IPL 2023: SRH Markram Confident On Death Bowlers To Negate KKR Batting Firepower - Sakshi
Sakshi News home page

Aiden Markram: డెత్‌ ఓవర్ల స్పెషలిస్టులు ఉన్నారు.. మాకేం భయం లేదు: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌

Published Fri, Apr 14 2023 1:28 PM | Last Updated on Fri, Apr 14 2023 2:46 PM

IPL 2023 SRH Markram Confident On Death Bowlers To Negate KKR Batting Firepower - Sakshi

సన్‌రైజర్స్‌ (PC: IPL)

IPL 2023- Kolkata Knight Riders vs Sunrisers Hyderabad: ‘‘శార్దూల్‌ ఠాకూర్‌, రింకూ సింగ్‌ కేకేఆర్‌కు పూర్తి న్యాయం చేస్తున్నారు. కీలక సమయాల్లో అద్భుతంగా రాణించారు. నిజానికి కేకేఆర్‌ దూకుడైన ఆటతో ముందుకు సాగుతోంది. సమిష్టిగా రాణిస్తే వారిని తట్టుకోవడం కష్టమే. ప్రతి ఒక్కరికి తమ రోజంటూ ఒకటి ఉంటుంది.

నిజానికి కేకేఆర్‌ రూపంలో మాకు భారీ ముప్పు ఎదురుకాబోతుంది. అయితే, మా బలాలు ఏమిటో మాకు తెలుసు. మా ప్రణాళికలు పక్కాగా అమలు చేస్తే గనుక అనుకున్న ఫలితాలను రాబట్టగలం. శార్దూల్‌, రింకూలు అద్భుతంగా ఫినిషింగ్‌ చేస్తున్నారు.

అయితే, మా బౌలర్లపై మాకు పూర్తి నమ్మకం ఉంది. ముఖ్యంగా డెత్‌ ఓవర్లలో మా వాళ్లు అద్భుతంగా బౌలింగ్‌ చేస్తారు. ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేయగలరు’’ అని సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్‌ ఎయిడెన్‌ మార్కరమ్‌ అన్నాడు.

వరుస ఓటములు తర్వాత
కాగా ఐపీఎల్‌-2023లో ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌లలో మూడింట ఒకటి మాత్రమే గెలిచింది ఎస్‌ఆర్‌హెచ్‌. సొంతమైదానంలో రాజస్తాన్‌ రాయల్స్‌తో తమ ఆరంభ మ్యాచ్‌లో రెగ్యులర్‌ కెప్టెన్‌ మార్కరమ్‌ దూరం కాగా.. స్టార్‌ పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ సారథ్యం వహించాడు.

ఈ మ్యాచ్‌లో భారీ తేడాతో ఓడి పరాజయంతో పదహారో ఎడిషన్‌ను ఆరంభించింది. ఇక రెండో మ్యాచ్‌కు మార్కరమ్‌ అందుబాటులోకి రాగా లక్నో సూపర్‌ జెయింట్స్‌లో చేతిలో 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. తర్వాత.. ఉప్పల్‌లో పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో గెలుపొంది.. ఎట్టకేలకు తొలి విజయం నమోదు చేసింది.

కేకేఆర్‌తో మ్యాచ్‌
ఈ క్రమంలో ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో సన్‌రైజర్స్‌ శుక్రవారం తమ నాలుగో మ్యాచ్‌ ఆడనుంది. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన కెప్టెన్‌ మార్కరమ్‌.. తమ బౌలర్లపై నమ్మకం ఉందంటూ ధీమా వ్యక్తం చేశాడు. కేకేఆర్‌కు గత రెండు మ్యాచ్‌లలో విజయాలు అందించిన శార్దూల్‌ ఠాకూర్‌, రింకూ సింగ్‌లను చూసి తామేమీ బెదిరిపోవడం లేదని.. వాళ్లను కట్టడి చేసే వ్యూహాలు రచించామని పేర్కొన్నాడు. 

ముఖాముఖి పోరులో మాత్రం
కేకేఆర్‌తో ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌లలో సన్‌రైజర్స్‌ కేవలం 8 మ్యాచ్‌లలో మాత్రమే గెలుపొందింది. మిగిలిన 15 సార్లు విజయం కేకేఆర్‌నే వరించింది.

ఇక ఈడెన్‌ గార్డెన్స్‌లో సైతం కోల్‌కతాదే పైచేయి. సొంతమైదానంలో ఎస్‌ఆర్‌హెచ్‌తో ఆడిన ఎనిమిది మ్యాచ్‌లలో కేకేఆర్‌ ఆరింట గెలుపొందింది. ఇక 2020 తర్వాత సన్‌రైజర్స్‌ కేవలం ఇక్కడ ఒక మ్యాచ్‌ మాత్రమే గెలిచింది.

మీకు తెలుసా?
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బ్యాటర్‌ రాహుల్‌ త్రిపాఠి ఇంత వరకు ఒక్కసారి కూడా సునిల్‌ నరైన్‌ బౌలింగ్‌లో అవుట్‌ కాలేదు. నరైన్‌ బౌలింగ్‌లో త్రిపాఠి 150కి పైగా స్ట్రైక్‌రేటుతో ఆధిపత్యం కొనసాగిస్తున్నాడు. ఇక మార్కరమ్‌ కేకేఆర్‌తో చివరి మ్యాచ్‌లో వరుణ్‌ చక్రవర్తి బౌలింగ్‌లో 20 బంతుల్లో 40 పరుగులు రాబట్టాడు.

సమిష్టిగా పోరాడితేనే
సన్‌రైజర్స్‌ పేస్‌ దళానికి నాయకుడు టీమిండియా వెటరన్‌ పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌. అతడితో పాటు ప్రొటిస్‌ ఫాస్ట్‌బౌలర్‌ మార్కో జాన్సెన్‌, ఉమ్రాన్‌ మాలిక్‌, నటరాజన్‌ ఉన్నారు.

ఇక స్పిన్‌ విభాగంలో ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌, గత మ్యాచ్‌ హీరో మయాంక్‌ మార్కండే మరోసారి రాణించాలని ఎస్‌ఆర్‌హెచ్‌ కోరుకుంటోంది. తుది జట్టులో బౌలింగ్‌ విభాగంలో మార్కండే, జాన్సెన్‌, భువీ, ఉమ్రాన్‌ మాలిక్‌కు కచ్చితంగా చోటు దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి.

ఇదిలా ఉంటే బ్యాటింగ్‌ విభాగంలో టాపార్డర్‌ రాణిస్తేనే కోల్‌కతాను నిలువరించడం సన్‌రైజర్స్‌కు సాధ్యమవుతుంది. 

కేకేఆర్‌తో మ్యాచ్‌ సన్‌రైజర్స్‌ తుది జట్టు అంచనా
మయాంక్‌ అగర్వాల్‌, హ్యారీ బ్రూక్‌, రాహుల్‌ త్రిపాఠి, ఎయిడెన్‌ మార్కరమ్‌(కెప్టెన్‌), హెన్రిచ్‌ క్లాసెన్‌(వికెట్‌ కీపర్‌), అబ్దుల్‌ సమద్‌, వాషింగ్టన్‌ సుందర్‌, మయాంక్‌ మార్కండే, మార్కో జాన్సెన్‌, భువనేశ్వర్‌ కుమార్‌, ఉమ్రాన్‌ మాలిక్‌.

చదవండి: ఒకప్పుడు పర్పుల్‌ క్యాప్‌ విన్నర్‌.. తర్వాత నెట్‌బౌలర్‌! 6.5 కోట్ల నుంచి 50 లక్షల ధరకు.. 
దుమ్ము రేపుతున్నాడు.. సన్‌రైజర్స్‌ వదిలేసి పెద్ద తప్పు చేసింది! ఎవరంటే? 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement