ముంబై: ఐపీఎల్‌లో ప్లే ఆఫ్స్ అవకాశాలు కోల్పోయిన తర్వాత మెరుగ్గా ఆడుతున్న ముంబై ఇండియన్స్ మరో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. ‘సొంతగడ్డ’ వాంఖెడేలో జరిగిన పోరులో ఐదుసార్లు లీగ్ చాంపియన్ ముంబై ఐదు వికెట్ల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌ను చిత్తు చేసింది. తాజా ఫలితంతో నాలుగుసార్లు విజేత చెన్నై కూడా అధికారికంగా ‘ప్లే ఆఫ్స్’కు దూరమైంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 16 ఓవర్లలో 97 పరుగులకే కుప్పకూలింది.
కెప్టెన్ ఎమ్మెస్ ధోని (33 బంతుల్లో 36 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఒక్కడే కాస్త పట్టుదలగా నిలబడగా, మిగతావారంతా చేతులెత్తేశారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ డానియెల్ స్యామ్స్ (3/16) చెన్నైని దెబ్బ తీయగా... కార్తికేయ, మెరిడిత్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం ముంబై 14.5 ఓవర్లలో 5 వికెట్లకు 103 పరుగులు చేసింది. తిలక్ వర్మ (32 బంతుల్లో 34 నాటౌట్; 4 ఫోర్లు), టిమ్ డేవిడ్ (7 బంతుల్లో 16 నాటౌట్; 2 సిక్స్‌లు) ఫినిషింగ్ టచ్ ఇచ్చారు.
టపటపా...
తొలి ఓవర్లో కాన్వే (0), మొయిన్ అలీ (0) వికెట్లను కోల్పోయిన చెన్నై ఆ తర్వాత కోలుకోలేకపోయింది. రాబిన్ ఉతప్ప (1), రుతురాజ్ గైక్వాడ్ (7), అంబటి రాయుడు (10) కూడా వెనుదిరగడంతో పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 32/5కు చేరింది. ఈ దశలో ధోని ఒక ఎండ్‌లో నిలబడి పరుగులు సాధించే ప్రయత్నం చేయగా... శివమ్ దూబే (10), బ్రేవో (12) కూడా విఫలమయ్యారు. అనంతరం ముంబై కూడా కాస్త తడబడింది. ఇషాన్ కిషన్ (6), రోహిత్ శర్మ (18), స్యామ్స్ (1), స్టబ్స్ (0) తక్కువ వ్యవధిలో అవుట్ కావడంతో ముంబై ఇండియన్స్ స్కోరు 33/4కు చేరింది. అయితే తిలక్ వర్మ, హృతిక్ షోకిన్ (18; 2 ఫోర్లు) ఐదో వికెట్‌కు 48 పరుగుల భాగస్వామ్యంతో జట్టును గెలుపుదిశగా నడిపించారు.
కరెంట్ లేదు...డీఆర్‌ఎస్ లేదు
ప్రపంచ క్రికెట్‌లో అత్యంత విలువైన ప్రతిష్టాత్మక టోర్నీ... లీగ్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్ల మధ్య దేశంలో అమిత ప్రాధాన్యత ఉన్న మైదానంలో జరుగుతున్న మ్యాచ్... కానీ మ్యాచ్‌కు ముందస్తు ఏర్పాట్లను బీసీసీఐ చేసుకోవడంలో విఫలమైంది. ముంబై నగరంలో కరెంట్ కోతతో వాంఖెడేలో కూడా అంధకారం ఏర్పడింది. ఫ్లడ్ లైట్లు సరిగా వెలగకపోవడంతో టాస్ కూడా ఆలస్యమైంది. అయితే ఆ తర్వాత కరెంట్ కోత అసలు ఆటనూ ఇబ్బంది పెట్టింది.
విద్యుత్ సమస్య కారణంగా ‘హాక్ ఐ’ టెక్నాలజీని వాడే అవకాశం లేదంటూ చెన్నై ఇన్నింగ్స్‌లో తొలి పది బంతుల పాటు డీఆర్‌ఎస్ పని చేయలేదు. నాలుగో బంతికి కాన్వేను అంపైర్ ఎల్బీగా ప్రకటించగా, రివ్యూ చేసే అవకాశం లేకపోయింది. బంతి గమనాన్ని చూస్తే కచ్చితంగా అతను నాటౌట్‌గా తేలేవాడని అనిపించింది. రెండో ఓవర్ నాలుగో బంతికి కూడా ఉతప్ప దాదాపు ఇదే తరహాలో వెనుదిరిగాడు. అతను కూడా రివ్యూ గురించి ఆలోచించినా ఆ అవకాశం లేదని తేలడంతో విరమించుకున్నాడు. ఆ తర్వాతే మైదానంలో సాధారణ స్థితి నెలకొంది.
ఐపీఎల్‌లో నేడు
బెంగళూరు X పంజాబ్ కింగ్స్
వేదిక: ముంబై, రాత్రి గం. 7:30 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం.
Comments
Please login to add a commentAdd a comment