
CSK Sign Matheesha Pathirana: ఐపీఎల్ 2022 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను వరుస ఓటములతో పాటు గాయాల సమస్య కూడా వేధిస్తుంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో ఐదింటిలో ఓటమిపాలైన డిఫెండింగ్ ఛాంపియన్.. గాయాల కారణంగా ఇప్పటికే ఇద్దరు కీలక ఆటగాళ్లను కోల్పోయింది. తొలుత 14 కోట్ల ఆటగాడు దీపక్ చాహర్ గాయం కారణంగా సీజన్ మొత్తానికి దూరంగా కాగా, తాజాగా 1.9 కోట్ల బౌలర్ ఆడమ్ మిల్నే (న్యూజిలాండ్) కూడా చాహర్ బాటపట్టాడు. ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ గాయపడ్డ ఆటగాళ్ల స్థానాలను భర్తీ చేయాలని నిర్ణయించింది.
సీజన్ తొలి మ్యాచ్‌లో (కేకేఆర్) బౌలింగ్ చేస్తూ గాయపడ్డ మిల్నే స్థానాన్ని శ్రీలంక యువ పేసర్, జూనియర్ మలింగగా పిలువబడే మతీష పతిరనతో భర్తీ చేయాలని డిసైడైంది. ఈ మేరకు మతీషతో రూ. 20 లక్షలకు ఒప్పందం కుదుర్చుకుంది. 19 ఏళ్ల మతీష.. 2020, 2022 అండర్ 19 వరల్డ్ కప్‌లలో లంక జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. దిగ్గజ పేసర్ మలింగ్ బౌలింగ్ యాక్షన్‌తో బౌలింగ్ చేసే మతీష.. శ్రీలంక తరఫున రెండు టీ20లు ఆడాడు. ఇదిలా ఉంటే, సీఎస్‌కే ఇవాళ ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభంకానుంది.
చదవండి: బోణీ విజయం కోసం ముంబై.. రెండో విజయంపై కన్నేసిన చెన్నై