
వచ్చే నెల (అక్టోబర్) 16 నుంచి ప్రారంభంకానున్న టీ20 వరల్డ్‌కప్ కోసం భారత జట్టు ఎంపికకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. 15 మంది సభ్యులతో కూడిన టీమిండియాను సెప్టెంబర్ 16న ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ప్రధాన పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్ గాయాలపై ఎలాంటి అధికారిక అప్‌డేట్ అందకపోవడంతో జట్టు ప్రకటన ఆలస్యమైనట్లు తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం ఎన్‌సీఏలో ఉంటున్న బుమ్రా, హర్షల్ పటేల్‌కు మరోసారి ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహించాలని బీసీసీఐ భావిస్తుంది. ఒకవేళ బుమ్రా, హర్షల్ ఫిట్‌నెస్ పరీక్షలో విఫలమైతే వారిని పక్కకు కూర్చోబెట్టడం ఖాయమని సెలక్షన్ కమిటీ ముఖ్యుడొకరు తెలిపారు.
అతడందించిన సమాచారం మేరకు.. హర్షల్ పటేల్ ఫిట్‌నెస్ సాధించాడని తెలుస్తోంది. బుమ్రా విషయమే ఎటూ తేలడం లేదని, మునపటిలా అతను వేగంగా బౌలింగ్ చేయలేకపోతున్నాడని సమాచారం. బుమ్రా ఫిట్‌నెస్ పరీక్షలో విఫలమైతే అతని స్థానంలో మహ్మద్ షమీ జట్టులోకి రావడం ఖాయమని తెలుస్తోంది. టీ20 వరల్డ్‌కప్ కోసం ప్రకటించే టీమిండియాలో తప్పక ఉంటాడనుకున్న రవీంద్ర జడేజా ఇదివరకే గాయం కారణంగా జట్టుకు దూరం కాగా.. తాజాగా బుమ్రా గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదన్న సమాచారం టీమిండియాను మరింత కలవరపెడుతుంది.
చదవండి: సెంచరీ చేయకుండా మూడేళ్లు కొనసాగడం కోహ్లికే సాధ్యమైంది..!