IPL 2021, CSK vs KKR Today At Dubai International Cricket Stadium: క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్-2021 ఫైనల్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగే టైటిల్ పోరులో చెన్నై సూపర్‌కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ అమీ తుమీ తేల్చుకోనున్నాయి. తొమ్మిదిసార్లు ఫైనల్ చేరిన సీఎస్‌కే నాలుగోసారి కప్ కొట్టాలని భావిస్తుండగా... ప్లే ఆఫ్స్ కూడా చేరుతుందా లేదా అన్న దశ నుంచి టేబుల్ టాపర్‌ను ఓడించి ఫైనల్ చేరిన కేకేఆర్ మూడోసారి చాంపియన్‌గా అవతరించాలని ఉవ్విళ్లూరుతోంది. నేటి మ్యాచ్ ప్రధానంగా చెన్నై బ్యాటింగ్‌కు, కోల్‌కతా బౌలింగ్‌కు మధ్య అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
Courtsey: IPL
అదరగొడుతున్న ఓపెనర్లు...
ఇంకో 23 పరుగులు చేస్తే ఆరెంజ్ క్యాప్... సీఎస్‌కే ఓపెనర్ రుత్‌రాజ్ గైక్వాడ్( ఇప్పటి వరకు 603 పరుగులు) సొంతమవుతుంది. మరో ఓపెనర్ ఫాఫ్ డు ప్లెసిస్ (547), ఆల్‌రౌండర్ జడేజా వంటి కీలక ప్లేయర్లు మెరుగ్గా రాణిస్తుండటం... అన్నింటికీ మించి కెప్టెన్ ధోని వ్యూహాలు... సీఎస్‌కేను ఫేవరెట్‌గా నిలుపుతాయనడంలో సందేహం లేదు. అయితే, రెండో అంచెలో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుని ఫైనల్ దాకా వచ్చిన మోర్గాన్ బృందాన్ని కూడా తక్కువగా అంచనా వేయలేం.
Courtsey: IPL
చెన్నైదే పైచేయి!
ఓపెనర్లు శుభ్‌మన్ గిల్(427), వెంకటేశ్ అయ్యర్(320)ఫాంలో ఉండటం... మిస్టరీ స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి(18), సునిల్ నరైన్(14) రాణిస్తుండటం కేకేఆర్‌కు కలిసి వచ్చే అంశాలు. ఈ సీజన్‌లో చెన్నై- కేకేఆర్ రెండుసార్లు తలపడగా... రెండుసార్లు విజయం ధోని సేననే వరించింది. అబుదాబిలోని జాయేద్ క్రికెట్ స్టేడియం(సెప్టెంబరు 26), ముంబైలోని వాంఖడే స్టేడియంలో(ఏప్రిల్ 21) వరుసగా 2 వికెట్లు, 18 పరుగుల తేడాతో చెన్నై విజయం సాధించింది. ఇక మొత్తంగా క్యాష్ రిచ్ లీగ్‌లో సీఎస్‌కే- కేకేఆర్ 25సార్లు ముఖాముఖి తలపడగా... చెన్నై 16 సార్లు, కోల్‌కతా 8 సార్లు గెలిచింది.
ఇక ఇప్పుడు ఇరు జట్లు తొలిసారిగా దుబాయ్ వేదికగా ఫైనల్‌లో తలపడబోతున్నాయి. మరి అక్కడి పిచ్‌పై టీ20 రికార్డు ఎలా ఉందో పరిశీలిద్దాం!
►స్టేడియం పేరు: దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం
►ఇప్పటి వరకు జరిగిన టీ20 మ్యాచ్‌లు: 105
►తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు సాధించిన విజయాలు: 41
►లక్ష్య ఛేదనకు దిగిన టీం సాధించిన విజయాలు: 63
►మ్యాచ్ టై అయినవి: 1
►నమోదైన అత్యధిక స్కోరు: 219/2- సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్- 2020
►అత‍్యల్ప స్కోరు: 59(లాహోర్ కాలాండర్స్ వర్సెస్ పెషావర్ జల్మీ-2017)
►ఆవరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్: 156
►ఇక ఈ స్టేడియంలో జరిగిన క్వాలిఫైయర్-1 మ్యాచ్‌లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న చెన్నై... ఢిల్లీ క్యాపిటల్స్‌పై 4 వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే.
స్కోర్లు: ఢిల్లీ- 172/5(20 ఓవర్లు)
చెన్నై- 173/6(19.4 ఓవర్లు).
►ఈ నేపథ్యంలో నేటి మ్యాచ్‌లోనూ టాస్ కీలకం కానుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్టేడియం చరిత్ర ప్రకారం... ఒకవేళ ధోని టాస్ గెలిస్తే.. మరోసారి ఫీల్డింగ్ ఎంచుకుంటాడా.. లేదంటే అదృష్టం కేకేఆర్‌ను వరిస్తుందా.. లేదంటే సెంటిమెంట్‌ను తిరగరాస్తూ అద్భుతాలేమైనా జరుగుతాయా లేదా అన్నది చూడాలంటే సాయంత్రం వరకు(7.30 నిమిషాలకు మ్యాచ్ ఆరంభం) వేచి చూడాల్సిందే!
చదవండి: IPL 2021 Final: ‘కెప్టెన్’ డ్రాప్ అయినా ఆశ్చర్యపడనక్కర్లేదు!
Comments
Please login to add a commentAdd a comment