
ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 12) మరో ఆసక్తికర సమరం జరుగనుంది. వరుస పరాజయాలతో సతమతమవుతున్న ఢిల్లీ క్యాపిటల్స్.. హ్యాట్రిక్ విజయాలు సాధించి జోష్ మీదున్న లక్నో సూపర్ జెయింట్స్‌ను ఢీకొట్టనుంది. లక్నో హోం గ్రౌండ్ అయిన భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఎకానా స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగనుంది.
ఈ మ్యాచ్‌లో గెలుపు ఢిల్లీకి చాలా ముఖ్యం. ఇప్పటికే ఐదు మ్యాచ్‌ల్లో నాలుగింట ఓడిన ఢిల్లీ ఈ మ్యాచ్‌లో కూడా ఓడితే ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంటుంది. ప్రస్తుతం ఢిల్లీ కేవలం రెండే పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో ఉంది. మరోవైపు లక్నో తొలి మ్యాచ్‌లో ఓడి, ఆతర్వాత వరుసగా మూడు విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది.
హెడ్ టు హెడ్ రికార్డులను పరిశీలిస్తే.. ఇరు జట్లు ఇప్పటివరకు మూడు మ్యాచ్‌ల్లో ఎదురెదురుపడగా లక్నోనే మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఇరు జట్ల మధ్య సమరం అంటే వార్ వన్ సైడ్ అనేలా ఉంది. నేటి మ్యాచ్‌లోనైనా ఢిల్లీ గెలుస్తుందో లేక లక్నోనే మరో విజయం సాధిస్తుందో వేచి చూడాలి.
బలాబలాల విషయానికొస్తే.. ఢిల్లీతో పొలిస్తే లక్నో అన్ని విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తుంది. బ్యాటింగ్ కంటే బౌలింగ్ విభాగంలో లక్నో మరింత మెరుగ్గా ఉంది. యువ పేసర్లు మయాంక్ యాదవ్, యశ్ ఠాకూర్ అద్భుత ప్రదర్శనలు చేసి మూడు మ్యాచ్‌ల్లో లక్నోను గెలిపించారు. మరో పేసర్ నవీన్ ఉల్ హక్ పర్వాలేదనిపిస్తున్నాడు. స్పిన్నర్లు కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్ చెలరేగిపోతున్నారు.
లక్నో బౌలింగ్ టీమ్ ఈ సీజన్ మొత్తంలోనే బెస్ట్ బౌలింగ్ టీమ్‌గా కనిపిస్తుంది. బ్యాటింగ్ విషయానికొస్తే.. డికాక్, రాహుల్, పడిక్కల్, స్టోయినిస్, పూరన్, బదోని లాంటి విధ్వంసకర వీరులతో లక్నో బ్యాటింగ్ విభాగం అత్యంత పటిష్టంగా కనిపిస్తుంది. రాహుల్ అద్భుతమైన కెప్టెన్సీ లక్నోకు అదనపు బలంగా మారింది.
ఢిల్లీ విషయానికొస్తే.. వరుస పరాజయాలతో సతమతమవుతున్న ఈ జట్టు బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో బలహీనంగా కనిపిస్తుంది. పేసర్లు నోర్జే, ఇషాంత్ శర్మ ధారాళంగా పరుగులు సమర్పించుకుంటుండగా.. స్పిన్నర్ అక్షర్ పటేల్ ఒక్కడే పర్వాలేదనిపిస్తున్నాడు. బ్యాటింగ్‌లో పృథ్వీ షా, రిషబ్ పంత్, ట్రిస్టన్ స్టబ్స్, అభిషేర్ పోరెల్ అడపాదడపా ప్రదర్శనలు చేస్తుండగా.. డేవిడ్ వార్నర్ ఇప్పటివరకు స్థాయికి తగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. ఇన్ని ప్రతికూలతల నడుమ ఢిల్లీ నేడు లక్నోను ఎంత మేరకు నిలువరిస్తుందో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment