క్వాలిఫైయర్‌ 2కి బెంగళూరు ... లక్నోపై ‘సూపర్’ విక్టరీ... | IPL 2022: Royal Challengers Bangalore beat Lucknow Super Giants by 14 runs | Sakshi
Sakshi News home page

IPL 2022: క్వాలిఫైయర్‌ 2కి బెంగళూరు ... లక్నోపై ‘సూపర్’ విక్టరీ...

Published Thu, May 26 2022 5:43 AM | Last Updated on Thu, May 26 2022 7:19 AM

IPL 2022: Royal Challengers Bangalore beat Lucknow Super Giants by 14 runs - Sakshi

రజత్‌ పటిదార్‌ బెంగళూరుకు బంగారంలా మారాడు. ఐపీఎల్‌ వేలంలో ఎవరూ తీసుకోకపోగా, రెండు లీగ్‌ మ్యాచ్‌ల తర్వాత బెంగళూరు జట్టు నుంచి పిలుపు వచ్చింది. గాయపడిన లవ్‌నిత్‌ సిసోడియా స్థానంలో అతడిని తీసుకున్న జట్టు లీగ్‌ దశలో ఆరు మ్యాచ్‌లు ఆడించింది. అయితేనేం, నాకౌట్‌ పోరులో అతడిపై నమ్మకముంచి మూడో స్థానంలో పంపించింది. పటిదార్‌ తన కెరీర్‌లోనే చిరస్మరణీయ ఇన్నింగ్స్‌తో అద్భుతం చేశాడు.

విధ్వంసక బ్యాటింగ్‌తో సెంచరీ సాధించి ఆర్‌సీబీకి మరచిపోలేని విజయాన్ని అందించాడు. పటిదార్‌ దూకుడు కారణంగానే భారీ స్కోరు నమోదు చేసిన బెంగళూరు... ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ను చిత్తు చేసి క్వాలిఫయర్‌–2కు అర్హత సాధించింది. ఫైనల్లో స్థానం కోసం శుక్రవారం అహ్మదాబాద్‌లో జరిగే క్వాలిఫయర్‌–2 మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌తో బెంగళూరు తలపడుతుంది.

   
కోల్‌కతా: గత రెండేళ్లు ఐపీఎల్‌లో ‘ఎలిమినేటర్‌’ మ్యాచ్‌లోనే ఓడి భంగపడిన బెంగళూురు ఈసారి ఆ గండాన్ని దాటింది. బుధవారం జరిగిన పోరులో లక్నో సూపర్‌ జెయింట్స్‌ను 14 పరుగుల తేడాతో ఓడించి ముందంజ వేసింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆర్‌సీబీ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ రజత్‌ పటిదార్‌ (54 బంతుల్లో 112 నాటౌట్‌; 12 ఫోర్లు, 7 సిక్స్‌లు) శతకం సాధించగా, దినేశ్‌ కార్తీక్‌ (23 బంతుల్లో 37 నాటౌట్‌; 5 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించాడు. అనంతరం లక్నో 20 ఓవర్లలో 6 వికెట్లకు 193 పరుగులకే పరిమితమై టోర్నీ నుంచి నిష్క్రమించింది. కేఎల్‌ రాహుల్‌ (58 బంతుల్లో 79; 3 ఫోర్లు, 5 సిక్స్‌లు), దీపక్‌ హుడా (26 బంతుల్లో 45; 1 ఫోర్, 4 సిక్స్‌లు) రాణించారు.  

మెరుపు బ్యాటింగ్‌...
తొలి ఓవర్లోనే డుప్లెసిస్‌ (0) అవుట్‌తో బెంగళూరు ఇన్నింగ్స్‌ పేలవంగా ప్రారంభమైంది. విరాట్‌ కోహ్లి (24 బంతుల్లో 25; 2 ఫోర్లు) ఆశించినంత వేగంగా ఆడలేకపోయాడు. అయితే ధాటిగా బ్యాటింగ్‌ మొదలుపెట్టిన పటిదార్‌... కృనాల్‌ ఓవర్లో వరుసగా 4, 4, 6, 4 బాదడంతో పవర్‌ప్లే ముగిసేసరికి ఆర్‌సీబీ 52 పరుగులు చేసింది. మ్యాక్స్‌వెల్‌ (9), లోమ్రోర్‌ (14) విఫలం కావడంతో స్కోరు 115/4కు చేరింది. ఈ దశలో పటిదార్‌ తుఫాన్‌ బ్యాటింగ్‌తో ఆటను ఒక్కసారిగా మార్చేశాడు.

28 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న అతను చమీరా ఓవర్లో 3 ఓవర్లో తన జోరును కొనసాగించాడు. ఆపై రవి బిష్ణోయ్‌ ఓవర్లో అతను పండగ చేసుకున్నాడు. ఈ ఓవర్లో వరుసగా ఐదు బంతుల్లో అతను 6, 4, 6, 4, 6తో చెలరేగాడు. మరో ఎండ్‌లో అవేశ్‌ ఖాన్‌ ఓవర్లో 3 ఫోర్లతో కార్తీక్‌ కూడా దూకుడు ప్రదర్శించాడు. మొహసిన్‌ ఓవర్లో సిక్సర్‌తో 49 బంతుల్లోనే పటిదార్‌ సెంచరీ పూర్తయింది. ఆ తర్వాత చమీరా ఓవర్లో అతను, కార్తీక్‌ కలిపి 2 ఫోర్లు, 2 సిక్స్‌లు బాదారు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 41 బంతుల్లోనే అభేద్యంగా 92 పరుగులు జోడించారు.  

రాహుల్‌ రాణించినా...
భారీ ఛేదనలో డికాక్‌ (6) మొదటి ఓవర్లోనే అవుట్‌ కావడంతో లక్నో ఇన్నింగ్స్‌ ఇబ్బందిగా మొదలైంది. మనన్‌ వోహ్రా (19) కూడా ఎక్కువసేపు నిలవలేదు. సిరాజ్‌ ఓవర్లో 4, 6, 6 కొట్టి రాహుల్‌ జోరుగా ఆడే ప్రయత్నం చేయగా, హుడా కూడా ధాటిని ప్రదర్శించాడు. అయినా సరే ఆర్‌సీబీ చక్కటి బౌలింగ్‌కు వేగంగా పరుగులు రాలేదు. 13 ఓవర్లు ముగిసేసరికి స్కోరు 109 పరుగులు మాత్రమే.

7 ఓవర్లలో 99 పరుగులు చేయాల్సిన స్థితిలో లక్నో దూకుడును ప్రదర్శించింది. హాజల్‌వుడ్, హసరంగ ఓవర్లలో రెండేసి సిక్సర్లు వచ్చాయి. అయితే హుడా అవుట్‌ కావడంతో గెలిపించాల్సిన భారం రాహుల్‌పై పడింది. హసరంగ ఓవర్లో లక్నో 14 పరుగులు రాబట్టింది. విజయానికి 3 ఓవర్లలో 41 పరుగులు చేయాల్సి ఉండగా లక్నోవైపు ఆట మొగ్గినా... చివరకు ఆర్‌సీబీదే పైచేయి అయింది.

ఆ క్యాచ్‌ పట్టి ఉంటే...
పటిదార్‌కు కోలుకునే అవకాశం ఇచ్చిన లక్నో భారీ మూల్యం చెల్లించుకుంది. బిష్ణోయ్‌ బౌలింగ్‌లో అతను ఇచ్చిన సునాయాస క్యాచ్‌ను హుడా వదిలేశాడు. ఆ సమయంలో పటిదార్‌ స్కోరు 72 పరుగులు... ఆ తర్వాత అతను మరింత భీకరంగా ఆడి 13 బంతుల్లోనే 40 పరుగులు బాదాడు.

స్కోరు వివరాలు
రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఇన్నింగ్స్‌: కోహ్లి (సి) మొహసిన్‌ (బి) అవేశ్‌ 25; డుప్లెసిస్‌ (సి) డికాక్‌ (బి) మొహసిన్‌ 0; పటిదార్‌ (నాటౌట్‌) 112; మ్యాక్స్‌వెల్‌ (సి) లూయిస్‌ (బి) కృనాల్‌ 9; లోమ్రోర్‌ (సి) రాహుల్‌ (బి) బిష్ణోయ్‌ 14; కార్తీక్‌ (నాటౌట్‌) 37; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 207.
వికెట్ల పతనం: 1–4, 2–70, 3–86, 4–115.
బౌలింగ్‌: మొహసిన్‌ 4–0–25–1, చమీరా 4–0–54–0, కృనాల్‌ 4–0–39–1, అవేశ్‌ 4–0–44–1, బిష్ణోయ్‌ 4–0–45–1.  

లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఇన్నింగ్స్‌: డికాక్‌ (సి) డుప్లెసిస్‌ (బి) సిరాజ్‌ 6; రాహుల్‌ (సి) షహబాజ్‌ (బి) హాజల్‌వుడ్‌ 79; వోహ్రా (సి) షహబాజ్‌ (బి) హాజల్‌వుడ్‌ 19; హుడా (బి) హసరంగ 45; స్టొయినిస్‌ (సి) పటిదార్‌ (బి) హర్షల్‌ 9; లూయిస్‌ (నాటౌట్‌) 2; కృనాల్‌ (సి అండ్‌ బి) హాజల్‌వుడ్‌ 0; చమీరా (నాటౌట్‌) 11; ఎక్స్‌ట్రాలు 22; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 193. వికెట్ల పతనం: 1–8, 2–41, 3–137, 4–173, 5–180, 6–180.
బౌలింగ్‌: సిరాజ్‌ 4–0–41–1, హాజల్‌వుడ్‌ 4–0–43–3, షహబాజ్‌ 4–0–35–0, హసరంగ 4–0–42–1, హర్షల్‌ 4–0–25–1.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement