
PC: RCB X
IPL 2024 RCB vs KKR: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ల తీరును టీమిండియా దిగ్గజం, కామెంటేటర్ సునిల్ గావస్కర్ విమర్శించాడు. ప్రతిసారి విరాట్ కోహ్లి ఒక్కడి మీదే ఆధారపడితే ఫలితం ఇలాగే ఉంటుందని ఆగ్రహం వ్యక్తం చేశాడు. కోహ్లి ఒక్కడు ఎంతని పోరాడగలడంటూ చురకలు అంటించాడు.
కాగా ఐపీఎల్-2024లో భాగంగా ఆర్సీబీ రెండో పరాజయాన్ని చవిచూసిన విషయం తెలిసిందే. పదిహేడో ఎడిషన్ ఆరంభ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిన ఆర్సీబీ.. అనంతరం సొంతగడ్డపై పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో జయభేరి మోగించింది. అయితే, అదే జోరును కొనసాగించలేక చతికిలపడింది.
తాజాగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్‌లో ఓటమిని చవిచూసింది. చిన్నస్వామి స్టేడియంలో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఏకంగా ఏడు వికెట్ల తేడాతో ఆర్సీబీ పరాజయం పాలైంది. సొంత మైదానంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు.. ఆరంభంలోనే ఓపెనర్, కెప్టెన్ డుప్లెసిస్(8) వికెట్ కోల్పోయింది.
King Kohli in his Kingdom! 🥵🤌#RCBvsKKR pic.twitter.com/c8kgfXdWHS
— OneCricket (@OneCricketApp) March 29, 2024
మరో ఓపెనర్ విరాట్ కోహ్లి(59 బంతుల్లో 83- నాటౌట్) ఆఖరి వరకు అజేయంగా నిలిచినా.. ఇతరుల నుంచి పెద్దగా సహకారం అందలేదు. వన్‌డౌన్ బ్యాటర్ కామెరాన్ గ్రీన్ 33 పరుగులతో పర్వాలేదనిపించగా.. గ్లెన్ మాక్స్‌వెల్ మెరుపులు(19 బంతుల్లో 23) కాసేపు అలరించాయి.
ఇక రజత్ పాటిదార్(3) మరోసారి నిరాశపరచగా.. అనూజ్ రావత్(3) సైతం చేతులెత్తేశాడు. ఆఖర్లో దినేశ్ కార్తిక్(8 బంతుల్లో 20) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడి రనౌట్‌గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 182 పరుగులు స్కోరు చేయగలిగింది ఆర్సీబీ.
అయితే, కేకేఆర్ బ్యాటర్లు దంచికొట్టడంతో 16.5 ఓవర్లలోనే లక్ష్యం ఛేదించడంతో ఆర్సీబీకి ఓటమి తప్పలేదు. ఈ నేపథ్యంలో సునిల్ గావస్కర్ మాట్లాడుతూ.. ‘‘కోహ్లి ఒక్కడు ఎంతని చేయగలడు. అతడికి కనీసం ఒక్కరైనా సహకారం అందించి ఉండే బాగుండేది.
ఒకవేళ ఈరోజు తనకు మరో బ్యాటర్ నుంచి సపోర్టు దొరికి ఉంటే 83కు బదులు 120 పరుగులు చేసేవాడు. ఇది ఒక్కడి ఆట కాదు కదా. జట్టుగా ఆడాల్సిన ఆట. కానీ దురదృష్టవశాత్తూ ఈరోజు తనొక్కడే పోరాడాల్సి వచ్చింది’’ అని పేర్కొన్నాడు. మిగతా బ్యాటర్లు ఇంకాస్త మెరుగ్గా రాణించి ఉంటే ఆర్సీబీ మంచి స్కోరు చేసి ఉండేదని అన్నాడు.
ఈ మేరకు స్టార్ స్పోర్ట్స్ షోలో గావస్కర్ తన అభిప్రాయం పంచుకున్నాడు. కాగా ఆర్సీబీ తాజా ఓటమితో పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి పడిపోగా.. ఇప్పటి వరకు రెండు మ్యాచ్‌లు ఆడి గెలిచిన కేకేఆర్ నాలుగు పాయింట్లతో రెండోస్థానంలో కొనసాగుతోంది.
చదవండి: IPL 2024: రూ.11 కోట్లు తీసుకున్నాడు.. కట్ చేస్తే! ఆర్సీబీని నిండా ముంచేశాడు