బీజీటీకి ముందు ఆస్ట్రేలియాకు బిగ్‌ షాక్‌.. ఇన్‌ ఫామ్‌ బౌలర్‌కు గాయం | Injury Setback For Australia, In Form Michael Neser Pulls Hamstring Before BGT, Check Out More Insights | Sakshi
Sakshi News home page

బీజీటీకి ముందు ఆస్ట్రేలియాకు బిగ్‌ షాక్‌.. ఇన్‌ ఫామ్‌ బౌలర్‌కు గాయం

Published Thu, Nov 7 2024 5:33 PM | Last Updated on Thu, Nov 7 2024 6:05 PM

Injury Setback For Australia, In Form Michael Neser Pulls Hamstring Before BGT

బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీకి ముందు ఆస్ట్రేలియాకు భారీ షాక్‌ తగిలింది. ఆ జట్టు ఇన్‌ ఫామ్‌ బౌలర్‌ మైఖేల్‌ నెసర్‌ గాయపడ్డాడు. భారత్‌-ఏతో జరుగుతున్న రెండో అనధికారిక టెస్ట్‌ సందర్భంగా నెసర్‌ హ్యామ్‌స్ట్రింగ్‌ ఇంజ్యూరీకి గురయ్యాడు. ఈ మ్యాచ్‌లో భారత టాపార్డర్‌ను కకావికలం చేసిన నెసర్‌.. తన 13వ ఓవర్‌లో గాయం బారిన పడి అర్దంతరంగా మైదానాన్ని వీడాడు. ఈ మ్యాచ్‌లో నెసర్‌ తిరిగి ఆడటం అనుమానమే అని తెలుస్తుంది. బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ కోసం ప్రకటించబోయే ఆస్ట్రేలియా జట్టులో నెసర్‌కు చోటు ఖాయమని అంతా అనుకున్నారు. 

ఈ లోపే అతను గాయపడటం ఆస్ట్రేలియా కొత్త సమస్యను తెచ్చిపెట్టింది. కాగా, బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీకి ముందు కీలక ఆటగాళ్లు ఒక్కొక్కరుగా గాయపడటం​ ఆస్ట్రేలియాకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఇప్పటికే కెమరూన్‌ గ్రీన్‌ గాయం​ కారణంగా ఈ సమ్మర్‌ మొత్తానికి దూరమయ్యాడు. తాజాగా నెసర్‌ కూడా గాయపడటం ఆస్ట్రేలియా శిబిరంలో ఆందోళన కలిగిస్తుంది. డేవిడ్‌ వార్నర్‌ రిటైర్మెంట్‌తో ఆసీస్‌కు ఓపెనర్‌ సమస్య ఎలాగూ ఉంది. వార్నర్‌ స్థానాన్ని ఎవరూ భర్తీ చేస్తారనే అంశంపై ఇప్పటికీ  క్లారిటీ లేదు.

34 ఏళ్ల రైట్‌ ఆర్మ్‌ మీడియం​ ఫాస్ట్‌ బౌలర్‌ అయిన నెసర్‌.. ఆస్ట్రేలియా-ఏ తరఫున ప్రాతినిథ్యం వహిస్తూ.. భారత్‌తో జరుగుతున్న రెండో అనధికారిక టెస్ట్‌లో సత్తా చాటాడు. ఈ మ్యాచ్‌లో నెసర్‌ గాయపడక ముందు అభిమన్యు ఈశ్వరన్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, సాయి సుదర్శన్‌, దేవ్‌దత్‌ పడిక్కల్‌ వికెట్లు తీశాడు. నెసర్‌ సెన్సేషపల్‌ స్పెల్‌ కారణంగా ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 161 పరుగులకే ఆలౌటైంది. ధృవ్‌ జురెల్‌ వీరోచితంగా పోరాడి బాధ్యతాయుతమైన హాఫ్‌ సెంచరీ (80) చేయడంతో భారత్‌ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది.  

భారత్‌ ఇన్నింగ్స్‌లో జురెల్‌ మినహా ఎవ్వరూ రాణించలేదు. అభిమన్యు ఈశ్వరన్‌ 0, కేఎల్‌ రాహుల్‌ 4, సాయి సుదర్శన్‌ 0, రుతురాజ్‌ గైక్వాడ్‌ 4, పడిక్కల్‌ 26, నితీశ్‌ రెడ్డి 16, తనుశ్‌ కోటియన్‌ 0, ఖలీల్‌ అహ్మద్‌ 1, ప్రసిద్ద్‌ కృష్ణ 14 పరుగులు చేశారు. భారత్‌ను 161 పరుగులకే కుప్పకూల్చిన అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఆస్ట్రేలియా.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 53 పరుగులు చేసింది. మార్కస్‌ హ్యారిస్‌ (26), సామ్‌ కొన్‌స్టాస్‌ (1) క్రీజ్‌లో ఉన్నారు. భారత తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు ఆస్ట్రేలియా ఇంకా 108 పరుగులు వెనుకపడి ఉంది. భారత బౌలర్లలో ముకేశ్‌ కుమార్‌, ఖలీల్‌ అహ్మద్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

ఇదిలా ఉంటే, బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీలో తొలి టెస్ట్‌ నవంబర్‌ 22న ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌ కోసం​ భారత జట్టును ఇదివరకే ప్రకటించగా.. ఆస్ట్రేలియా జట్టును ప్రకటించాల్సి ఉంది. 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement