Photo Courtesy: IPL t20.com
చెన్నై: రాయల్ చాలెంజర్స్‌తో చెపాక్‌లో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలుపు ఖాయమనుకున్న దశ నుంచి ఒక్కసారిగా పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయి ఓటమి పాలైంది. 27 పరుగుల వ్యవధిలోనే ఏడు వికెట్లు కోల్పోయి పరాజయతో మ్యాచ్‌ను ముగించడం అభిమానుల్ని నిరాశపరిచింది. స్కోరు బోర్డుపై 150 పరుగులే లక్ష్యం కానీ సన్‌రైజర్స్ ఆటగాళ్లు వరుసగా చేసుకుంటూ పోయిన తప్పిదాలే కొంప ముంచాయి. డేవిడ్ వార్నర్(54; 37 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) క్రీజ్‌లో ఉన్నంత సేపు మ్యాచ్ ఇంకా రెండు ఓవర్లు ముందుగానే ముగిస్తుందని అనుకున్నారు.
ఇక వార్నర్ రెండో వికెట్‌గా ఔటైన తర్వాత ఇక సన్‌రైజర్స్ పతనం మొదలైంది. బ్యాటర్స్ అంతా లైన్ తప్పేశారు. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించడం లేదనే విషయం తెలిసి కూడా షాట్లకు పోయి వికెట్లు సమర్పించుకున్నారు. క్రాస్ బ్యాటెడ్ షాట్లతో ఆర్సీబీకి మ్యాచ్‌ను అప్పగించేశారు. బెయిర్ స్టో మూడో వికెట్‌గా ఔటైన తర్వాత సన్‌రైజర్స్ స్టైక్ రొటేట్ చేయడంం మానేసింది. గాల్లో బంతిని ఎత్తడం, వికెట్ కోల్పోవడం ఇదే జరిగింది.
చెపాక్‌లో అంతే.. వార్నర్ అర్థం చేసుకోలేదా?
ఇప్పటివరకూ ఈ సీజన్‌లో చెపాక్ స్టేడియంలో నాలుగు మ్యాచ్‌లు జరగ్గా అందులో ఛేజింగ్ చేసిన జట్టు ఒక్కసారే విజయం సాధించింది. అది కూడా ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఆరంభపు మ్యాచ్‌లో ఆర్సీబీ 160 పరుగుల టార్గెట్‌ను చివరి బంతికి ఛేదించింది. ఇక్కడ ఏబీ డివిలియర్స్ ఒక కీలక ఇన్నింగ్స్ ఆడటం కారణంగా ఆర్సీబీ గట్టెక్కింది. మిగతా మూడు మ్యాచ్‌లు ఛేజింగ్ చేసినట్లకు విజయం దక్కలేదు.
మంగళవారం ముంబై ఇండియన్స్-కేకేఆర్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఎంతో ఆసక్తిని తలపించింది. ఇక్కడ ముంబై 152 పరుగుల టార్గెట్‌ను కాపాడుకుని పది పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్ తర్వాత టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ తీసుకున్న కేకేఆర్ తప్పిదం చేసిందనే విమర్శలు వచ్చాయి. చెపాక్‌లో ఛేజింగ్ అంత ఈజీ కాని పరిస్థితుల్లో కేకేఆర్ టాస్ గెలిచి ఫీల్డింగ్ వెళ్లడమే హాట్ టాపిక్ అయ్యింది. అదే తప్పిదాన్ని వార్నర్ రిపీట్ చేశాడు.
టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్నాడు. దాంతో ఆర్సీబీ ముందుగా బ్యాటింగ్‌కు దిగి 150 పరుగుల టార్గెట్‌ను ఇచ్చింది. ఇది ఇక్కడ ఈజీ టార్గెట్ కాదని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అదే నిజమైంది. సన్‌రైజర్స్ చేజేతులా ఓటమిని కొనితెచ్చుకుంది. దాంతో వరుసగా రెండో ఓటమిని మూట గట్టుకుంది. ఈ పిచ్‌లో సన్‌రైజర్స్‌కు రెండో మ్యాచ్. కేకేఆర్‌తో సన్‌రైజర్స్ ఆడిన తొలి మ్యాచ్‌లో కూడా గెలుపు అంచుల వరకూ వచ్చి 10 పరుగులతో పరాజయం చెందింది.
అక్కడ కూడా వార్నర్ టాస్ గెలిచి ముందు ఫీల్డింగ్ తీసుకున్నాడు. కేకేఆర్‌తో ఆడిన అనుభవం, ఇదే పిచ్‌పై ఛేజింగ్ చేసిన అదే కేకేఆర్ కట్టడి చేసి ముంబై ఇండియన్స్ విజయం సాధించిన తర్వాత కూడా వార్నర్ టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్నాడంటే ఏ గణాంకాల ప్రకారం ఆ సాహసం చేశాడో అర్థం కాలేదు. సన్‌రైజర్స్ ఇదే వేదికగా ఆడిన గత మ్యాచ్‌లో కూడా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడం ఒక తప్పిదమైతే, ఆ జట్టులో విలియమ్సన్ లేకపోవడమ మరొకతప్పు. నిన్న కూడా అదే తప్పిదం చేసింది సన్‌రైజర్స్. ఇలా తప్పులు మీద తప్పులు చేయడంతో వరుస రెండు మ్యాచ్‌ల్లోనూ పరాజయం చవిచూడాల్సి వచ్చింది.ఇక్కడ ఇంకా సన్‌రైజర్స్ మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. మరి వరుస రెండు ఓటములతో వార్నర్ ఏ రకంగా ముందుకు వెళతాడో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment