంలో రజతం గెలిచింది.
విశాఖపట్నం జిల్లాకు చెందిన జ్యోతి 23.13 సెకన్లలో గమ్యానికి చేరి రెండో స్థానంలో నిలిచింది. మహిళల 4్ఠ400 మీటర్ల రిలేలో దండి జ్యోతికశ్రీ, హీనా మలిక్, ఐశ్వర్య మిశ్రా, శుభ వెంకటేశన్ బృందానికి కాంస్య పతకం దక్కింది. జ్యోతికశ్రీ బృందం 3 నిమిషాల 33.73 సెకన్లలో రేసును ముగించి మూడో స్థానంలో నిలిచింది. పురుషుల 4్ఠ400 మీటర్ల రిలేలో అమోజ్ జేకబ్, అజ్మల్, మిజో కురియన్, రాజేశ్‌లతో కూడిన భారత బృందం (3ని:01.80 సెకన్లు) రజతం సాధించింది.
మహిళల షాట్‌పుట్ ఈవెంట్‌లో అభా ఖతువా (భారత్) ఇనుప గుండును 18.06 మీటర్ల దూరం విసిరి జాతీయ రికార్డు నెలకొల్పడంతోపాటు రజత పతకం గెలిచింది. మహిళల 5000 మీటర్ల రేసులో పారుల్ చౌదరీ (15ని:52.35 సెకన్లు) రజతం, అంకిత (16ని:03.33 సెకన్లు) కాంస్యం నెగ్గారు. పురుషుల 5000 మీటర్ల విభాగంలో గుల్‌వీర్ సింగ్ (13ని:48.33 సెకన్లు) కాంస్యం సాధించాడు.
పురుషుల జావెలిన్ త్రోలో డీపీ మనూ (81.01 మీటర్లు) రజతం దక్కించుకున్నాడు. పురుషుల 800 మీటర్లలో కిషన్ కుమార్ (1ని:45.88 సెకన్లు), మహిళల 800 మీటర్లలో కేఎం చందా (2ని:01.58 సెకన్లు) రజత పతకాలు నెగ్గారు. పురుషుల 20 కిలోమీటర్ల నడకలో వికాశ్ సింగ్ (1గం:29ని:32 సెకన్లు) కాంస్యం, మహిళల 20 కిలోమీటర్ల నడకలో ప్రియాంక గోస్వామి (1గం:34ని:24 సెకన్లు) రజతం గెలిచారు.
Comments
Please login to add a commentAdd a comment