
చాంగ్వాన్ (దక్షిణ కొరియా): ఈ ఏడాది అంతర్జాతీయ షూటింగ్ సీజన్‌లోని మూడో ప్రపంచకప్ టోర్నమెంట్‌లో భారత షూటర్ల పతకాల వేట కొనసాగుతోంది. మంగళవారం భారత్ ఖాతాలో 14వ పతకం చేరింది. 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్ విభాగంలో అనీశ్ భన్వాలా–రిథమ్ సాంగ్వాన్ ద్వయం భారత్‌కు కాంస్య పతకాన్ని అందించింది. కాంస్య పతక పోరులో అనీశ్–రిథమ్ జోడీ 16–12 పాయింట్లతో అనా దెడోవా–మార్టిన్ పొదరాస్కీ (చెక్ రిపబ్లిక్) జంటపై విజయం సాధించింది. ఆరు జోడీలు పాల్గొన్న క్వాలిఫికేషన్ స్టేజ్–2లో అనీశ్–రిథమ్ 380 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచి కాంస్య పతక పోరుకు అర్హత పొందారు.
అనీశ్–రిథమ్ జంటకిది రెండో ప్రపంచకప్ పతకం. ఈ ఏడాది మార్చిలో కైరోలో జరిగిన ప్రపంచకప్ టోర్నీలో అనీశ్–రిథమ్ జోడీ స్వర్ణ పతకం సొంతం చేసుకుంది. 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ మిక్స్‌డ్ ఈవెంట్‌లో బరిలోకి దిగిన రెండు భారత జోడీలు త్రుటిలో పతక మ్యాచ్‌లకు దూరమయ్యాయి. సంజీవ్ రాజ్‌పుత్–అంజుమ్ మౌద్గిల్ జంట ఐదో స్థానంలో, ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్–ఆశీ చౌక్సీ జోడీ ఆరో స్థానంలో నిలిచాయి. తాజా ప్రపంచకప్ టోర్నీలో భారత్ ఐదు స్వర్ణాలు, ఐదు రజతాలు, నాలుగు కాంస్య పతకాలు సాధించి మొత్తం 14 పతకాలతో టాప్ ర్యాంక్‌లో కొనసాగుతోంది.
చదవండి: Commonwealth Games 2022: కామన్ వెల్త్ గేమ్స్.. భారత అథ్లెట్లలో స్ఫూర్తి నింపిన ప్రధాని