ముంబై: ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ ప్రస్తుతం ఐపీఎల్ 14వ సీజన్‌లో సీఎస్‌కేకు ఆడుతున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన మొయిన్ అలీ 132 పరుగులతో పాటు 4 వికెట్లు తీసి ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరుస్తున్నాడు. ముఖ్యంగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కీలక సమమంలో 7 పరుగులిచ్చి 3 వికెట్లు తీసి గేమ్ చేంజర్ అయ్యాడు. అంతేగాక సీఎస్‌కే బ్యాటింగ్ ఆర్డర్‌లో మూడో స్థానంలో వస్తూ పరుగులు చేస్తూ కీలకంగా మారాడు. గతేడాది ఆర్‌సీబీ తరపున ఆడిన మొయిన్ అలీని వేలానికి ముందు రిలీజ్ చేయగా.. సీఎస్‌కే అతని ఆటపై నమ్మకముంచి రూ. 7 కోట్లకు దక్కించుకుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్ అలీపై కీలక వ్యాఖ్యలు చేశాడు.
''ఐపీఎల్‌లో మంచి ప్రదర్శన కనబరుస్తున్న మొయిన్ అలీ ఇంగ్లండ్ జట్టుకు వచ్చేసరికి టీ20ల్లో మాత్రం ఆప్షనల్ ఆటగాడిగా ఉంటాడే తప్ప రెగ్యులర్ సభ్యుడు కాలేడు. ఎవరైనా గాయపడడం లేదా సిరీస్ నుంచి వైదొలిగితేనో అతనికి అవకాశం వస్తుంది. 20 ఏళ్ల కిందట ఆసీస్ జట్టుకు రెగ్యులర్‌గా ఆడడానికి మైక్ హస్సీ, డామియన్ మార్టిన్‌లు ఎంతకాలం ఎదురుచూడాల్సి వచ్చిందో.. అచ్చం అదే పరిస్థితిలో ప్రస్తుతం మొయిన్ అలీ ఉన్నాడు. అతను అద్భుతమైన ఆటగాడే.. కానీ అతని నుంచి మూడు విభాగాల్లో అత్యుత్తమ ప్రదర్శన రావాలని అందరు అనుకుంటున్నారు. ప్రస్తుతం అతను తన కెరీర్ పరంగా టాప్‌గా కొనసాగుతున్నాడు.. త్వరలోనే అతను ఇంగ్లండ్ జట్టులో రెగ్యులర్ సభ్యుడిగా ఉంటాడని ఆశిస్తున్నా'' అంటూ చెప్పుకొచ్చాడు.
చదవండి: ఫోన్ కోసం ఇంత పని చేస్తావా మ్యాక్సీ.. పాపం చహల్
Comments
Please login to add a commentAdd a comment