భారత్‌ను గెలిపించిన ఓపెనర్లు
10 వికెట్లతో జింబాబ్వే చిత్తు
3–1తో టి20 సిరీస్ టీమిండియా సొంతం
నేడు చివరి మ్యాచ్
ఐపీఎల్‌లో సత్తా చాటిన కుర్రాళ్లు ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై కూడా తమకు లభించిన అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. రెగ్యులర్ ఆటగాళ్లు లేకుండా వెళ్లిన యువ జట్టు అంచనాలకు అనుగుణంగా సత్తా చాటి జింబాబ్వేపై టి20 సిరీస్ విజయాన్ని అందుకుంది.
తొలి మూడు మ్యాచ్‌లతో పోలిస్తే ఈ సారి సంపూర్ణ ఆధిపత్యంతో చెలరేగిన టీమిండియా భారీ విజయాన్ని అందుకుంది. నాలుగో మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్ దూకుడైన బ్యాటింగ్ ముందు జింబాబ్వే ఏమాత్రం పోటీనివ్వలేకపోవడంతో జట్టు అలవోకగా లక్ష్యం చేరింది.
హరారే: టి20 వరల్డ్ కప్‌లో విజేతగా నిలిచిన తర్వాత జరిగిన తొలి సిరీస్ కూడా భారత్ ఖాతాలో చేరింది. జింబాబ్వే గడ్డపై జరిగిన ఈ ఐదు మ్యాచ్‌ల పోరులో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ 3–1తో సిరీస్ సొంతం చేసుకుంది. శనివారం జరిగిన నాలుగో టి20లో భారత్ 10 వికెట్ల తేడాతో జింబాబ్వే ఘన విజయం సాధించింది.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. కెప్టెన్ సికందర్ రజా (28 బంతుల్లో 46; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలవగా...మరుమని (31 బంతుల్లో 32; 3 ఫోర్లు), మదివెరె (24 బంతుల్లో 25; 4 ఫోర్లు) రాణించారు. అనంతరం భారత్ 15.2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 156 పరుగులు చేసింది.
‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ యశస్వి జైస్వాల్ (53 బంతుల్లో 93 నాటౌట్; 13 ఫోర్లు, 2 సిక్స్‌లు), కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (39 బంతుల్లో 58 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయంగా జట్టును గెలిపించారు. సిరీస్‌లో చివరిదైన ఐదో మ్యాచ్ నేడు ఇక్కడే జరుగుతుంది.
రజా రాణించినా...
జింబాబ్వేకు ఓపెనర్లు మరుమని, మదివెరె కొన్ని చక్కటి షాట్లతో మెరుగైన ఆరంభాన్ని అందించారు. సిరీస్‌లో తొలిసారి ఆ జట్టు పవర్‌ప్లేలో ఒక్క వికెట్ కూడా కోల్పోలేదు. భారత పేసర్లు ఆరంభంలో కట్టు తప్పడం జింబాబ్వేకు కలిసొచ్చింది.
తొలి వికెట్‌కు 52 బంతుల్లో 63 పరుగులు జోడించిన తర్వాత అభిషేక్ తన తొలి అంతర్జాతీయ వికెట్‌గా మరుమనిని వెనక్కి పంపించాడు. తర్వాతి ఓవర్లో మదివెరె కూడా అవుట్ కాగా...10 ఓవర్లు ముగిసే సరికి స్కోరు 67/2కు చేరింది. ఈ దశలో భారత స్పిన్నర్లు ప్రత్యర్థిని కట్టి పడేశారు.
నాలుగు పరుగుల వ్యవధిలో బెన్నెట్ (9), క్యాంప్‌బెల్ (3) అవుట్ కావడం జట్టును దెబ్బ తీసింది. అయితే రజా దూకుడుగా ఆడటంతో స్కోరు 150 పరుగులు దాటింది. ఆఖరి 5 ఓవర్లలో జింబాబ్వే 54 పరుగులు సాధించింది. దూబే, రుతురాజ్ ఒక్కో క్యాచ్ వదిలేసినా...భారత్‌కు వాటి వల్ల పెద్దగా నష్టం జరగలేదు.
ఆడుతూ పాడుతూ...
జింబాబ్వే ఇన్నింగ్స్ మొత్తంలో 10 ఫోర్లు ఉండగా...భారత ఓపెనర్లు తొలి 4 ఓవర్లలోనే 10 ఫోర్లు బాదారు. ఎన్‌గరవ వేసిన తొలి ఓవర్లో 3 ఫోర్లు కొట్టిన జైస్వాల్...చటారా ఓవర్లో 4 ఫోర్లు బాదాడు. పవర్‌ప్లేలో భారత్ 61 పరుగులు చేసింది. ఆ తర్వాత 29 బంతుల్లో జైస్వాల్ అర్ధసెంచరీ పూర్తయింది. అక్రమ్ ఓవర్లో 3 ఫోర్లు కొట్టిన గిల్ 35 బంతుల్లో సిరీస్‌లో వరుసగా రెండో హాఫ్ సెంచరీని అందుకున్నాడు.
బెన్నెట్ ఓవర్లో గిల్ 2 సిక్స్‌లు బాదడంతో మరో ఎండ్‌లో జైస్వాల్‌కు సెంచరీ అవకాశం దక్కలేదు. ఐపీఎల్‌లో చెన్నై జట్టు తరఫున రాణించి గుర్తింపు తెచ్చుకున్న పేసర్ తుషార్ దేశ్‌పాండే ఈ మ్యాచ్‌లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. భారత్ తరఫున టి20లు ఆడిన 115వ ఆటగాడిగా గుర్తింపు పొందాడు.
స్కోరు వివరాలు:
జింబాబ్వే ఇన్నింగ్స్: మదివెరె (సి) రింకూ సింగ్ (బి) దూబే 25; మరుమని (సి) రింకూ సింగ్ (బి) అభిõÙక్ 32; బెన్నెట్ (సి) జైస్వాల్ (బి) సుందర్ 9; రజా (సి) గిల్ (బి) దేశ్‌పాండే 46; క్యాంప్‌బెల్ (రనౌట్) 3; మయర్స్ (సి) అండ్ (బి) ఖలీల్ 12; మదాందె (సి) రింకూ సింగ్ (బి) ఖలీల్ 7; అక్రమ్ (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 152. వికెట్ల పతనం: 1–63, 2–67, 3–92, 4–96, 5–141, 6–147, 7–152.
బౌలింగ్: ఖలీల్ 4–0–32–2, దేశ్‌పాండే 3–0–30–1, బిష్ణోయ్ 4–0–22–0, సుందర్ 4–0–32–1, అభిõÙక్ 3–0–20–1, దూబే 2–0–11–1.
భారత్ ఇన్నింగ్స్: జైస్వాల్ (నాటౌట్) 93; గిల్ (నాటౌట్) 58; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (15.2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 156. బౌలింగ్: ఎన్‌గరవ 3–0–27–0, ముజరబాని 3.2–0–25–0, చటారా 2–0–23–0, అక్రమ్ 4–0–41–0, రజా 2–0–24–0, బెన్నెట్ 1–0–16–0.
Comments
Please login to add a commentAdd a comment