మూడు మ్యాచ్‌ల ద్వైపాక్షిక వన్డే సిరీస్ కోసం ఐర్లాండ్ మహిళల జట్టు తొలిసారి భారత్‌లో పర్యటిస్తుంది. సిరీస్‌లో భాగంగా రాజ్‌కోట్ వేదికగా ఇవాళ (జనవరి 10) తొలి వన్డే జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసింది.
ఓపెనర్ (కెప్టెన్) గాబీ లెవిస్ (129 బంతుల్లో 92; 15 ఫోర్లు) ఎనిమిది పరుగుల తేడాతో సెంచరీ మిస్ చేసుకోగా.. మిడిలార్డర్ బ్యాటర్ లియా పాల్ (73 బంతుల్లో 59; 7 ఫోర్లు) అర్ద సెంచరీతో రాణించింది. ఆఖర్లో అర్లీన్ కెల్లీ (25 బంతుల్లో 28; 4 ఫోర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో ఐర్లాండ్ గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది.
ఐర్లాండ్ ఇన్నింగ్స్‌లో వీరు మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. వికెట్ కీపర్ కౌల్టర్ రెయిలీ 15 పరుగులతో అజేయంగా నిలువగా.. సారా ఫోర్బ్స్ (9), ఉనా రేమండ్ హోయ్ (5), ఓర్లా ప్రెండర్‌గాస్ట్ (9), లారా డెలానీ (0) విఫలమయ్యారు. భారత బౌలరల్లో ప్రియా మిశ్రా రెండు వికెట్లు పడగొట్టగా.. దీప్తి శర్మ, సయానీ సత్ఘరే, టిటాస్ సాధు తలో వికెట్ దక్కించుకున్నారు.
239 పరుగుల నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్.. 34.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఆడుతూపాడుతూ విజయం సాధించింది. ఓపెనర్ స్మృతి మంధన (29 బంతుల్లో 41; 6 ఫోర్లు, సిక్స్) మెరుపు ఇన్నింగ్స్ ఆడి టీమిండియా గెలుపుకు పునాది వేయగా.. మరో ఓపెనర్ ప్రతీక రావల్ (96 బంతుల్లో 89; 10 ఫోర్లు, సిక్స్) టీమిండియాను లక్ష్యానికి దగ్గర చేసింది.
ఆఖర్లో తేజల్ హసబ్నిస్ (46 బంతుల్లో 53 నాటౌట్; 9 ఫోర్లు) మెరుపు అర్ద శతకం సాధించి టీమిండియాను విజయతీరాలకు చేర్చింది. భారత ఇన్నింగ్స్‌లో హర్లీన్ డియోల్ 32 బంతుల్లో 20, జెమీమా రోడ్రిగెజ్ 6 బంతుల్లో 9, రిచా ఘోష్ 2 బంతుల్లో 8 (నాటౌట్) పరుగులు చేసి భారత విజయంలో తమ వంతు పాత్ర పోషించారు.
ఐర్లాండ్ బౌలర్లలో అమీ మగూర్ మూడు వికెట్లు పడగొట్టగా.. ఫ్రేయా సర్జంట్ ఓ వికెట్ దక్కించుకుంది. ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్ ప్లేయర్ ఓర్లా ప్రెండర్‌గాస్ట్ మూడు క్యాచ్‌లు పట్టింది. ఈ గెలుపుతో భారత్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఇదే వేదికగా జనవరి 12న జరుగనుంది.
Comments
Please login to add a commentAdd a comment