IPL 2024: కోహ్లి, గంభీర్‌కు ఆస్కార్‌ ఇవ్వాలి: టీమిండియా దిగ్గజం | 'Should Be Given Oscar': Gavaskar Reacts On Kohli-Gambhir Hug In RCB vs KKR, IPL 2024 | Sakshi
Sakshi News home page

IPL 2024: కోహ్లి, గంభీర్‌కు ఆస్కార్‌ ఇవ్వాలి: టీమిండియా దిగ్గజం

Published Sat, Mar 30 2024 11:54 AM | Last Updated on Sat, Mar 30 2024 3:25 PM

Should Be Given Oscar: Gavaskar Reacts as Kohli Gambhir Hug RCB vs KKR IPL 2024 - Sakshi

గంభీర్‌తో కోహ్లి (PC: Jio Cinema)

ఐపీఎల్‌-2024.. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు- కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ మ్యాచ్‌ సందర్భంగా ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఆర్సీబీ స్టార్‌ విరాట్‌ కోహ్లి- కేకేఆర్‌ మెంటార్‌ గౌతం గంభీర్‌ ఒకరినొకరు ఆత్మీయంగా హత్తుకున్నారు.

దశాబ్దకాలంగా కోహ్లి- గంభీర్‌ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. గౌతీ కేకేఆర్‌ ఆటగాడిగా ఉన్న సమయంలోనే కోహ్లి ఓసారి మైదానంలో అతడితో వాగ్వాదానికి దిగాడు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య వైరం నడుస్తోంది.

ఇక గతేడాది లక్నో సూపర్‌ జెయింట్స్‌కు మెంటార్‌గా ఉన్న గంభీర్‌.. ఆర్సీబీతో మ్యాచ్‌ సందర్భంగా కోహ్లి- నవీన్‌ ఉల్‌ హక్‌(లక్నో బౌలర్‌) గొడవలో తలదూర్చాడు. దీంతో కోహ్లి సైతం దీటుగా బదులిస్తూ గంభీర్‌కు కౌంటర్‌ వేశాడు. క్రికెట్‌ వర్గాలను విస్మయపరిచిన ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.

ఈ విషయంలో కోహ్లి- గంభీర్‌ తప్పొప్పులను ఎంచుతూ మాజీ క్రికెటర్లు,. అభిమానులు రెండు గ్రూపులుగా విడిపోయారు. ఇదిలా ఉంటే.. తాజాగా వీరిద్దరు ఇలా కలిసిపోవడం గమనార్హం. విరామ సమయంలో కోహ్లి వద్దకు వెళ్లి గంభీర్‌ షేక్‌ హ్యాండ్‌ ఇవ్వగా.. అనంతరం ఇద్దరూ ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు.

ఈ నేపథ్యంలో కామెంటేటర్‌ రవిశాస్త్రి స్పందిస్తూ.. ‘‘విరాట్‌ కోహ్లి- గౌతం గంభీర్‌ హగ్‌ కారణంగా కేకేఆర్‌కు ఫెయిర్‌ ప్లే అవార్డు ఇవ్వాల్సిందే’’ అని పేర్కొన్నాడు. ఇందుకు బదులిస్తూ మరో కామెంటేటర్‌ సునిల్‌ గావస్కర్‌ షాకింగ్‌ కామెంట్‌ చేశాడు. 

‘‘ఫెయిర్‌ ప్లే అవార్డు ఒక్కటే కాదు. ఆస్కార్‌ అవార్డు కూడా ఇవ్వాలి’’ అని ఈ టీమిండియా దిగ్గజం పేర్కొన్నాడు. గావస్కర్‌ వ్యాఖ్య నెట్టింట వైరల్‌ కాగా.. ‘‘వీరిద్దరు కేవలం ఇలా నటించారని మాత్రమే అంటున్నారా?’’ అని నెటిజన్లు సరదాగా ట్రోల్‌ చేస్తున్నారు. 

కాగా ఈ మ్యాచ్‌లో కేకేఆర్‌ ఆర్సీబీపై ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ నేపథ్యంలో సొంతమైదానంలో కోహ్లి వీరోచిత ఇన్నింగ్స్‌(59 బంతుల్లో 83 రన్స్‌) వృథాగా పోయింది. తదుపరి ఆర్సీబీ లక్నో సూపర్‌ జెయింట్స్‌తో.. కేకేఆర్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement