CWC 2023 Final India Vs Australia: ఆస్ట్రేలియాతో టీమిండియా వరల్డ్‌కప్ ఫైనల్ నేపథ్యంలో భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. స్వయం తప్పిదాలు తప్ప రోహిత్ సేనను ఈసారి ట్రోఫీ గెలవనీయకుండా అడ్డుపడే శక్తి వేరే ఏదీ లేదన్నాడు. అయితే, ఆస్ట్రేలియాను తక్కువగా అంచనా వేసే పరిస్థితి లేదని.. తమదైన రోజు వాళ్లు చెలరేగడం ఖాయమని పేర్కొన్నాడు.
ఆత్మవిశ్వాసం మెండుగా
ఇప్పటికే ఐదుసార్లు జగజ్జేతగా నిలిచిన కంగారూలకు ఇలాంటి హైవోల్టేజీ మ్యాచ్‌లలో ఒత్తిడి జయించడం వెన్నతో పెట్టిన విద్య అని యువీ పేర్కొన్నాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని టీమిండియాకు విజ్ఞప్తి చేశాడు. ఈ మేరకు.. ‘‘ఈ వరల్డ్‌కప్ టోర్నీలో వాళ్ల ప్రదర్శన అద్భుతంగా సాగింది. ఫైనల్లోనూ బాగానే ఆడతారనుకుంటున్నా. కేవలం తమంతట తాము తప్పు చేస్తే తప్ప ఈసారి టీమిండియా ఓడిపోయే అవకాశాలు లేవు.
అయితే, పూర్తి ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నందున కచ్చితంగా గెలిచి తీరతారనే అనిపిస్తోంది. 2003 వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా ఆద్యంతం ఆధిపత్యం కొనసాగించింది. సారి టోర్నీ మొత్తంలో టీమిండియా డామినేషన్ సాగింది. కాబట్టి ఈసారి ఆసీస్ సాధారణ ప్రదర్శనతో గట్టెక్కే పరిస్థితి లేదు. అత్యుత్తమంగా రాణించకపోతే టీమిండియాను నిలువరించడం వారికి సాధ్యం కాదు.
ఒత్తిడిని ఎలా జయించాలో వాళ్లకు తెలుసు
అయితే, ఐసీసీ వంటి మేజర్ టోర్నీల్లో ఒత్తిడిని ఎలా అధిగమించాలో ఆస్ట్రేలియన్లకు బాగా తెలుసు. ఇప్పటికే వాళ్లు చాలాసార్లు టైటిల్ గెలిచారు. సౌతాఫ్రికాతో సెమీ ఫైనల్లో స్పెషలిస్టు బ్యాటర్లు అవుటైన వేళ.. బౌలర్లు ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్ బ్యాట్‌తో పట్టుదలగా నిలబడిన తీరు అద్భుతం.
ఫైనల్ వంటి ప్రతిష్టాత్మక మ్యాచ్‌లో వాళ్లు ఎలాంటి ప్రదర్శన కనబరచగలరో అంచనా వేయొచ్చు. అందుకే రోహిత్ సేన మరింత జాగరూకతతో ఉండాలి’’ అని యువీ హెచ్చరించాడు. స్పోర్ట్స్‌తక్‌తో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. కాగా టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య ఆదివారం(నవంబరు 19) వన్డే వరల్డ్‌కప్-2023 ఫైనల్ జరుగనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఇందుకు వేదిక.
చదవండి: CWC 2023: ఆ ఇద్దరూ టీమిండియా పాలిట వరం.. అంచనాలకు మించి!
Comments
Please login to add a commentAdd a comment