శుభారంభంపై భారత్‌ దృష్టి | Indias first T20 against Sri Lanka today | Sakshi
Sakshi News home page

శుభారంభంపై భారత్‌ దృష్టి

Published Sat, Jul 27 2024 4:29 AM | Last Updated on Sat, Jul 27 2024 1:06 PM

Indias first T20 against Sri Lanka today

నేడు శ్రీలంకతో తొలి టి20

యువ ఆటగాళ్ల సత్తాకు పరీక్ష

తొలిసారి గంభీర్‌ శిక్షణలో టీమిండియా బరిలోకి

రాత్రి 7 గంటల నుంచి సోనీ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం  

పల్లెకెలె: భారత్‌ కొత్తకొత్తగా లంక పర్యటనను ప్రారంభించేందుకు సిద్ధమైంది. గతంలో టి20 సారథిగా వ్యవహరించినప్పటికీ సూర్యకుమార్‌ యాదవ్‌ ఈసారి గంభీర్‌ కోచింగ్‌లో నడవడం కొత్తే! టాపార్డర్‌లో రోహిత్‌ శర్మ, కోహ్లితో పాటు ఆల్‌రౌండర్‌ జడేజా పొట్టి ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పడంతో ఆ చాలెంజింగ్‌ స్థానాలు భర్తీ చేసే ఆటగాళ్లకు ఈ సిరీస్‌ సరికొత్తగా స్వాగతం పలకబోతోంది. మొత్తం పల్లెకెలె వేదికపైనే జరిగే మూడు టి20ల సిరీస్‌లో నేడు తొలి మ్యాచ్‌ జరుగుతోంది. 

కొత్త కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ అనుభవం, సూర్యకుమార్‌ సారథ్యం, సత్తాగల యువ ఆటగాళ్లతో భారత్‌ సమతూకంగా ఉంది. కొత్త జట్టు మేళవింపుతో శుభారంభంపై దృష్టి సారించింది. కొత్త కోచ్‌ గురించి కొత్తగా చెప్పుకోవాల్సిందేమీ లేదు. గంభీర్‌ ఓపెనర్‌గా నిరూపించుకున్నాడు. అంతకుమించి రెండు ప్రపంచకప్‌ (2007 టి20; 2011 వన్డే) విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. 

అలాగే దీనితో పోల్చలేకపోయినా కూడా... ఐపీఎల్‌లో విజయవంతమైన సారథిగా, అనంతరం మెంటార్‌గానూ కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు టైటిళ్లు అందించాడు. కాబట్టి గంభీర్‌ మార్గదర్శనంపై ఎవరికీ ఏ అనుమానాలు లేవు. అయితే పూర్తిగా యువ ఆటగాళ్లతో కూడిన జట్టును ఏ విధంగా సన్నద్ధం చేస్తారన్నదానిపైనే సర్వత్రా ఆసక్తినెలకొంది.  

దుర్భేధ్యంగా టీమిండియా 
ఈ ఏడాది భారత జట్టు అద్భుతంగా రాణిస్తోంది. ప్రపంచకప్‌లో ట్రోఫీ గెలిచేదాకా జైత్రయాత్ర కొనసాగించింది. ఓవరాల్‌గా ఈ ఏడాది 16 టి20లు ఆడిన భారత్‌ 15 మ్యాచ్‌ల్లో గెలిచింది. జింబాబ్వేకెళ్లిన ద్వితీయశ్రేణి భారత జట్టు తొలి మ్యాచ్‌లో ఒటమి తప్ప సిరీస్‌ 4–1తో గెలిచి సత్తా చాటుకుంది. ఓపెనింగ్‌లో యశస్వి, గిల్‌లతో పాటు వన్‌డౌన్‌లో రిషభ్‌ పంత్‌ మెరిపిస్తే మిడిలార్డర్‌ను సూర్యకుమార్‌తో పాటు అనుభవజ్ఞుడైన హార్దిక్‌ పాండ్యా నడిపించగలడు.

బౌలింగ్‌లో బుమ్రా కూడా విశ్రాంతిలో ఉండటంతో.... మొత్తం మీద అనుభవజు్ఞల్లేని టీమిండియాకు ప్రస్తుతం పాండ్యానే పెద్ద దిక్కు. బౌలింగ్‌లో సిరాజ్, అర్‌‡్షదీప్‌ సింగ్‌లు సత్తా చాటితే ఆరంభంలోనే వికెట్లు కూలుతాయి. గంభీర్‌ ప్లాన్‌ ముగ్గురు స్పిన్నర్లయితే వాషింగ్టన్‌ సుందర్, అక్షర్‌ పటేల్‌లతో పాటు రవి బిష్ణోయ్‌కి చాన్స్‌ లభిస్తుంది.  

లంక ఎదురునిలిచేనా... 
స్టార్లు లేకపోయినా భారత్‌ సత్తాపై ఎవరికీ ఏ అనుమానాల్లేవు. కానీ కొన్నేళ్లుగా శ్రీలంక ప్రదర్శన మాత్రం నిరాశజనకంగా సాగుతోంది. ఇలాంటి జట్టును అనుభవం లేని కెపె్టన్‌ చరిత్‌ అసలంక ఏ మేరకు నడిపిస్తాడో చూడాలి. టాపార్డర్‌లో నిసాంక, కుశాల్‌ మెండిస్‌ బౌలింగ్‌లో హసరంగ, పతిరణ తప్ప జట్టులో నిలకడగా ఆడే ఆటగాళ్లే కరువయ్యారు. 

సొంతగడ్డపై అనుకూలత కూడా టి20లకు ఏమాత్రం అక్కరకు రాదు. కాబట్టి భారత్‌ యువ ఆటగాళ్లతో ఉన్నా... వారిలో ఐపీఎల్‌ అపారమైన అనుభవాన్నిచి్చంది. ఈ నేపథ్యంలో శ్రీలంక సిరీస్‌ గెలిచేందుకు కాదు... మ్యాచ్‌ నెగ్గేందుకే ప్రతిసారీ యుద్ధం చేయక తప్పదు! 

జట్లు (అంచనా) 
భారత్‌: సూర్యకుమార్‌ (కెప్టెన్‌), యశస్వి, శుబ్‌మన్, రిషభ్‌ పంత్, హార్దిక్‌ పాండ్యా, శివమ్‌ దూబే, సుందర్, అక్షర్, అర్శ్‌దీప్, రవి బిష్ణోయ్‌/ఖలీల్‌ అహ్మద్, సిరాజ్‌. 
శ్రీలంక: అసలంక (కెప్టెన్‌), నిసాంక, కుశాల్‌ మెండిస్, పెరీరా, ఫెర్నాండో, షనక, హసరంగ, తీక్షణ, బినుర ఫెర్నాండో, మదుషంక, పతిరణ. 

పిచ్, వాతావరణం 
ఇది స్పిన్‌ వికెట్‌. నిలదొక్కుకుంటే 180 పైచిలుకు స్కోరు సాధించవచ్చు. అయితే స్పిన్నర్లతో ఇబ్బందులు తప్పవు. శనివారం పగటివేళ వర్షం కురిసే అవకాశముంది. కానీ రాత్రికల్లా తెరిపినిస్తుందని స్థానిక వాతావరణశాఖ తెలిపింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement