గంభీర్- కోహ్లి (PC: Twitter/LSG Twitter)
Gautam Gambhir Hugs Virat Kohli Photo Viral: హైడ్రామాలు.. ఓవైపు పట్టరాని సంతోషంతో గెంతులు.. మరోవైపు దుఃఖాన్ని ఆపుకోలేక వెక్కి వెక్కి ఏడ్చిన అభిమానులు.. దాచుకోలేని భావోద్వేగాలు.. ఆటలో.. ముఖ్యంగా టీ20 లాంటి పొట్టి ఫార్మాట్ క్రికెట్‌లో.. ఆఖరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో ఇలాంటి దృశ్యాలు ఆవిష్కృతమవడం సహజం.
ఐపీఎల్-2023లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు- లక్నో సూపర్ జెయింట్స్ మధ్య సోమవారం మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. హోరాహోరీగా సాగిన ఈ పోరులో చివరి బంతికి ఫలితం వచ్చింది. లక్నో సూపర్ జెయింట్స్ వికెట్ తేడాతో ఆర్సీబీని ఓడించింది.
కోహ్లి, డుప్లెసిస్ అదరగొట్టారు
బెంగళూరు వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 పరుగులు సాధించింది. ఆర్సీబీకి ఓపెనర్లు కోహ్లి, డుప్లెసిస్ ఘనమైన ఆరంభాన్ని అందించారు. ఈ భాగస్వామ్యంలో ముందుగా కోహ్లి చెలరేగిపోయాడు.
అవేశ్ ఖాన్ తొలి రెండు ఓవర్లలో 3 ఫోర్లు, 1 సిక్స్ కొట్టిన కోహ్లి, వుడ్ ఓవర్లో వరుసగా 4, 6 బాదాడు. పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 56 పరుగులకు చేరగా, 35 బంతుల్లో కోహ్లి అర్ధసెంచరీ పూర్తయింది. ఈ క్రమంలో మరో భారీ షాట్‌కు ప్రయత్నించి మిశ్రా బౌలింగ్‌లో కోహ్లి అవుట్ కావడంతో తొలి వికెట్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది.
ఆ తర్వాత వచ్చిన మ్యాక్స్‌వెల్ కూడా చాలా కాలం తర్వాత తనదైన శైలిలో దూకుడు ప్రదర్శించగా, మరో ఎండ్‌లో డుప్లెసిస్ కూడా ధాటిని పెంచాడు. రవి బిష్ణోయ్ ఓవర్లో రెండు భారీ సిక్స్‌లు కొట్టిన ఆర్సీబీ కెప్టెన్ 35 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.
అనంతరం జోరును కొనసాగిస్తూ ఉనాద్కట్ ఓవర్లో డుప్లెసిస్ 2 సిక్స్‌లు ఒక ఫోర్ కొట్టగా, ఈ ఓవర్లో మొత్తం 23 పరుగులు వచ్చాయి. ఆపై అవేశ్ ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లతో మ్యాక్స్‌వెల్ పండుగ చేసుకున్నాడు. 24 బంతుల్లోనే అతని అర్ధ సెంచరీ కూడా పూర్తయింది. బెంగళూరు చివరి 5 ఓవర్లలో 75 పరుగులు చేయగా...జట్టు ఇన్నింగ్స్‌లో మొత్తం 12 ఫోర్లు, 15 సిక్సర్లు ఉన్నాయి.
రాహుల్ విఫలం...
లక్నో ఛేదన పేలవంగా ప్రారంభించింది. తొలి ఓవర్లోనే మేయర్స్ (0)ను సిరాజ్ బౌల్డ్ చేయగా, పార్నెల్ ఒకే ఓవర్లో దీపక్ హుడా (9), కృనాల్ పాండ్యా (0)లను వెనక్కి పంపాడు. కెప్టెన్ కేఎల్ రాహుల్ (20 బంతుల్లో 18; 1 ఫోర్) కూడా ప్రభావం చూపలేకపోయాడు. మరో ఎండ్‌లో స్టొయినిస్ మెరుపు బ్యాటింగ్ సూపర్ జెయింట్స్ శిబిరంలో కాస్త ఆశలు రేపింది.
ఓడిపోతామనుకున్న సమయంలో
హర్షల్ ఓవర్లో వరుస బంతుల్లో 6, 4, 4 కొట్టిన స్టొయినిస్, కరణ్ శర్మ వేసిన తర్వాతి ఓవర్లో సిక్స్, రెండు ఫోర్లు బాదాడు. ఆపై షహబాజ్ ఓవర్లోనూ రెండు భారీ సిక్సర్లు కొట్టి 25 బంతుల్లోనే స్టొయినిస్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే స్టొయినిస్‌తో పాటు రాహుల్ నాలుగు బంతుల వ్యవధిలో అవుట్ కావడంతో లక్నో గెలుపు అవకాశాలు క్షీణించాయి.
కానీ ఆఖర్లో ఒకే ఒక్క పరుగుతో..
అయితే పూరన్ అద్భుత ప్రదర్శన జట్టును విజయానికి చేరువగా తెచ్చింది. కరణ్ ఓవర్లో 2 సిక్స్‌లు కొట్టిన పూరన్, హర్షల్ ఓవర్లో 2 సిక్స్‌లు, ఫోర్ కొట్టాడు. పార్నెల్ ఓవర్లోనూ 2 ఫోర్లు, 6 బాదిన అతను 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీని చేరుకున్నాడు. గెలుపు కోసం లక్నో 19 బంతుల్లో 24 పరుగులు చేయాల్సిన దశలో నిష్క్రమించడం చివర్లో తీవ్ర ఉత్కంఠకు కారణమైంది. ఆఖరి బంతికి బై రూపంలో పరుగు రావడంతో లక్నో విజయతీరాలకు చేరింది.
గంభీర్ చర్య వైరల్.. పెద్ద ఎత్తున ట్రోలింగ్
లక్నోకు ఆర్సీబీపై ఇదే తొలి విజయం కావడంతో ఆ జట్టు సంతోషాల్లో మునిగిపోయింది. క్రీజులో ఉన్న ఆవేశ్ ఖాన్ హెల్మెట్ నేలకేసి కొట్టి మరీ సెలబ్రేట్ చేసుకోగా.. ఆర్సీబీ ఆటగాళ్లతో కరచాలనం చేసిన అనంతరం లక్నో మెంటార్ గౌతం గంభీర్ ఆర్సీబీ ఫ్యాన్స్‌ను నోరు మూయాలన్నట్లు సైగ చేశాడు.
దీంతో అతడిపై విమర్శలు గుప్పిస్తూ ఆర్సీబీ ఫ్యాన్స్ ట్రోల్ చేశారు. తదుపరి మ్యాచ్‌లో కోహ్లి మీకు సరైన సమాధానం ఇస్తాడంటూ కామెంట్లు చేశారు. అయితే, ఇందుకు కౌంటర్ అన్నట్లుగా లక్నో సూపర్ జెయింట్స్ ఓ అద్భుతమైన ఫొటోను షేర్ చేసింది.
కోహ్లిని హగ్ చేసుకున్న గంభీర్
‘‘ఇది ఐపీఎల్ యార్.. ఇక్కడ కేవలం ప్రేమానురాగాలకే తావుంది’’ అంటూ కోహ్లిని గంభీర్ ఆత్మీయంగా హత్తుకున్న ఫొటోను షేర్ చేసింది. వారిద్దరు ముచ్చటించుకుంటున్న దృశ్యం పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
ఈ ఫొటోపై స్పందిస్తున్న క్రికెట్ ఫ్యాన్స్ టీమిండియాకు దొరికిన ఇద్దరు ఆణిముత్యాల్లాంటి బ్యాటర్లు, దిగ్గజ ఆటగాళ్లు అంటూ కొనియాడుతున్నారు. ఆటలో గెలుపోటములు సహజమని, ఆటగాళ్ల మధ్య స్నేహం ఎప్పటికీ అలాగే ఉండిపోతుందంటూ కామెంట్లు చేస్తున్నారు.
చదవండి: IPL 2023: ఓవరాక్షన్‌కు తప్పదు భారీ మూల్యం! ‘ఆవేశ్’ ఖాన్‌కు ఊహించని షాక్!
అట్లుంటది ఆర్సీబీ గ్రహచారం.. ఎంత చేసినా అంతే, చెత్త రికార్డు
𝗪𝗛𝗔𝗧. 𝗔. 𝗚𝗔𝗠𝗘 🤯🤯🤯@LucknowIPL pull off a last-ball win!
— IndianPremierLeague (@IPL) April 10, 2023
A roller-coaster of emotions in Bengaluru 🔥🔥
Follow the match ▶️ https://t.co/76LlGgKZaq#TATAIPL | #RCBvLSG pic.twitter.com/96XwaYaOqT
Ye IPL hai mere yaar, bas ishq mohabbat pyaar 💙❤️@GautamGambhir | @imVkohli | #RCBvLSG | #IPL2023 | #LucknowSuperGiants | #LSG | #GazabAndaz pic.twitter.com/Kqnwbh5ICz
— Lucknow Super Giants (@LucknowIPL) April 10, 2023
Comments
Please login to add a commentAdd a comment