పొట్టి క్రికెట్‌లో పెను సంచలనం నమోదైంది. మహిళల టీ20ల్లో భాగంగా మంగోలియాతో జరిగిన మ్యాచ్‌లో ఇండోనేషియా బౌలర్ రొహ్మాలియా రొహ్మాలియా పరుగులేమీ ఇవ్వకుండా ఏకంగా ఏడు వికెట్లు పడగొట్టింది. అంతర్జాతీయ టీ20ల్లో (పురుషులు, మహిళలు) ఇవే అత్యుత్తమ గణాంకాలు. ఐసీసీ గుర్తింపు పొందిన ఏ జట్టు తరఫున ఇలాంటి గణాంకాలు నమోదు కాలేదు.
పురుషుల క్రికెట్‌లో (టీ20ల్లో) అత్యుత్తమ గణాంకాలు స్యాజ్రుల్ ఇద్రుస్ (4-1-8-7) పేరిట ఉండగా.. మహిళల క్రికెట్‌లో రొహ్మాలియాకు ముందు ఈ రికార్డు నెదర్లాండ్స్ క్రికెటర్ ఫ్రెడ్రిక్ ఓవర్డిక్ (4-2-3-7) పేరిట ఉండింది. ప్రపంచ క్రికెట్‌లో ఇప్పటివరకు ఏ బౌలర్ పరుగులేమీ ఇవ్వకుండా 7 వికెట్లు తీసిన దాఖలాలు లేవు. రొహ్మాలియా తన కెరీర్‌లో రెండో టీ20 మ్యాచ్‌లోనే ఎవరికీ సాధ్యంకాని గణాంకాలు నమోదు చేయడం మరో విశేషం.
మ్యాచ్ విషయానికొస్తే.. బాలీ బాష్‌గా పిలువబడే టోర్నీలో ఇండోనేషియా, మంగోలియా జట్లు తలపడ్డాయి. ఈ సిరీస్‌లో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్‌లో రొహ్మాలియా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండోనేషియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. ఇండోనేషియా ఇన్నింగ్స్‌లో నందా సకారిని (61) అర్దసెంచరీతో రాణించింది. మంగోలియా బౌలర్లలో ఎంక్జుల్ 4 వికెట్లు పడగొట్టింది.
152 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మంగోలియా.. రొహ్మాలియా (3.2-3-0-7) ధాటికి 16.2 ఓవర్లలో 24 పరుగులకే కుప్పకూలింది. మంగోలియా ఇన్నింగ్స్‌లో ఒక్కరు కూడా కనీసం రెండంకెల మార్కు తాకలేకపోగా.. ఎక్స్‌ట్రాలు టాప్ స్కోర్ (10) కావడం విశేషం. మంగోలియా ఇన్నింగ్స్‌లో ఏకంగా ఆరుగురు డకౌట్లు అయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment