రవీంద్ర జడేజా అత్యంత ప్రతిభావంతుడైన క్రికెటర్ అని టీమిండియా స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసించాడు. జడ్డూ ఆటతీరు తనకెంతో ఇష్టమని తెలిపాడు. కలిసి పనిచేయడానికి ఆరంభంలో కాస్త తడబడ్డామని.. అయితే ప్రస్తుతం తమ మధ్య మంచి అనుబంధం ఏర్పడిందని అశూ అన్నాడు.
సొంతగడ్డపై అశ్విన్‌కు తిరుగులేదన్న విషయం తెలిసిందే. స్పిన్‌కు అనుకూలించే ఉపఖండ పిచ్‌లపై టెస్టు సిరీస్‌లు ఉంటే.. అశూకు తప్పక తుదిజట్టులో చోటు దక్కుతుంది. అయితే, టీమిండియా విదేశీ పర్యటనలో ఉన్నపుడు మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంటుంది. అశూను కాదని స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు పెద్దపీట వేస్తారు సెలక్టర్లు.
విదేశాల్లో ఎక్కువగా బౌన్సీ పిచ్‌లే ఉంటాయి కాబట్టి సహజంగానే ఫాస్ట్ బౌలర్లకు ప్రాధాన్యం ఉంటుంది. అలాంటి చోట స్పెషలిస్టు స్పిన్నర్ కంటే కూడా ఆల్‌రౌండర్ వైపే మేనేజ్‌మెంట్ మొగ్గుచూపుతుంది. ఫలితంగా అశూను వెనక్కినెట్టి జడ్డూ ఇప్పటికే ఎన్నో సిరీస్‌లలో భాగమయ్యాడు. ఈ నేపథ్యంలో.. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన అశ్విన్‌కు జడేజా గురించి ప్రశ్న ఎదురైంది.
అసూయ, ద్వేషం లేవు
జడ్డూపై అసూయ పడుతారా అన్న హోస్ట్ విమల్ కుమార్‌కు బదులిస్తూ.. ‘‘నాకు అవకాశం రాకపోవడంలో జడేజా తప్పేముంది? నాకు అతడిపై అసలు ఎలాంటి అసూయ, ద్వేషం లేవు. నా కోసం అతడిని జట్టు నుంచి తప్పించాలని.. నేనే మ్యాచ్‌లు ఆడాలని అస్సలు ఆలోచించను. ప్రతిఒక్కరు ఈర్ష్యను అధిగమిస్తేనే సంతోషంగా ముందుకు వెళ్లగలరు
నేను చూసిన మోస్ట్ టాలెంటెడ్ క్రికెటర్ జడేజా. అతడి ఆట సహజంగా ఉంటుంది. కలిసి ఆడిన తొలినాళ్లలో కాస్త ఇబ్బంది పడ్డ మాట వాస్తవమే. అయితే, ఇప్పుడు మా మధ్య ఆట పరంగా మంచి అనుబంధం, సమన్వయం ఉంది’’ అని అశ్విన్ చెప్పుకొచ్చాడు.
కాగా టీమిండియా సెప్టెంబరు 19 నుంచి బంగ్లాదేశ్‌తో స్వదేశంలో సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌లో అశ్విన్‌తో పాటు జడ్డూకూ చోటు దక్కే అవకాశం ఉంది. ఇక చెన్నై ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ ఇప్పటి వరకు టీమిండియా తరఫున 100 టెస్టులు పూర్తి చేసుకుని 516 వికెట్లు పడగొట్టాడు. మరోవైపు.. సౌరాష్ట్ర స్టార్ జడ్డూ.. 72 టెస్టులు ఆడి 294 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment