మెరుపులాంటి ఫీట్‌లు.. మతిపోయే క్యాచ్‌లు | IPL 2021: Few Best Catches In IPL History | Sakshi
Sakshi News home page

మెరుపులాంటి ఫీట్‌లు.. మతిపోయే క్యాచ్‌లు

Published Sun, Apr 4 2021 6:01 PM | Last Updated on Mon, Apr 5 2021 5:01 PM

IPL 2021: Few Best Catches In IPL History - Sakshi

క్యాచెస్‌ విన్‌ మ్యాచెస్‌.. ఇది అక్షర సత్యం. క్యాచ్‌లు పడితేనే క్రికెట్‌ మ్యాచ్‌లను గెలవలం. క్యాచ్‌లు డ్రాప్‌ చేసిన కారణంగానే వరల్డ్‌కప్‌ లాంటి మెగా ట్రోఫీలను కోల్పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. క్రికెట్‌ మ్యాచ్‌లో క్యాచ్‌లకు  ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు.  మ్యాచ్‌ టర్న్‌ కావడంలో ఫీల్డర్లు అందుకునే అద్భుతమైన క్యాచ్‌లు కీలక పాత్ర పోషిస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు. వరల్డ్‌ క్రికెట్‌లోనే కాదు.. ఐపీఎల్‌ వంటి క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో కూడా ఫీల్డర్లు ఫీల్డింగ్‌ విన్యాసాలతో ఆకట్టుకున్న సందర్భాలు ఎన్నో. బౌండరీల వద్ద స్టన్నింగ్‌ క్యాచ్‌లు, సింగిల్‌ హ్యాండెడ్‌ క్యాచ్‌లు, అమాంతం గాల్లోకి ఎగిరి ఫీల్డర్లు ఒడిసి పట్టుకునే క్యాచ్‌లు ఇలా ఎన్నో ఉన్నాయి.  గత ఐపీఎల్‌ సీజన్‌లో కూడా అద్భుతమైన ఫీల్డింగ్‌ మెరుపుల్ని చూశాం. ఈ సీజన్‌లో కూడా ఆ విన్యాసాల్ని కచ్చితంగా చూస్తాం కూడా. మరి ఐపీఎల్‌-14 సీజన్‌ ఆరంభం కానున్న తరుణంలో ఈ లీగ్‌ చరిత్రలో కొన్ని అత్యుత్తమ క్యాచ్‌లు గురించి ఒకసారి చూద్దాం. 

క్రిస్‌ లిన్‌(కేకేఆర్‌ వర్సెస్‌ ఆర్సీబీ మ్యాచ్‌, 2014)
ఆర్సీబీ-కేకేఆర్‌ జట్ల మధ్య షార్జాలో జరిగిన మ్యాచ్‌ అది. ఆ మ్యాచ్‌లో ఆర్సీబీ విజయానికి 9 పరుగులు కావాలి. క్రీజ్‌లో ఏబీ డివిలియర్స్‌, అల్బీ మోర్కెల్‌ వంటి స్టార్‌ ఆటగాళ్లు ఉన్నారు. ఇది ఆర్సీబీకి ఏ మాత్ర కష్టం కూడా కాదు. చివరి ఓవర్‌ను వినయ్‌ కుమార్‌ అందుకున్నాడు. మొదటి మూడు బంతులకు సింగిల్స్‌ వచ్చాయి. నాల్గో బంతికి ఏబీ స్ట్రైకింగ్‌కు వచ్చాడు. ఆ సమయంలో ఆర్సీబీకి ఆరు పరుగులు అవసరం. ఇక మ్యాచ్‌ ఫినిష్‌ చేయాలనుకున్నాడు ఏబీ. వినయ్‌ కుమార్‌ వేసిన నాల్గో బంతిని భారీ షాట్‌ ఆడాడు. అది గాల్లో బౌండరీ లైన్‌ దాటేస్తే ఆర్సీబి గెలుస్తుంది. కానీ కేకేఆర్‌ ఫీల్డర్‌ క్రిస్‌ లిన్‌ అ అవకాశం ఇవ్వలేదు. బౌండరీ లైన్‌కు కొద్దిగా ముందుగా ఉన్న లిన్‌ దాన్ని బౌండరీ దాటనివ్వలేదు. గాల్లోనే బంతిని అందుకున్నాడు. అదే సమయంలో నియంత్రణను సైతం కోల్పోలేదు. బంతిని క్యాచ్‌గా పట్టి బౌండరీ లైన్‌కు కొన్ని సెంటిమీటర్ల దూరంలో అద్భుతమైన బ్యాలెన్స్‌ చేసుకుంటూ ఆ క్యాచ్‌ను సిక్స్‌ కానివ్వలేదు. ఆ మ్యాచ్‌లో కేకేఆర్‌ రెండు పరుగుల తేడాతో గెలిచింది. క్రిస్‌ లిన్‌ పట్టిన క్యాచ్‌ ఒక అసాధారణమైన క్యాచ్‌గా నిలిచిపోయింది. 

ఏబీ డివిలియర్స్‌(ఆర్సీబీ వర్సెస్‌ ఎస్‌ఆర్‌హెచ్‌, 2018)
ఏబీడీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇతను 360 డిగ్రీల ఆటగాడు. అటు బ్యాటింగ్‌లోనూ ఇటు ఫీల్డింగ్‌లోనూ ఏబీదీ ప్రత్యేకమైన శైలి. ఈ ఆధునిక క్రికెట్‌లో అత్యుత్తుమ అథ్లెట్‌ ఏబీ. ఏబీ తన కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన క్యాచ్‌లు తీసుకున్నాడు. అందులో 2018లో బెంగళూరు వేదికగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో పట్టిన ఒక  క్యాచ్‌ అతన్ని బెస్ట్‌ ఫీల్డర్లలో మరింత ఎత్తుకు తీసుకెళ్లింది.  ఆ మ్యాచ్‌ బెంగళూరు 219 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. ఈ క్రమంలోనే ఎస్‌ఆర్‌హెచ్‌ ధాటిగానే ఇన్నింగ్స్‌ను ఆరంభించింది. అలెక్స్‌ హేల్స్‌ మంచి టచ్‌లో ఉన్న సమయంలో ఏబీ పట్టిన క్యాచ్‌ ఆ మ్యాచ్‌కే హైలైట్‌ కావడమే కాదు.. ఐపీఎల్‌ చరిత్రలోనే బెస్ట్‌ క్యాచ్‌ల్లో ఒకటిగా నిలిచింది. 

మొయిన్‌ అలీ వేసిన ఎనిమిదో ఓవర్‌ చివరి బంతికి హేల్స్‌ మిడ్‌ వికెట్‌ మీదుగా భారీ షాట్‌ ఆడాడు. అది సిక్స్‌ అనుకున్నారంతా. కానీ అక్కడే ఫీల్డింగ్‌ చేస్తున్న ఏబీడీ స్టన్నింగ్‌ క్యాచ్‌తో హేల్స్‌ను పెవిలియన్‌కు పంపాడు. ఆ బంతి ఏబీ పైనుంచి వెళ్లిపోతున్న క్రమంలో కరెక్ట్‌ పొజిషన్‌ తీసుకుని ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి క్యాచ్‌ అందుకున్న తీరు అమోఘం. అదే సమయంలో అంతే కచ్చితత్వంతో నియంత్రణ కోల్పోకుండా బౌండరీ లైన్‌ లోపాలే పడ్డాడు. ఈ క్యాచ్‌ కెప్టెన్‌ కోహ్లితో పాటు ఫ్యాన్స్‌లో కూడా మంచి మజాను తీసుకొచ్చింది. సూపర్‌మ్యాన్‌ను తలపించే ఆ క్యాచ్‌ ఇప్పటికీ అభిమానుల్లో మదిలో మెదులుతూనే ఉంటుంది. 

ట్రెంట్‌ బౌల్ట్‌(ఆర్సీబీ వర్సెస్‌ ఢిల్లీ డేర్‌డెవిల్స్‌, 2018)
2018లో ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌-ఆర్సీబీల మధ్య జరిగిన రెండు లీగ్‌ మ్యాచ్‌ల్లో కూడా ఆర్సీబీనే విజయం సాధించింది. కాగా, ఇరు జట్ల మధ్య బెంగళూరులో జరిగిన తొలి లీగ్‌ మ్యాచ్‌లో మాత్రం ఢిల్లీ ఆటగాడు ట్రెంట్‌ బౌల్ట్‌ క్యాచ్‌ నిజంగానే అద్భుతం. ఏబీ డివిలియర్స్‌-విరాట్‌ కోహ్లిలు భాగస్వామ్యాన్ని నిర్మిస్తున్న క్రమంలో ఢిల్లీకి ఒక మంచి బ్రేక్‌ త్రూ దొరికిన సందర్భం అది. కోహ్లి ఇచ్చిన క్యాచ్‌ను బౌండరీ లైన్‌కు కాస్త ముందు బౌల్ట్‌ అందుకున్న తీరు ఐపీఎల్‌ చరిత్రలో నిలిచిపోయింది. హర్షల్‌ పటేల్‌ బౌలింగ్‌లో ఒక బంతిని లెగ్‌ సైడ్‌ వైపు ఫుల్‌ టాస్‌గా వేయగా, కోహ్లి దాన్ని బౌండరీగా తరలించాలనే భారీ షాట్‌ ఆడాడు. రాకెట్‌ స్పీడ్‌లో ఆ బంతిని కోహ్లి హిట్‌ చేయగా, అంతే స్పీడ్‌లో మిడ్‌ వికెట్‌ బౌండరీ లైన్‌ వద్ద ఉన్న గాల్లోకి ఎగిరి బంతిపై అంచనా తప్పకుండా అందుకున్నాడు. అదే సమయంలో తన నియంత్రణ కోల్పోకుండా బౌండరీ లైన్‌కు కొద్దిగా ముందుకు పడిపోయాడు. అతను బంతిని పట్టుకుని బౌండరీ లైన్‌ తాకాడా అనే అనుమానం వచ్చినా బ్యాలెన్స్‌ చేసుకుని లైన్‌కు ముందే ల్యాండ్‌ అయ్యాడు. ఈ మ్యాజికల్‌ క్యాచ్‌కు అందులోనూ కోహ్లి క్యాచ్‌ కావడంతో ఆర్సీబీ అభిమానులంతా ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారు.  

 


కీరోన్‌ పొలార్డ్‌(ముంబై వర్సెస్‌ సీఎస్‌కే, 2019)
ప్రపంచ అత్యుత్తమ ఫీల్డర్లు కీరోన్‌ పొలార్డ్‌ ఒకడు. క్యాచ్‌ల విషయంలో తనదైన మార్క్‌ చూపిస్తూ అభిమానులకు షాక్‌లు ఇస్తూ ఉంటాడు పొలార్డ్‌. పొలార్డ్‌ పట్టిన అద్భుతమైన క్యాచ్‌ల్లో ఒకటి ఐపీఎల్‌లో కూడా ఉంది. ముంబైలోని వాంఖేడే స్టేడియం వేదికగా సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో పొలార్డ్‌ మెరుపులాంటి క్యాచ్‌ను అందుకున్నాడు. అది కూడా సురేష్‌ రైనా ఇచ్చిన క్యాచ్‌ను సింగిల్‌ హ్యాండ్‌తో అందుకుని ఔరా అనిపించాడు. ముంబై బౌలర్‌ జేసన్‌ బెహ్రెన్‌డార్ఫ్‌ వేసిన షార్ట్‌ పిచ్‌ డెలివరీని డీప్‌ పాయింట్‌ మీదుగా సిక్స్‌ తరలించాలనుకున్నాడు రైనా. ఆ పొజిషన్‌లో బౌండరీ లైన్‌ వద్ద ఉన్న పొలార్డ్‌ మాత్రం అందుకు అవకాశం ఇవ్వలేదు. ఆ బంతిని గాల్గోకి ఎగరకుండా వదిలేస్తే అది సిక్స్‌ వెళ్లడం ఖాయం. కానీ పొలార్డ్‌ మాత్రం బంతి గమనాన్ని కచ్చితంగా అంచనా వేసి గాల్లోకి ఎగిరాడు.  బంతి దగ్గరకు వచ్చే వరకూ అలానే ఉండి ఒక్కసారిగా జంప్‌ తీసుకున్నాడు. అంతే వేగంతో క్యాచ్‌ అందుకున్నాడు. అది క్యాచ్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా నిలవడమే కాకుండా ఆ సీజన్‌లో బెస్ట్‌ క్యాచ్‌ అయ్యింది. 

డేవిడ్‌ హస్సీ(కేకేఆర్‌ వర్సెస్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌ -2010)
ఫిరోజ్‌ షా కోట్ల మైదానంలో కేకేఆర్‌తో జరిగిన ఆ మ్యాచ్‌ ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు కీలకమైనది. ఆ మ్యాచ్‌లో ఢిల్లీ 40 పరుగుల తేడాతో గెలిచింది. ముందుగా బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ నాలుగు వికెట్ల నష్టానికి 177 పరుగులు చేయగా, కేకేఆర్‌ 137 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. కానీ ఆ మ్యాచ్‌లో కేకేఆర్‌ ఆటగాడు హస్పీ పట్టిన క్యాచ్‌ హైలైట్‌. ఢిల్లీ ఆఖరి ఓవర్‌ ఆడుతున్న సమయంలో చార్ల్‌ లాంగ్‌వెల్‌దత్‌ వేసిన ఫుల్‌ టాస్‌ బంతిని కాలింగ్‌వుడ్‌ లాంగాన్‌ షాట్‌ ఆడాడు. అది బౌండరీ దాటడం ఖాయం అనుకున్న సమయంలో హస్సీ మెరుపులాగా బంతిపైకి దూసుకొచ్చాడు. ముందు బంతిని సింగిల్‌ హ్యాండ్‌తో బౌండరీ దాటకుండా ఆపి మెల్లగా బయటకు తోసేశాడు. ఆ తర్వాత బౌండరీ లైన్‌ లోపలికి వెళ్లిన హస్పీ మళ్లీ బయటకొచ్చి క్యాచ్‌ అందుకున్నాడు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement