కూలిడ్జ్ (ఆంటిగ్వా): అండర్-19 వరల్డ్‌కప్‌లో టీమిండియా ఫైనల్‌కు చేరింది. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ ఫైనల్లో భారత్ 96 పరుగుల తేడాతో భారీ విజయం సాధించి తుది పోరుకు అర్హత సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 290 పరుగులు చేయగా, ఆసీస్ 41. 5 ఓవర్లలో 194 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా భారత్ ఫైనల్లోకి ప్రవేశించింది. భారత యువ బౌలర్లలో విక్టీ ఓస్టావల్ మూడు వికెట్లతో ఆసీస్‌ను దెబ్బ తీయగా, నిషాంత్ సింధు, రవి కుమార్‌లు తలో రెండు వికెట్లతో మెరిశారు. కౌశల్ తాంబే, రఘువంశీలు చెరో వికెట్ తీశారు.
ముందుగా బ్యాటింగ్ చేసిన భారత జట్టు యష్ ధుల్ (110 బంతుల్లో 110; 10 ఫోర్లు, 1 సిక్స్), షేక్ రషీద్ (108 బంతుల్లో 94; 8 ఫోర్లు, 1 సిక్స్) మూడో వికెట్‌కు 204 పరుగులు జోడించడంతో భారీ స్కోరును బోర్డుపై ఉంచారు.
భారీ భాగస్వామ్యం...
టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు అంగ్‌కృష్ రఘువంశీ (6), హర్నూర్ సింగ్ (16) తడబడుతూ మొదలు పెట్టడంతో పరుగులు బాగా నెమ్మదిగా వచ్చాయి. తక్కువ వ్యవధిలో వీరిద్దరిని అవుట్ చేసి ఆసీస్ ఆధిక్యం ప్రదర్శించింది. ఈ స్థితిలో ధుల్, రషీద్ ఇన్నింగ్స్‌ను నిర్మించే బాధ్యత తీసుకున్నారు. ఆరంభంలో జాగ్రత్తగా ఆడినా, నిలదొక్కుకున్న తర్వాత చక్కటి షాట్లతో పరుగులు రాబట్టారు.
ధుల్ 64 బంతుల్లో, రషీద్ 78 బంతుల్లో అర్ధ సెంచరీలు పూర్తి చేసుకోగా, ఆ తర్వాత ఒకరితో మరొకరు పోటీ పడి పరుగులు సాధించారు. ఈ జోడీని విడదీయడానికి ఆసీస్ బౌలర్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా లాభం లేకపోయింది. విట్నీ ఓవర్లో 2 ఫోర్లు, 1 సిక్స్ కొట్టిన ధుల్ 106 బంతుల్లోనే శతకం మార్క్‌ను అందుకున్నాడు.
పార్ట్‌నర్‌షిప్ 200 పరుగులు దాటిన తర్వాత 46వ ఓవర్లో వీరిద్దరు వరుస బంతుల్లో అవుటయ్యారు. విట్నీ వేసిన చివరి ఓవర్లో భారత్ వరుసగా 4, 6, 1, 6, 4, 6తో ఏకంగా 27 పరుగులు రాబట్టింది. దినేశ్ బానా ఆడిన 4 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు కొట్టడం విశేషం. ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన ఆసీస్ జట్టులో లాచ్‌లాన్ షా(51) మాత్రమే హాఫ్ సెంచరీ చేయగా, కోరీ మిల్లర్(38), క్యాంప్‌బెల్ కెల్లావే(30)లు మోస్తరుగా మెరిశారు. ఫైనల్లో భారత జట్టు.. ఇంగ్లండ్‌తో తలపడనుంది.
Comments
Please login to add a commentAdd a comment