న్యూఢిల్లీ: ఇప్పటికే పలువురు ఆటగాళ్లు ఐపీఎల్-14వ సీజన్‌ను వీడిన సంగతి తెలిసిందే. రవిచంద్రన్ అశ్విన్ (ఢిల్లీ క్యాపిటల్స్), ఆండ్రూ టై, లియామ్ లివింగ్ స్టోన్(రాజస్థాన్ రాయల్స్), ఆడమ్ జంపా, కేన్ రిచర్డ్‌సన్ (ఆర్సీబీ)లు ఐపీఎల్ నుంచి అర్థాంతరంగా తప్పుకున్నారు. వీరు వైదొలగడానికి కారణం కరోనా సంక్షోభమే. ఇప్పుడు వీరి సరసన ఇద్దరు అంపైర్లు చేరారు. భారత్‌కు చెందిన అంపైర్ నితిన్ మీనన్‌తో పాటు ఆస్ట్రేలియాకు చెందిన పాల్ రీఫెల్ కూడా ఐపీఎల్ నుంచి తప్పుకున్నారు.
ఐసీసీ ఎలైట్ ప్యానల్ సభ్యులైన వీరిద్దరూ.. ఐపీఎల్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. మీనన్ తల్లికి, భార్యకు కరోనా పాజిటివ్ రావడంతో వారితో ఉండటం కోసం మీనన్ టోర్నీ నుంచి వైదొలిగారు. ఇక రీఫెల్ మాత్రం ఆస్ట్రేలియా ప్రభుత్వం తీసుకున్న విమానా రాకపోకల నిషేధం కారణంగా స్వదేశం వెళ్లిపోవడానికి సిద్దమయ్యారు. ఈ విషయాన్ని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. ‘ నితిన్‌కు చిన్న కుమారుడు ఉన్నాడు.
తల్లికి భార్యకు కరోనా సోకడంతో ఆ కుమారుడ్ని చూసుకోవడానికి ఐపీఎల్‌ను వీడాల్సి వస్తుంది. ఇక రీఫెల్ భయపడుతున్నారు. ఐపీఎల్ ముగిసిన తర్వాత స్వదేశానికి వెళ్లడానికి విమాన సౌకర్యం ఉండదనే భయంతో ముందుగా వెళ్లిపోతున్నారు. భారత్‌లో చాలామంది స్థానిక అంపైర్లు బ్యాకప్‌గా ఉన్నారు. వారు అంపైరింగ్ సేవల్ని ఉపయోగించుకుంటాం’ అని ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment