సన్‌రైజర్స్ ఫాస్ట్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ (PC: IPL)
IPL 2023 MI vs SRH: ఐపీఎల్-2023లో ప్లే ఆఫ్స్ చేరుకోవాలంటే చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది. ముంబైలోని వాంఖడే వేదికగా ఆదివారం ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. ఇప్పటి వరకు ఆడిన 13 మ్యాచ్‌లలో తొమ్మిదింట ఓడిన రైజర్స్.. ఈ మ్యాచ్‌లో గెలిచినా పెద్దగా ఒరిగేమీ లేదు.
అలా అయితే ముంబైకి చేదు అనుభవం తప్పదు
మహా అయితే, ఈ విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను వెనక్కినెట్టి పట్టికలో తొమ్మిదో స్థానానికి చేరుకుంటుంది. గెలుపుతో సీజన్‌ను ముగించామనే సంతృప్తితో నిష్క్రమిస్తుంది. అయితే, ఇప్పటి వరకు పేలవ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకున్న రైజర్స్ ఈ మ్యాచ్‌లో గనుక రైజ్ అయితే, ముంబైకి చేదు అనుభవం తప్పదు.
కానీ.. పటిష్టమైన బ్యాటింగ్ ఆర్డర్ కలిగిన ముంబైని ఓడించడం రైజర్స్‌కు అంత సులువేమీ కాదు. ముఖ్యంగా సొంతమైదానంలో ఈ మ్యాచ్ జరగడం ముంబైకి అత్యంత సానుకూలాంశం. ఇక ముఖాముఖి పోరులోనూ సన్‌రైజర్స్‌పై ముంబైదే పైచేయి.
ముంబైదే పైచేయి
ఇప్పటి వరకు ఇరు జట్లు 20సార్లు తలపడగా రోహిత్ సేన 11 సార్లు.. ఎస్‌ఆర్‌హెచ్ 9 సార్లు గెలిచింది. గత ఆరు మ్యాచ్‌లలో నాలుగింట ముంబైనే విజయం వరించింది. దీంతో ముంబై ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతుండగా.. గత మూడు మ్యాచ్‌లలో ఓడిన రైజర్స్ విజయంతో సీజన్‌ను ముగించాలని ఆరాటపడుతోంది.
ఇక ఈ మ్యాచ్‌లో గెలుపొందితే రోహిత్ సేన ప్లే ఆఫ్స్ చేరనుంది. ఒకవేళ ఓడితే ఆర్సీబీకి మార్గం సుగమమవుతుంది. కాగా ఆదివారం మధ్యాహ్నం (3:30) ముంబై- రైజర్స్ మ్యాచ్ జరుగనుండగా.. రాత్రి 7. 30 గంటలకు ఆర్సీబీ- గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్ ఆడనుంది.
పోటీలో ముంబై, ఆర్సీబీ.. ఆశల పల్లకిలో రాజస్తాన్
ఇదిలా ఉంటే.. ఈ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ సహా చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టాయి. నాలుగో స్థానం కోసం ముంబై,ఆర్సీబీ రేసులో ఉన్నాయి. లీగ్ దశలో తమ ఆఖరి మ్యాచ్‌లలో ఈ రెండూ గనుక ఓడితే రాజస్తాన్‌కు ప్లే ఆఫ్ అవకాశాలు ఉంటాయి.
ఇదిలా ఉంటే.. రైజర్స్‌తో మ్యాచ్‌లో హైదరాబాదీ బ్యాటర్ తిలక్ వర్మ ముంబై తుది జట్టులో చోటు దక్కించుకునే ఛాన్స్ ఉంది. మరోవైపు.. బెంచ్ మీద ఉన్నవాళ్లకు ఛాన్స్ ఇస్తామంటూ రైజర్స్ కెప్టెన్ మార్కరమ్ చెప్పిన నేపథ్యంలో బౌలర్ ఉమ్రాన్ మాలిక్‌కు అవకాశం దక్కొచ్చు.
ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్లు(అంచనా)
ముంబై:
ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), రోహిత్ శర్మ(కెప్టెన్), కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, నేహాల్ వధేరా/తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, క్రిస్ జోర్డాన్, విష్ణు వినోద్, పీయూష్ చావ్లా, జాసన్ బెహ్రెన్ డార్ఫ్, కుమార్ కార్తికేయ
సన్‌రైజర్స్
అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్కరమ్(కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), హ్యారీ బ్రూక్, గ్లెన్ ఫిలిప్స్, అబ్దుల్ సమద్, కార్తిక్ త్యాగి, ఉమ్రాన్ మాలిక్, భువనేశ్వర్ కుమార్, నితీష్ రెడ్డి.
చదవండి: సంచలన ఇన్నింగ్స్.. రింకూతో గంభీర్ ముచ్చట..! ట్వీట్ వైరల్
Comments
Please login to add a commentAdd a comment