photo credit: IPL Twitter
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ బౌలర్లలో ఒకడైన సందీప్ శర్మ, నిన్న (ఏప్రిల్ 12) చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా చాలా రోజుల తర్వాత మళ్లీ వార్తల్లో నిలిచాడు. ఐపీఎల్ 2023 వేలంలో అమ్ముడుపోని సందీప్‌ను రాజస్థాన్ రాయల్స్ గాయపడిన ప్రసిద్ధ్ కృష్ణకు రీప్లేస్‌మెంట్‌గా ఎంచుకుంది. సీఎస్‌కేతో నిన్న జరిగిన మ్యాచ్‌లో అనూహ్యంగా తుది జట్టులోకి వచ్చిన సందీప్, అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు.
గతంలో చాలా సందర్భాల్లో వేర్వేరు ఫ్రాంచైజీలకు తన టాలెంట్‌తో అద్భుత విజయాలనందించిన సందీప్.. నిన్న సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో చివరి ఓవర్ అద్భుతంగా బౌల్ చేసి ప్రత్యర్ధిని గెలవనీయకుండా చేశాడు. 176 పరుగుల లక్ష్య ఛేదనలో సీఎస్‌కే ఆఖరి ఓవర్‌లో 21 పరుగులు చేయాల్సి రాగా.. సందీప్ తొలి రెండు బంతులను వైడ్‌లుగా, ఆతర్వాత వరుసగా 2 సిక్సర్లు సమర్పించకుని తన జట్టు ఓటమికి కారకుడయ్యేలా కనిపించాడు. అయితే ఈ బ్రిలియంట్ బౌలర్ చివరి 3 బంతులను అద్భుతంగా బౌల్ చేసి క్రీజ్‌లో ఉన్న అరివీర భయంకరులైన ధోని, జడేజాలను కట్టడి చేశాడు.
చెన్నై గెలుపుకు 3 బంతుల్లో 7 పరుగులు అవసరం కాగా.. సందీప్ తన అనుభవాన్నంతా రంగరించి, అద్భుతమైన యార్కర్ లెంగ్త్ బంతులను సంధించాడు. అప్పటికే మాంచి ఊపు మీద ఉన్న ధోని, జడేజాలను నిలువరించడం సందీప్‌కు కత్తిమీద సామే అయినప్పటికీ, తన బౌలింగ్ ప్రతిభతో ఎలాగోలా మేనేజ్ చేశాడు. ఫలితంగా రాజస్థాన్ 3 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో సందీప్ ఒక్క రాత్రిలో తాను కోల్పోయిన స్టార్‌డమ్‌నంతా తిరిగి తెచ్చుకున్నాడు. ఫ్యాన్స్ సందీప్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
చివరి బంతికి 6 పరుగులు కావాల్సిన తరుణంలో అప్పటికే జోరుమీదున్న ధోనిని అద్భుతంగా కట్టడి చేశాడంటూ అభినందిస్తున్నారు. కెప్టెన్ సంజూ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా మ్యాచ్‌ను కాపాడాడంటూ కొనియాడుతున్నారు. ఇలాంటి బౌలర్ 2023 వేలంలో అమ్ముడుపోకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించిదంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా, ఐపీఎల్‌లో 2013 నుంచి వివిధ ఫ్రాంచైజీల తరఫున 106 మ్యాచ్‌లు ఆడి 116 వికెట్లు పడగొట్టిన సందీప్‌ను ఈ ఏడాది వేలంలో ఏ జట్టు కొనుగోలు చేయని విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment