బెంగళూరు: నాలుగేళ్ల క్రితం ఇంగ్లండ్ గడ్డపై జరిగిన వన్డే ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ హవా సాగింది. ఈ టోర్నీలో 5 సెంచరీలతో 648 పరుగులు సాధించి అతను అగ్రస్థానంలో నిలిచాడు. ఆ సమయంలో తాను మానసికంగా ఎంతో ప్రశాంత స్థితిలో ఉన్నానని, ఇప్పుడు కూడా అదే తరహాలో ఉండాలని కోరుకుంటున్నట్లు రోహిత్ చెప్పాడు.
గత టోర్నీతో పోలిస్తే ఈసారి అతను కెప్టెన్ హోదాలో బరిలోకి దిగబోతున్నాడు. ‘సానుకూలమైనా, ప్రతికూలమైనా ఎలాంటి బయటి అంశాలు నాపై ప్రభావం చూపించకుండా జాగ్రత్త పడుతున్నా. ఏమీ పట్టించుకోకుండా ప్రశాంతంగా ఉండటం ఎంతో ముఖ్యం.
సరిగ్గా చెప్పాలంటే 2019 ప్రపంచకప్‌కు ముందు ఎలా ఉన్నానో అలాంటి మానసిక దృక్పథం ఇప్పుడు కావాలి. ఆటగాడిగా, వ్యక్తిగతంగా కూడా అప్పటి నా పరిస్థితిని గుర్తు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నా. అలాగే ఉండాలని భావిస్తున్నా. అప్పుడు అన్నీ చక్కగా కుదిరాయి.
అంతా కలిసిరావడంతో ఎంతో బాగా సన్నద్ధమయ్యా’ అని రోహిత్ వ్యాఖ్యానించాడు. భారత క్రికెట్‌పై తన ముద్ర ఏమిటనేది తాను చెప్పనని, అది అభిమానులు నిర్ణయిస్తారన్న రోహిత్... జట్టు సెలక్షన్ విషయంలో మాత్రం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని అన్నాడు.
‘వరల్డ్ కప్ టీమ్‌లో స్థానం దక్కకపోతే ఎంత బాధగా ఉంటుందో నాకు బాగా తెలుసు. 2011లో చోటు కోల్పోయినప్పుడు యువరాజ్ సింగ్ నన్ను ఓదార్చి ఏం పర్లేదు, భవిష్యత్తు బాగుంటుందని భరోసా ఇచ్చాడు. నిజంగానే ఆ తర్వాత నేను గొప్పగా రాణించాను. ఇప్పుడు కూడా ఎవరినైనా తప్పిస్తే అందుకు బలమైన కారణం ఉంటుందే తప్ప వ్యక్తిగత ఇష్టాఇష్టాలు ఉండవు’ అని రోహిత్ స్పష్టం చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment