Phot Credit: IPL Twitter
ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో విధ్వంసకర వీరులతో నిండి, లోతైన బ్యాటింగ్ లైనప్ కలిగిన జట్టు ఏది అంటే..? నిస్సంకోచంగా కేకేఆర్ పేరే చెప్పాలి. ఆ జట్టులో తొమ్మిదో నంబర్ ఆటగాడి వరకు అందరూ మెరుపులు మెరిపించగల సమర్ధులే. టాపార్డర్, మిడిలార్డర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరి ఊచకోత ఏ రేంజ్‌లో ఉంటందో ఇదివరకే చూశాం. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో భారీ లక్ష్య ఛేదనలో (205) ఐదో నంబర్ ఆటగాడిగా బరిలోకి దిగిన రింకూ సింగ్.. చివరి 5 బంతుల్లో 5 సిక్సర్లు బాది తన జట్టుకు చిరస్మరణీయ విజయాన్నందించిన వైనాన్ని క్రికెట్ ప్రపంచం ఎప్పటికీ మరచిపోలేదు.
ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వన్‌డౌన్‌లో (ఇంపాక్ట్ ప్లేయర్‌గా) బరిలోకి దిగిన వెంకటేశ్ అయ్యర్ (51 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్సర్లతో 104).. సిక్సర్ల సునామీ సృష్టించి, 15 ఏళ్ల తర్వాత కేకేఆర్ తరఫున రెండో సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. అంతకుముందు ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో ఏడో నంబర్ ఆటగాడిగా బరిలోకి దిగిన శార్దూల్ ఠాకూర్.. పూనకం వచ్చినట్లు ఊగిపోగి ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడి, జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. రింకూ సింగ్ గురించి చెప్పాల్సి వస్తే.. ఈ యువ ఆటగాడు మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చి దాదాపు ప్రతి మ్యాచ్‌లో విలయం సృష్టిస్తున్నాడు.
కెప్టెన్ నితీశ్ రాణా సైతం అప్పర్ మిడిలార్డర్‌లో అడపాదడపా మెరుపులు మెరిపిస్తున్నాడు. లేట్‌గా జట్టులో చేరిన జేసన్ రాయ్.. తాజాగా సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో అంతకుముందు ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడ్డాడు. సీఎస్‌కేతో మ్యాచ్‌లో ఐదో నంబర్ ఆటగాడిగా బరిలోకి దిగిన జేసన్.. కేవలం 26 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో మెరుపు అర్ధసెంచరీ చేశాడు. వీరు మాత్రమే కాక ఆండ్రీ రసెల్, సునీల్ నరైన్ లాంటి బిగ్ గన్స్ కేకేఆర్‌లో ఉండనే ఉన్నారు. వీరు ఈ సీజన్‌లో ఇప్పటివరకు పేలలేదు కాని, వీరిదైన రోజున వీరి ఆపడం దాదాపుగా అసంభవమని చెప్పాలి.
అయితే, ఇంత పటిష్టమైన, విధ్వంసకర బ్యాటింగ్ లైనప్ కలిగిన కేకేఆర్ ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో కేవలం రెండే విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో చివరి నుంచి మూడో స్థానంలో ఉండటం ఆ జట్టు అభిమానులను తీవ్రంగా కలిచి వేస్తుంది. లోపం ఒక్కడ ఉందో ఫ్యాన్స్ అంచనా వేయలేకపోతున్నారు. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ సత్తా చాటుతున్నప్పటికీ, గెలుపు వాకిట ఆగిపోవడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. పలువురు సీనియర్ల విశ్లేషణ మేరకు.. కేకేఆర్ బ్యాటింగ్‌లో పటిష్టంగానే ఉన్నప్పటికీ, జట్టుగా ఒక్క మ్యాచ్లో కూడా వారు కలిసికట్టుగా ఆడింది లేదు.
ఓ జట్టు గెలవాలంటే ప్రతి మ్యాచ్‌లో ఎవరో ఒకరు ఆడితే సరిపోదు. బ్యాటింగ్‌తో పాటు అన్ని విభాగాల్లో జట్టుగా రాణించాల్సి ఉంటుంది. ఈ సీజన్లో కేకేఆర్ బ్యాటర్లు అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన మ్యాచ్‌ల్లో అంతా వన్ మ్యాన్ షో నే సాగింది. కేకేఆర్ బౌలింగ్ విషయానికొస్తే.. ఉమేశ్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, టిమ్ సౌథీ, ఫెర్గూసన్, వరుణ్ చక్రవర్తి, ఆండ్రీ రసెల్, సునీల్ నరైన్, యువ స్పిన్నర్ సుయాష్‌లతో కూడిన ఆ జట్టు బౌలింగ్ సైతం పటిష్టంగా కనిపిస్తుంది.
అయితే ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో వీరు కూడా కలిసికట్టుగా రాణించింది లేదు. ఇక టీ20ల్లో అత్యంత కీలకమైన ఫీల్డింగ్ విభాగంలోనూ కేకేఆర్ పటిష్టంగానే ఉంది. నితీశ్ రాణా, రింకూ సింగ్ లాంటి వరల్డ్‌క్లాస్ ఫీల్డర్లు ఆ జట్టులో ఉన్నారు. ఇన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు.. కేకేఆర్ దాదాపుగా అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉన్నా, గెలుపు కోసం శ్రమిస్తుంది. అన్ని విభాగాల్లో బలంగా ఉన్న కేకేఆర్.. కలిసికట్టుగా ఆడితే మాత్రం వీరిని ఆపడం కష్టమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment