టీమిండియా బ్యాటర్ల వీరవిహారం.. వన్డేల్లో అత్యధిక స్కోర్‌ | INDW VS IREW 2ND ODI: INDIA WOMENS TEAM REGISTERED THEIR HIGHEST TOTAL IN ODI CRICKET HISTORY | Sakshi
Sakshi News home page

టీమిండియా బ్యాటర్ల వీరవిహారం.. వన్డేల్లో అత్యధిక స్కోర్‌

Published Sun, Jan 12 2025 3:11 PM | Last Updated on Sun, Jan 12 2025 3:18 PM

INDW VS IREW 2ND ODI: INDIA WOMENS TEAM REGISTERED THEIR HIGHEST TOTAL IN ODI CRICKET HISTORY

భారత మహిళల క్రికెట్‌ జట్టు వన్డేల్లో తమ అత్యధిక స్కోర్‌ నమోదు చేసింది. ఐర్లాండ్‌తో ఇవాళ (జనవరి 12) జరిగిన మ్యాచ్‌లో భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 370 పరుగులు చేసింది. వన్డేల్లో టీమిండియాకు ఇదే అత్యధిక స్కోర్‌. గతంలో భారత అత్యధిక స్కోర్‌ 358/2గా ఉండింది. 2017లో ఇదే ఐర్లాండ్‌పై భారత్‌ 2 వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసింది. గతేడాది డిసెంబర్‌లో భారత్‌ విండీస్‌పై కూడా ఇదే స్కోర్‌ (358/5) నమోదు చేసింది.

మ్యాచ్‌ విషయానికొస్తే.. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఐర్లాండ్‌తో ఇవాళ జరిగిన రెండో వన్డేలో భారత్‌ అతి భారీ స్కోర్‌ చేసింది. ఈ మ్యాచ్‌లో భారత టాపార్డర్‌ బ్యాటర్లు వీరవిహారం చేశారు. మిడిలార్డర్‌ బ్యాటర్‌ జెమీమా రోడ్రిగెజ్‌ (91 బంతుల్లో 102; 12 ఫోర్లు) సూపర్‌ సెంచరీతో కదంతొక్కగా.. తొలి ముగ్గురు బ్యాటర్లు స్మృతి మంధన (54 బంతుల్లో 73; 10 ఫోర్లు, 2 సిక్సర్లు), ప్రతిక రావల్‌ (61 బంతుల్లో 67; 8 ఫోర్లు, సిక్సర్‌), హర్లీన్‌ డియోల్‌ (84 బంతుల్లో 89; 12 ఫోర్లు) మెరుపు అర్ద సెంచరీలతో రాణించారు. ఐర్లాండ్‌ బౌలర్లలో ఓర్లా ప్రెండర్‌గాస్ట్‌, అర్లీన్‌ కెల్లీ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. జార్జీనా డెంప్సే ఓ వికెట్‌ దక్కించకుంది.

వన్డేల్లో భారత్‌ సాధించిన అత్యధిక స్కోర్లు..
370/5 ఐర్లాండ్‌పై (2025)
358/2 ఐర్లాండ్‌పై (2017)
358/5 వెస్టిండీస్‌పై (2024)
333/5 ఇంగ్లండ్‌పై (2022)
325/3 సౌతాఫ్రికాపై (2024)
317/8 వెస్టిండీస్‌పై (2022)
314/9 వెస్టిండీస్‌పై (2024)
302/3 సౌతాఫ్రికాపై (2018)

కాగా, ఐర్లాండ్‌తో ప్రస్తుతం జరుగుతున్న సిరీస్‌లో భారత్‌ తొలి మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఐర్లాండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసింది. కెప్టెన్‌ గాబీ లెవిన్‌ (92) ఆ జట్టు తరఫున అత్యధిక స్కోర్‌ చేసింది. లియా పాల్‌ (59) అర్ద సెంచరీతో రాణించింది.

భారత బౌలర్లలో ప్రియా మిశ్రా 2, టిటాస్‌ సాధు, సయాలీ సత్గరే, దీప్తి శర్మ తలో వికెట్‌ పడగొట్టారు. ఛేదనలో భారత్‌ 34.3 ఓవర్లలో విజయతీరాలకు చేరింది. ప్రతిక రావల్‌ (89), తేజల్‌ హసబ్నిస్‌ (53 నాటౌట్‌) అర్ద సెంచరీతో సత్తా చాటారు. స్మృతి మంధన (41) ఓ మోస్తరు స్కోర్‌ చేసింది. ఐర్లాండ్‌ బౌలర్‌ ఏమీ మగూర్‌ 3 వికెట్లు పడగొట్టింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement