అజేయ సెంచరీతో చెలరేగిన బ్యాటర్
జడేజా 86 నాటౌట్
మొదటి రోజు భారత్ 339/6
బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు మ్యాచ్
ఒకరికి అది ఓనమాలు నేర్చుకున్న సొంత మైదానం... మరొకరికి అక్కడి అభిమానులు ఆత్మీయతతో తమ సొంతవాడిగా మార్చుకున్న మైదానం...ఈ ఇద్దరూ జత కలిస్తే అక్కడ అద్భుతం జరగాల్సిందే. చెపాక్ మైదానంలో గురువారం సరిగ్గా అదే జరిగింది. సాధారణ పరిస్థితుల్లో అలవోకగా ఆడటం వేరు... 144/6 వద్ద కష్టాల్లో ఉన్న సమయంలో టీమ్‌ను రక్షించి పటిష్టమైన స్థితికి చేర్చడం వేరు.
రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా దానిని చేసి చూపించారు. బంగ్లా దేశ్ బౌలింగ్ ముందు అనూహ్యంగా టీమిండియా కుప్పకూలగా వీరిద్దరి భాగస్వామ్యం భారీ స్కోరుకు బాటలు వేసింది. ఉదయం పేస్‌కు అనుకూలించిన పిచ్‌పై బంగ్లా బౌలర్ హసన్ మహమూద్ ధాటికి ఒక దశలో 34/3 వద్ద నిలిచిన టీమ్ కోలుకొని తొలి రోజును ఘనంగా ముగించింది. అశ్విన్ ఆరో శతకంతో మెరవగా... జడేజా సెంచరీకి చేరువయ్యాడు.
చెన్నై: బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో భారత జట్టుకు సరైన ఆరంభం లభించింది. టాస్ ఓడి ఆరంభంలో తడబడినా...చివరకు టీమిండియాదే పైచేయి అయింది. మ్యాచ్ మొదటి రోజు గురువారం ఆట ముగిసే సమయానికి భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 80 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది.
రవిచంద్రన్ అశ్విన్ (112 బంతుల్లో 102 నాటౌట్; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీ పూర్తి చేసుకోగా...రవీంద్ర జడేజా (117 బంతుల్లో 86 నాటౌట్; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) అతనికి అండగా నిలుస్తూ కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
వీరిద్దరు ఇప్పటికే ఏడో వికెట్‌కు అభేద్యంగా 195 పరుగులు జోడించారు. యశస్వి జైస్వాల్ (118 బంతుల్లో 56; 9 ఫోర్లు) కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో హసన్ మహమూద్ (4/58) భారత్‌ను దెబ్బ తీశాడు.
రోహిత్, కోహ్లి విఫలం...
చల్లటి వాతావరణం, కాస్త తేమను దృష్టిలో ఉంచుకొని బంగ్లా కెపె్టన్ నజ్ముల్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. భారత గడ్డపై ప్రత్యర్థి కెపె్టన్ ఒకరు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడం ఏడేళ్లలో ఇదే మొదటిసారి. పాకిస్తాన్‌పై సిరీస్ గెలిపించిన తమ బౌలర్లను మరోసారి నమ్ముకుంటూ బంగ్లా ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగింది. కేవలం 3 టెస్టుల అనుభవం ఉన్న పేసర్ హసన్ మహమూద్ వరుసగా మూడు ఓవర్లలో మూడు వికెట్లు తీసి తన కెప్టెన్ నమ్మకాన్ని నిలబెట్టాడు.
తన మూడో ఓవర్లోనే అతను రోహిత్ శర్మ (6)ను పెవిలియన్ పంపించాడు. తన తర్వాతి ఓవర్లోనే శుబ్‌మన్ గిల్ (0)ను కూడా అతను అవుట్ చేశాడు. ఆ తర్వాత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి (6) కూడా ఎక్కువ సేపు నిలవలేదు. హసన్ బౌలింగ్‌లోనే డ్రైవ్ చేయబోయి కీపర్‌కు క్యాచ్ ఇవ్వగా... హసన్ 5–2–6–3 స్పెల్‌తో అదరగొట్టాడు. అయితో మరో ఎండ్‌లో యశస్వి పట్టుదలగా ఆడాడు.
అతనికి రిషబ్ పంత్ (52 బంతుల్లో 39; 6 ఫోర్లు) నుంచి సహకారం లభించింది. వీరిద్దరు చక్కటి సమన్వయంతో బ్యాటింగ్ చేస్తూ నాలుగో వికెట్‌కు 62 పరుగులు జత చేశారు. అయితే లంచ్ తర్వాత పంత్ వికెట్ కూడా హసన్‌కే దక్కింది. 95 బంతుల్లో యశస్వి హాఫ్ సెంచరీ పూర్తయింది. భారత గడ్డపై వరుసగా ఆరు టెస్టుల్లో అతను కనీసం అర్ధ సెంచరీ సాధించడం విశేషం. అనంతరం ఒకే స్కోరు వద్ద యశస్వి, కేఎల్ రాహుల్ (16) వెనుదిరిగారు.
భారీ భాగస్వామ్యం...
స్కోరు 144/6గా ఉన్న స్థితిలో జట్టు ఇన్నింగ్స్ ముగిసేందుకు ఎంతో సమయం పట్టదనిపించింది. అయితే ఈ దశలో జడేజాకు అశ్విన్ జత కలిశాడు. అప్పటి నుంచి మ్యాచ్ స్వరూపం మారిపోయింది. ఆ తర్వాత 37.4 ఓవర్ల పాటు ఈ జోడీని విడదీయలేక బంగ్లా బౌలర్లు చేతులెత్తేశారు. గత తప్పిన బంతులతో వారు ఈ ద్వయం పాతుకుపోయేందుకు అవకాశం కల్పించారు. ఏ ఒక్క బౌలర్ కూడా ప్రభావం చూపలేకపోయాడు.
సొంతగడ్డపై అశ్విన్ జోరుగా ఆడగా, జడేజా పరిస్థితులను బట్టి సహచరుడికి అండగా నిలిచాడు. డ్రైవ్, పంచ్, పుల్, స్లాగ్... ఇలా అశ్విన్ బ్యాటింగ్‌లో అన్ని షాట్లూ కనిపించాయి. ప్రేక్షకుల హర్షధ్వానాల మధ్య అతను కవర్స్, స్క్వేర్‌లెగ్ దిశగా పరుగులు రాబట్టాడు. వీరిద్దరు కుదురుకున్న తర్వాత పరుగులు అలవోకగా వచ్చాయి. నాహిద్ బౌలింగ్‌లో అశ్విన్ కొట్టిన ర్యాంప్ షాట్ బౌండరీ హైలైట్‌గా నిలిచింది.
మరో ఆరు నిమిషాల్లో రోజు ముగుస్తుందనగా షకీబ్ బౌలింగ్‌లో మిడ్ వికెట్ దిశగా ఆడి సింగిల్ తీయడంతో 108 బంతుల్లో అశ్విన్ సెంచరీ పూర్తయింది. ఒక్క చివరి సెషన్‌లోనే భారత్ 32 ఓవర్లలో 163 పరుగులు సాధించగా... అశ్విన్, జడేజా వేగంగా ఓవర్‌కు 5.17 పరుగుల రన్‌రేట్‌తో పరుగులు తీయడం విశేషం.
6 టెస్టుల్లో అశ్విన్‌కు ఇది ఆరో సెంచరీ. వెస్టిండీస్‌పై నాలుగు సెంచరీలు సాధించిన అతను... 2021లో ఇదే చెన్నై మైదానంలో ఇంగ్లండ్‌పై మరో శతకం బాదాడు.
‘సొంత ప్రేక్షకుల మధ్య ఆడటం ఎప్పుడూ సంతోషాన్నిస్తుంది. నాకెంతో ఇష్టమైన మైదానమిది. ఇక్కడ ఆడిన గత టెస్టులాగే ఈ సారి సెంచరీ చేయడం ప్రత్యేకంగా అనిపిస్తోంది. ఇటీవలే టి20 టోర్నీ ఆడిన నేను బ్యాటింగ్‌పై బాగా దృష్టి పెట్టాను. ఇలాంటి పిచ్‌పై దూకుడుగా ఆడటం అవసరం.
నేను అలసిపోయిన సమయంలో జడేజా అండగా నిలిచి ఉత్సాహపరిచాడు. రెండో రోజు కూడా ఆరంభంలో ఇక్కడ పేసర్లు ప్రభావం చూపిస్తారు. కానీ మ్యాచ్ సాగుతున్న కొద్దీ ఈ పిచ్ స్పిన్‌కు అనుకూలంగా మారుతుంది’ –రవిచంద్రన్ అశ్విన్
స్కోరు వివరాలు
భారత్ తొలి ఇన్నింగ్స్: యశస్వి (సి) షాద్‌మన్ (బి) నాహిద్ 56; రోహిత్ (సి) నజు్మల్ (బి) హసన్ 6; గిల్ (సి) దాస్ (బి) హసన్ 0; కోహ్లి (సి) దాస్ (బి) హసన్ 6; పంత్ (సి) దాస్ (బి) హసన్ 39; రాహుల్ (సి) జాకీర్ (బి) మిరాజ్ 16; జడేజా (నాటౌట్) 86; అశ్విన్ (నాటౌట్) 102; ఎక్స్‌ట్రాలు 28; మొత్తం (80 ఓవర్లలో 6 వికెట్లకు) 339. వికెట్ల పతనం: 1–14, 2–28, 3–34, 4–96, 5–144, 6–144. బౌలింగ్: తస్కీన్ 15–1–47–0, హసన్ మహమూద్ 18–4–58–4, నాహిద్ రాణా 17–2–80–1, మెహదీ హసన్ మిరాజ్ 21–2–77–1, షకీబ్ 8–0–50–0, మోమినుల్ 1–0–4–0.
Comments
Please login to add a commentAdd a comment